టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ పై రిపోర్టు ఇవ్వాలి

టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ పై రిపోర్టు ఇవ్వాలి

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీక్  కేసులో  ప్రాథమిక నివేదికను  ఇవ్వాలని సిట్ ను ఆదేశించింది  తెలంగాణ హైకోర్టు.  అయితే  ఈ రిపోర్టు  ఇచ్చేందుకు  సమయం  ఇవ్వాలని  తెలంగాణ ప్రభుత్వ  తరపు న్యాయవాది హైకోర్టును  కోరారు.  దీంతో  విచారణను  ఏప్రిల్  11వ తేదీకి వాయిదా వేసింది  తెలంగాణ హైకోర్టు.  టీఎస్‌పీఎస్‌సీ  పేపర్ లీక్  కేసును సీబీఐతో  విచారణ చేయించాలని  ఎన్ఎస్‌ యూఐ  తెలంగాణ హైకోర్టులో  పిటిషన్ దాఖలు  చేసింది. ఈ పిటిషన్ పై  కాంగ్రెస్ పార్టీ లీగల్  సెల్  వివేక్ ధన్కా  మంగళవారం  వాదనలు విన్పించారు. టీఎస్‌పీఎస్‌సీ  లీక్  కేసుపై సమగ్ర విచారణ  జరిపించాలని  ఆయన  డిమాండ్  చేశారు.  పేపర్ లీక్ కేసుకు సంబంధించి ఇద్దరు నిందితులకు  సంబంధం  ఉందని  మంత్రి కేటీఆర్  చేసిన వ్యాఖ్యలను  వివేక్ ధన్కా  హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు  ఈ పేపర్ లీక్  వెనుక  పెద్దల హస్తం ఉందని  ఆయన అనుమానం వ్యక్తం  చేశారు.  విచారణ  పూర్తి కాకుండా  ఈ కేసుతో  ఇద్దరికే  ప్రమేయం ఉందని ఎలా చెబుతారని  వివేక్  ప్రశ్నించారు.  పేపర్ లీక్  విషయంలో  స్థానిక  పోలీసులపై  నమ్మకం లేదని  వివేక్ ధన్యా వాదించారు.  ఈ కేసు విచారణను  సీబీఐతో  జరిపించాలని  ఆయన  డిమాండ్  చేశారు.   ఈ కేసు  లక్షల మంది  అభ్యర్ధులకు  సంబంధించిన  అంశంగా  వివేక్  చెప్పారు. 
గ్రూప్-1 క్వాలిఫైడ్  అభ్యర్ధుల  వివరాలు ఎందుకు  రహస్యంగా  ఉంచుతున్నారని  ఆయన  ప్రశ్నించారు.  క్వాలిఫైడ్ అభ్యర్ధుల వివరాలు  వెబ్ సైట్ లో  ఎందుకు పెట్టలేదని  వివేక్  ప్రశ్నించారు.  ఒకే  మండలంలో  20 మంది  అధిక మార్కులు  సాధించిన విషయాన్ని  కూడా  వివేక్ గుర్తు  చేశారు సీబీఐ లేదా స్వతంత్ర దర్యాప్తు  సంస్థతో  దర్యాప్తు  జరిపించాలని  వివేక్ కోరారు.  గతంలో  వ్యాపమ్  కేసును  సుప్రీంకోర్టు  సీబీఐ విచారణకు  ఆదేశించిందని  వివేక్ గుర్తు చేశారు.  వ్యాపమ్  స్కామ్ తీర్పును  హైకోర్టుకు  వివేక్ ధన్కా అందించారు.  ఈ పిటిషన్ పై  విచారణను  ఏప్రిల్  11వ తేదీకి వాయిదా వేసింది  హైకోర్టు.