కాపు రిజర్వేషన్లు తేల్చండి

కాపు రిజర్వేషన్లు తేల్చండి

కొత్తపేట : కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు కాపు రిజర్వేషన్ల అంశం తమ పరిధిలోనిది కాదని స్పష్టం చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం ఇకపై నాన్చివేత వైఖరి విడనాడి కాపులకు రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకోవాలని, లేని పక్షంలో కాపు పెద్దలంతా చర్చించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తామని కాపు ఉద్యమ నేత, జేఏసీ నాయకుడు ఆకుల రామకృష్ణ హెచ్చరించారు. గురువారం రావులపాలెంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఈ.డబ్ల్యూ.ఎస్‌ రిజర్వేషన్ల అమలుపై రాజ్యసభలో బీసీ, ఓబీసీ రిజర్వేషన్లు రాష్ట్ర పరిధిలోని అంశమే అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిందన్నారు. ఏ కులాన్నైనా బీసీలో చేర్చాలన్నా, తీసివేయాలన్నా రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉంటుందని చెప్పడం జరిగిందన్నారు. 10 శాతం ఈ.డబ్ల్యూ.ఎస్‌ రిజర్వేషన్లను రాష్ట్రాల పరిధిలో అమలు చేసుకొనే అధికారాన్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వడం రాజ్యాంగ సమ్మతమే అని సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. ఇప్పటికే పలు మార్లు తాము అనేక సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఈ విషయాన్ని చెప్పామన్నారు. అయితే బీసీ రిజర్వేషన్ల అంశం తమ చేతుల్లో లేదని అది కేంద్రం, న్యాయస్థానాల పరిధిలో ఉందని జగన్‌ ప్రభుత్వం పక్కన పెట్టిందన్నారు.

కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు రాష్ట్రంలో కాపులకు జీవో ద్వారా చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన ఐదు శాతం రిజర్వేషన్లను కూడా జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తీసివేసిందన్నారు. కాపులకు బీసీ రిజర్వేషన్లు, ఈబీసి రిజర్వేషన్లు ఏవీ ఇవ్వకుండా వదిలేయడం ఎంత వరకు సమంజసమో ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి, కాపు ప్రజాప్రతినిధులు ఆలోచన చేయాలని సూచించారు. ఇటీవల రాజమహేంద్రవరంలో వైసీపీ కాపు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు సమావేశమై కాపు ప్రయోజనాలు కాపాడతామని స్పష్టం చేసారని, వారంతా నేడు కాపులకు సమాధానం చెప్పాలన్నారు.