పారదర్శకంగా ఓటరు తుది జాబితా ఉండాలి

పారదర్శకంగా ఓటరు తుది జాబితా ఉండాలి
  • కలెక్టర్ తో కలిసి రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు. 
  • ఫామ్ 7, 8 కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి.
  • ఓటరు నమోదు వివరాల పరిశీలన 
  • ఉమ్మడి జిల్లా  ఓటరు జాబితా పరిశీలకురాలు కె. నిర్మల. IAS.

ముద్ర ప్రతినిధి సూర్యాపేట: జిల్లాలో ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా పారదర్శకంగా ఓటర్ల జాబితా రూపకల్పన జరగాలని ఓటరు జాబితా పరిశీలకురాలు,  ప్రభుత్వ కార్యదర్శి పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ శాఖ కె. నిర్మల సూచించారు. శనివారం ఆమె కలెక్టర్ యస్. వెంకట్రావుతో కలిసి  ప్రత్యేక సంక్షిప్త ఓటరు జాబితా సవరణ, వచ్చిన దరఖాస్తులు అలాగే ఆక్షేపణలపై తీసుకున్న నిర్ణయాలపై  జిల్లాలోని నియోజక  వర్గాల వారీగా సమీక్షించారు. ఫామ్ 7, 8 కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.  ముందుగా అందించిన ఓటర్ జాబితాలో రాజకీయ  ప్రతినిధులు  ఫామ్ 7 పై కొన్ని అబ్యఅంతరాలు ఉన్నాయని స్థానిక E R O కు అందించామని పరిశీలన చేసి తొలగించాలని తెలుపగ సత్వరమే పరిశీలన చేసి చర్యలు చేపట్టాలని సూచించారు. రాజకీయ ప్రతినిధులను  ఎన్నికల నిబంధనల మేరకు సమావేశాలకు హాజరు అయ్యేలా చూడాలని వారి అబ్యఅంతరాలు కూడా పరిగణలోకి తీసుకోవాలని తెలిపారు. 

రెండవ విడత  ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం సందర్భంగా వచ్చిన దరఖాస్తులు, మార్పులు, చేర్పులను కోరుతూ ఓటర్ల నుండి సేకరించిన నిర్ణీత నమూనా ఫారాలను, రిజిస్టర్లలో వాటిని నమోదు చేసిన వివరాలు అందుబాటులో ఉంచాలని సూచించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీ.ఎల్.ఓలు, సూపర్వైజర్లకు ఓటరు నమోదు, మార్పులు-చేర్పులకు సంబంధించి అనుసరిస్తున్న పద్దతుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఓటరు నమోదు కార్యక్రమం గురించి గ్రామాల్లో విస్తృత ప్రచారం , ఇంటింటి సర్వే సందర్భంగా అడిగి తెలుసుకున్నారు. మృతి చెందిన ఓటర్ల పేర్లను జాబితా నుండి తొలగించే ముందు కుటుంబ సభ్యుల ద్వారా నిర్ధారణ చేసుకోవాలని, మరణ ధ్రువీకరణ పత్రం లేకపోయినా సంబంధిత మున్సిపల్, గ్రామ పంచాయతీ నుండి సేకరించి ప్రత్యేక రిజిస్టర్లో నమోదు చేయాలని సూచించారు. ఇతర ప్రాంతానికి వలస వెళ్లిన వారి గురించి సంబంధిత పోలింగ్ కేంద్రం అధికారులకు తెలియజేయాలన్నారు. ప్రత్యేక శిబిరాలు, ఇతరాత్ర కార్యక్రమాల సందర్భంగా నేరుగా వచ్చిన దరఖాస్తులను ఆన్లైన్లో అప్ లోడ్ చేసి, క్షేత్రస్థాయి పరిశీలనను  పూర్తి చేయాలని సూచించారు.

రాజకీయ పార్టీల ప్రతినిధులను ఉద్దేశించి పరిశీలకురాలు మాట్లాడుతూ, ఎన్నికల సంఘం నియమ, నిబంధనలు తు.చ తప్పకుండా పాటిస్తూ, పక్కాగా ఓటరు జాబితా రూపకల్పన జరిగేలా కృషి జరుగుతోందన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా ఈ ప్రక్రియలో క్రియాశీలక పాత్ర పోషిస్తూ, పూర్తి సహకారం అందించాలని కోరారు. డ్రాఫ్ట్ ఓటరు జాబితాలో ఎక్కడైనా పొరపాట్లు, తప్పిదాలను గుర్తిస్తే ఎన్నికల రిటర్నింగ్ అధికారు నియోజకవర్గాల పరిధిలో  అందచేయాలని అన్నారు. 

పక్కాగా తుది జాబితా రూపొందేలా  అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చొరవ చూపాలన్నారు.  ఈ నెల 19వ తేదీ లోపు కొత్త ఓటర్లు అందరు తమ పేర్లు నమోదు చేసుకునేలా విస్తృత ప్రచారం చేస్తూ, అవగాహన కల్పించాలన్నారు. అర్హులైన ఏ ఒక్క ఓటరు పేరు కూడా జాబితా నుండి తప్పిపోకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని, దీనివల్ల పోలింగ్ సమయంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఓటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేందుకు ఆస్కారం ఉంటుందని అన్నారు.

సమావేశంలో భాగంగా జిల్లా కలెక్టర్ యస్. వెంకట్రావ్ మాట్లాడుతూ జిల్లాలో నాలుగు నియోజక వర్గాలలో 33 కొత్త పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని అలాగే పేరు మార్పులు కింద 58 కేంద్రాలలో మార్పులు గుర్తించి చర్యలు తీసుకున్నమని జిల్లాలో మొత్తం పోలింగ్ కేంద్రాల 1201 ఉన్నాయని కలెక్టర్ వివరించారు. జిల్లాలో ఆధార్ నమోదు 90 శాతం  పూర్తి అయిందని అన్నారు. ఫామ్ 6 ద్వారా కొత్త ఓటర్ గా ఇప్పటి వరకు 18528 మందికి ఓటు హక్కు కల్పించామని, ఫామ్ 7 ద్వారా డబుల్ ఎంట్రీ, శాశ్వతంగా వెళ్లిపోయిన వారి ఓట్లు 1370 మందివి తొలిగించామని అలాగే ఫామ్ 8 ద్వారా 3854 మందికి మార్పులు చేసామని అన్నారు.  జిల్లాలో నాలుగు నియోజక వర్గాల్లో మొత్తం 934406 మంది ఓటర్లు ఉన్నారని,  ఈ సందర్బంగా కలెక్టర్ వివరించారు.

సమావేశంలో అదనపు కలెక్టర్లు సి.హెచ్. ప్రియాంక, ఏ. వెంకట్ రెడ్డి, ఆర్డీఓలు వీర బ్రహ్మ చారి, జగదీశ్వర్ రెడ్డి, సూర్యనారాయణ, నియోజక వర్గ  తహశీల్దార్లు , బి.ఆర్.యస్ పార్టీ నుండి సవరాల సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ నుండి చకిలం రాజేశ్వర్ రావు, బి.జే.పి నుండి అబిడ్, వివిధ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల విభాగపు  సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.