కాంగ్రెస్ కుక్కలను మన దొడ్లోనే కట్టేస్తం

12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టిఆర్ఎస్ లో చేర్చుకోవడం వెనుక ఉన్న మర్మం విడమరిచి చెప్పిన పల్లా

అధికార టిఆర్ఎస్ పార్టీ 88 స్థానాలు గెలుచుకున్నా 12 మంది కాంగ్రెస్ నేతల్ని తమ పార్టీలో చేర్చుకోవడం వెనుక ఉన్న మతలబును విడమరిచి చెప్పారు రైతు బంధు సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీలో ఉంటే కుక్కల్లా అరుస్తారని అలాంటి కుక్కలను మన పార్టీలో చేర్చుకుని పిల్లుల్ని చేశామని, సిఎం కెసిఆర్ ఈ ఉద్దేశ్యంతోనే కాంగ్రెస్ పార్టీ నేతలను కండవాలు కప్పుతున్నారని కార్యకర్తలతో బహిరంగంగా చెప్పేశారు ఎమ్మెల్సీ పల్లా. జనగామ టికెట్ ను ఆశిస్తున్న నేపధ్యంలో తన స్వగ్రామం షోడషపల్లిలో జనగామ నియోజకవర్గ కార్యకర్తలతో మాట్లాడుతూ పార్టీ గొప్పదని పేర్కొంటూ తనకే అవకాశం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే నాటి టిఆర్ఎస్ నేటి బిఆర్ఎస్ పార్టీ ఎదుగుతున్న తీరును వివరిస్తూనే ప్రతిపక్షంలో ఎవర్నీ నోరెత్తకుండా ఎలా వ్యవహరిస్తున్నారో సిఎం కెసిఆర్ తరుచూ తనతో చెబుతుండేవారని కుండబద్దలు కొట్టేశారు. కాంగ్రెస్ పార్టీ నేతలు ఆ పార్టీలో ఉండి టిఆర్ఎస్ ప్రభుత్వంపై కుక్కల్లా అరుస్తున్నారని అందుకే సిఎం కెసిఆర్ ఆ అరిచే కుక్కల్నీ టిఆర్ఎస్ లో చేర్చుకుని పిల్లుల్లా మార్చారని చెప్పుకొచ్చారు. రానున్న రోజుల్లో కూడా ఇదే జరుగబోతోందని చెప్పారు.