కాళేశ్వరం జలాలకు ‘లక్ష జన హారతి’ 

కాళేశ్వరం జలాలకు ‘లక్ష జన హారతి’ 
  • సూర్యపేట జిల్లాలో సాగునీటి దినోత్సవం
  • కొనసాగుతున్న దశాబ్ది వేడుకలు
  • హాజరైన మంత్రి జగదీశ్వర్​రెడ్డి

ముద్ర ప్రతినిధి, సూర్యపేట : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహిస్తున్నది. 2న ప్రారంభమైన ఉత్సవాలు 22వ తేదీ వరకు జగనున్నాయి.  బుధవారం సాగునీటి దినోత్సవం  సందర్భంగా సూర్యాపేట జిల్లాలో మంత్రి జగదీశ్ రెడ్డి ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని నాగారం, ఈటూరు నుంచి పెన్ పహాడ్ మండల రావిపాడు చెరువు వరకు, నాగారం, జాజిరెడ్డిగూడెం, సూర్యాపేట రూరల్, ఆత్మకూర్ ఎస్, చివ్వేంల,పెన్ పహాడ్, మోతె మండలాల్లో  ‘కాళేశ్వరం జలాలకు లక్ష జనహారతి’ పేరుతో  68 కిలోమీటర్ల మేర లక్షమందికి పైగా రైతులు, ప్రజలు జలాలకు పూలు చల్లారు.  ‘లక్ష జన హారతి’కి రావాలంటూ గ్రామాల్లో మహిళలు బొట్టు పెట్టి పిలుచుకున్నారు. జిల్లాలో కాళేశ్వరం జలాలు పారుతున్న 126 గ్రామాల్లో  పండుగ వాతావరణం నెలకొంది.  కాలువగట్ల మీదనే వంటా వార్పు ఏర్పాటుచేశారు. గ్రామస్తులు, రైతులకు సహపంక్తి భోజనాలను ఏర్పాటుచేశారు. అన్ని ఏర్పాట్లను  కలెక్టర్ వెంకట్రావు పర్యవేక్షించారు. వైద్యశాఖ ఆధ్వర్యంలో  వైద్యబృందాలను అందుబాటులో ఉంచారు. పోలీస్​ శాఖ ఆధ్వర్యంలో  అవాంఛనీయ ఘటనలు జరగకుండా   బందోబస్తు ఏర్పాటు చేశారు. మంత్రితో పాటు ఎమ్మెల్యేల  గాధరి కిశోర్ కుమార్, బొల్లం మల్లయ్య యాదవ్, నాయకులు,  రైతులు, పెద్ద ఎత్తున్న ప్రజలు హాజరయ్యారు.