కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ స్కీమ్ లు బూటకం

కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ స్కీమ్ లు బూటకం
  • రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ :కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీ స్కీములు బూటకమని బీసీ సంక్షేమ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శుక్రవారం స్థానిక మీసేవ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాహుల్‌ గాంధీ బస్సుయాత్రలో అన్ని అసత్యాలే మాట్లాడారని అన్నారు.

 ఎవరో  స్క్రిప్టు రాసిస్తే చదువుతున్నారే తప్ప వాస్తవం ఏదో గమనించడం లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కు 80 వేల కోట్లు ఖర్చు అయితే లక్ష కోట్ల అవినీతి ఎలా జరుగుతుందో రాహుల్‌గాంధీ చెప్పాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.కాంగ్రెస్‌ పాలనలో భూములకు సంబంధించిన ఒక్క రికార్డునైనా అధునీకరణ చేసిందా అని ప్రశ్నించారు.భారత దేశంలో రెండు సార్లు రుణమాఫి చేసిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని చెప్పారు. కర్ణాటకలోఅధికారంలోకి వచ్చిన వెంటనే ఐదు  హామీలు అమలుచేస్తమని చెప్పి ఐదు నెలల్లోనే రాష్ట్రాన్ని అంధకారం చేశారన్నారు.కర్ణాటకలో రోజుకు వ్యవసాయ రంగానికి 7 గంటల కరెంటు ఇస్తామన్నారు. మూడు గంటలు కూడ ఇవ్వడం లేదని ఎద్దేవా చేశారు.గృహజ్యోతి పథకం కింద ప్రతి ఇంటికి 200ల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ ఇస్తామని ప్రకటించారు.  మాకు ఉచితం వద్దు నాణ్యమైన కరెంటు  ఇవ్వండి అంటూ ప్రజలు రోడ్డెక్కి ధర్నాలుచేస్తున్నారని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీకి జాతీయ విధానం ఉండాలి కానీ ఒక్కో రాష్ట్రానికి ఒక్కో రకంగా హామీలు ఇవ్వడం ఎంతవరకు సమంజసం అన్నారు. తెలంగాణలో మహాలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు రూ.2500లు ఇస్తామని చెపుతున్న కాంగ్రెస్‌ మద్యప్రదేశ్‌లో మాత్రం రూ.1500లు ఇస్తామని ప్రకటించడం వెనక మతలబు ఏమిటని అన్నారు.
కాంగ్రెస్ ని  నమ్మి ఓటు వేస్తే కర్ణాటక మాదిరి మోస పోతారు జాగ్రత్త  అంటూ హెచ్చరించారు. కరీంనగర్లో అభ్యర్థిని ప్రకటించుకోలేని దౌర్భాగ్య స్థితిలో కాంగ్రెస్ ఉందని అన్నారు.

మా బీసీ లకు కులగణన చేపట్టాలని మొత్తుకుంటున్నా కాంగ్రెస్ బీజేపీ లు పట్టించుకోవడంలేదని అన్నారు.సంఖ్య బలం ఆధారంగా రాజ్యాధికారం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు.దేశంలో మా వెనుకబడిన వారి  శాతం చెప్పండని ప్రశ్నించారు.చట్ట సభలలో మా ప్రాతినిధ్యం పెంచాలని కోరిన పట్టించుకోలేదన్నారు.బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ వై సునీల్ రావు, టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు సుడా చైర్మన్ జీవి రామకృష్ణారావు, గ్రంథాలయ కమిటీ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్ తోపాటు పలువురు పాల్గొన్నారు.