ప్రశాంతంగా టీచర్​ఎమ్మెల్సీ ఎన్నికలు

 ప్రశాంతంగా టీచర్​ఎమ్మెల్సీ ఎన్నికలు
  • 90.40 శాతం పోలింగ్‌ నమోదు 
  • 16న కౌంటింగ్​.. వెల్లడించిన అధికారులు 

ముద్ర, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సోమవారం ప్రశాంతంగా ముగిసింది. ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. సమయం ముగిసేసరికి క్యూలైన్లలో ఉన్నవారంతా ఓటుహక్కు వినియోగించుకునేందుకు అధికారులు అవకాశం కల్పించారు. అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో ఓటింగ్‌ ప్రక్రియ సజావుగా సాగినట్లు అధికారులు పేర్కొన్నారు. పోలింగ్ ముగిసేవరకు 90.40 శాతం పోలింగ్‌ నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. 

స్ట్రాంగ్ రూంలకు బ్యాలెట్ బాక్సులు 
మహబూబ్‌నగర్‌ జిల్లాలో 87.75 శాతం, నాగర్‌ కర్నూల్‌ జిల్లాలో 93.96 శాతం, వనపర్తిలో 93.48 గద్వాల్‌లో 97.15 శాతం, నారాయణ్‌పేట్‌లో 93.77 శాతం, రంగారెడ్డిలో 86.90 శాతం, వికారాబాద్‌ జిల్లాలో 94.76, హైదరాబాద్‌లో 82.25 శాతం, మేడ్చల్‌ మల్కాజిగిరి 83.54 పోలింగ్‌ నమోదైనట్లు అధికారులు తెలిపారు. పోలింగ్‌ ప్రక్రియ ముగిసిన అనంతరం బ్యాలెట్‌ బాక్సులకు సరూర్‌నగర్‌లోని ఇండోర్‌ స్టేడియంలోని స్ట్రాంగ్‌ రూంలకు తరలించారు. మార్చి 16వ తేదీ ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహిస్తారు.

ఉపాధ్యాయ సంఘాలకు ఇబ్బందికర పరిస్థితి..
ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతలు అంశాలను ఓటర్లను ఏమాత్రం ప్రభావితం చేయలేదు. 317 జీఓవల్ల నష్టపోయిన టీచర్లు, బదిలీలు, పదోన్నతులపై ఆశలు స్నగిల్లిన టీచర్లను సంతృప్తిపర్చడం ఉపాధ్యాయ సంఘాలకు ఇబ్బందికరంగా మారింది. ఈ ఎన్నికల్లో సంఘాల అభ్యర్థులకు కాకుండా ఓట్లు చీలినట్లు సమాచారం.