ఉప్పొంగిన మానేరు వాగు..

ఉప్పొంగిన మానేరు వాగు..
  • తెగిపోయిన తాత్కాలిక రోడ్డు..
  • నిలిచిపోయిన రాకపోకలు..

 ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం గరిమిళ్లపల్లి శివారు మానేరు వాగు ఉప్పొంగి ప్రవహిస్తుంది. వరద తాకిడికి వాగులో పోసిన తాత్కాలిక రోడ్డు మంగళవారం తెగిపోయింది. దీంతో రెండు జిల్లాల సరిహద్దు గ్రామాల ప్రజలకు రాకపోకలు నిలిచిపోయాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గరిమిళ్లపల్లి, పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడు గ్రామాల మధ్యలో మానేరు వాగు ప్రవహిస్తూ ఉంటుంది. కాగా శీతాకాలంలో  వరద ఉధృతి తగ్గగానే ప్రతి ఏడాది వాగులో తాత్కాలిక రోడ్డును నిర్మిస్తున్నారు. రోడ్డు నిర్మాణంతో రెండు జిల్లాలకు రాకపోకలు అణువుగా ఉండేవి. మంథని, గోదావరిఖని, పెద్దపల్లి తదితర పట్టణాలకు వెళ్లేందుకు ఈ ప్రాంత ప్రజలకు రవాణా సౌకర్యం ఎంతో సౌకర్యంగా ఉండేది. తాత్కాలిక రోడ్డు పోసిన నిర్వాహకులు, ఆ రోడ్డుపై వెళ్లే వాహనాలకు టోకెన్లు ఇస్తూ డబ్బులు వసూలు చేసేవారు. అయినప్పటికీ రోడ్డు సౌకర్యం ఏర్పాటు కావడంతో అనేకమంది వాహనాల్లో ఈ దారి వెంట వెళ్లేవారు. ఇలాంటి పరిస్థితుల్లో సోమవారం రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండడంతో మానేరు వాగులో వరద ఉధృతి పెరిగింది. వాగులో పోసిన తాత్కాలిక మట్టి రోడ్డు వరద ఉధృతికి తెగిపోయింది. వరద నీటికి రోడ్డు కొట్టుకపోవడంతో మంగళవారం నుండి రాకపోకలు స్తంభించిపోయాయి. రోడ్డు సౌకర్యం లేకపోవడంతో రెండు జిల్లాల సరిహద్దు గ్రామాల ప్రజలు నానా ఇబ్బందులు పడుతూ దూరప్రాంతాల మీదుగా గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు.