ప్రభుత్వ భూమా.. లేక పట్టానా..!

ప్రభుత్వ భూమా.. లేక పట్టానా..!
Government land or Patta

కోట్ల భూమి వ్యవహారంలో అధికారుల తీరకాసు..

రంగారెడ్డి, ముద్ర: ధరణి పుణ్యమా అంటూ ప్రభుత్వ భూములు పట్టాలుగా.. పట్టా భూములు ప్రభుత్వ భూములుగా దర్శనమిస్తున్నాయి. పైరవీకారులు  ప్రభుత్వ భూములపై కన్నేసి కోట్లా రూపాయల భూములను స్వాధీనం చేసుకునే పనిలోపడ్డారు. ఇందులో భాగంగానే కొత్తూరు మండలంలో సుమారు 50 ఎకరాల భూమి విషయం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. రికార్డులలో లావుని భూమిగా ఉన్న 50కి పైగా ఎకరాలను అధికారులు పట్టాగా మార్చేందుకు దృష్టి సారించారు. అయితే 2017లో పట్టా భూమిగా ఉండి ప్రభుత్వ భూమిగా నమోదయిందని కొత్తూరు తహసిల్దార్  రాములు తెలిపారు. లావుని పట్టాగా ఉన్న భూమిని తమకు పట్టగా చేయాలని దరఖాస్తు చేసుకున్నది వాస్తవమేనని వివరించారు. అయితే ఈ తతంగంలో అసలు ఏం జరిగి ఉంటుంది అన్నది ఆ పరమాత్మునికే ఎరుక అని మండల ప్రజలు చర్చించుకుంటున్నారు.

అయితే లావుని పట్టా ఉన్న రైతులకు న్యాయం చేసి పట్టాలు ఇవ్వాలని ఎమ్మార్పీఎస్ నాయకులు ఎర్రోళ్ల జగన్ డిమాండ్ చేస్తున్నారు. అమాయక రైతులను ఆసరాగా చేసుకుని వారికి అరకొరగా చెల్లించి పట్టాలుగా మలుచుకొనేందుకు 75 కోట్ల దందాకు తెరలేపారని జనసేన నాయకుడు రాజు నాయక్ ఆరోపించారు. దీని వెనక పెద్దల హస్తం ఉందని తగిన విచారణ చేసి బాధితులకు న్యాయం చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. కొత్తూరు మండల పరిషత్ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ఈ భూ వ్యవహారంపై విచారణ జరిపి పేద రైతులకు న్యాయం చేయాలని తాసిల్దార్ ను కోరినట్లు వివరించారు. అమాయక రైతుల పొలాలను కాజేద్దామని చూస్తే సహించేది లేదని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని  వివరించారు.