4 పరీక్షలు రద్దు.. టీఎస్​పీఎస్సీ నిర్ణయం 

4 పరీక్షలు రద్దు.. టీఎస్​పీఎస్సీ నిర్ణయం 
  • పేపర్లు లీకయ్యాయని నిర్ధారణ
  • పరీక్ష రాసిన 56 వేల మంది
  • విచారణ కొనపాగిస్తున్న సిట్​ 
  • వివరాలను సేకరిస్తున్న పోలీసులు
  • వెలుగులోకి దిమ్మదిరిగే వాస్తవాలు
  • 48 మంది అమ్మాయిల న్యూడ్​ వీడియోలు గుర్తింపు
  • అన్నింటిలోనూ రేణుక హస్తం
  • గురుకుల ఉపాధ్యాయ ప్రశ్నాపత్రాల లీకుపైనా అనుమానాలు

ప్రశ్నాపత్రాలు లీకైనట్లుగా తేలడంతో పలు పరీక్షలను రద్దు చేస్తున్నట్లు టీఎస్​పీఎస్సీ ప్రకటించింది. అసిస్టెంట్​ఇంజనీర్, మున్సిపల్ ఇంజినీర్​, టెక్నికల్ ఆఫీసర్, జూనియర్​ టెక్నికల్ ఆఫీసర్​ పోస్టులకు నిర్వహించిన పరీక్షలను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. 837 పోస్టులకు ఈ నెల ఐదున పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. 56 వేల మంది అభ్యర్థులు ఈ పరీక్షలు రాశారు. బుధవారం రాత్రి వరకు సమావేశమైన టీఎస్​పీఎస్సీ పాలకవర్గం చివరకు పరీక్షలు రద్దు చేయాలని తీసుకున్నది.


టీఎస్​పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీలో దిమ్మదిరిగే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. లీకులకు పాల్పడిన ప్రవీణ్​ఫోన్​లో ఏకంగా 48 మంది అమ్మాయిల న్యూడ్​వీడియోలను సిట్​గుర్తించింది. వీరంతా ఆయా పోటీ పరీక్షలు రాసినవారేనని తేలింది. ఈ కేసులో ప్రధాన పాత్రదారి రేణుక ఈ అమ్మాయిలను ప్రవీణ్​కు పరిచయం చేసినట్లుగా తెలుస్తున్నది. రేణుక గురుకుల ఉపాధ్యాయురాలిగా 2018లో ఎంపికైంది. అప్పుడు కూడా పేపర్​ లీకైనట్లుగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై విచారణ చేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. 

ముద్ర, తెలంగాణ బ్యూరో :
 సిట్ అధికారులు బుధవారం సాయంత్రం టీఎస్ పీఎస్సీ కార్యాలయానికి చేరుకుని, వివిధ అంశాలపై సిబ్బందిని ప్రశ్నించారు. ప్రధాన నిందితుడుగా ఉన్న ప్రవీణ్ క్యాబిన్‌ ను తనిఖీ చేశారు. ఉద్యోగాల భర్తీ పరీక్షలతో పాటుగా డిపార్ట్​మెంటల్​ ఎగ్జామ్స్​కు సంబంధించి మొత్తం 25 పేపర్లను లీకయ్యాయని ప్రాథమికంగా గుర్తించారు. సిట్ దర్యాప్తు నివేదికను బుధవారం రాత్రి లేదా గురువారం ఉదయం ప్రభుత్వానికి, ఉన్నతాధికారులకు సమర్పించనున్నట్లు సమాచారం. ఈ నివేదిక ఆధారంగానే గ్రూప్​ –1 ప్రిలిమ్స్​ తో పాటుగా పలు పరీక్షలపై నిర్ణయం తీసుకోనున్నారు. బుధవారం రాత్రి పొద్దుపోయే వరకు పాలకవర్గం అత్యవసరంగా సమావేశం నిర్వహించింది. 

ఆరా తీస్తున్న అధికారులు
ప్రవీణ్ రాసలీలల గురించి సిట్ అధికారులు కూపీ లాగుతున్నారు. టీఎస్ పీఎస్సీకి వచ్చే మహిళలను అతను ట్రాప్ చేశాడని అధికారులు భావిస్తున్నారు. వీరిలో కొంతమందిని రేణుక పరిచయం చేసినట్లుగా గుర్తించారు. 48 మంది మహిళలతో అతను చాట్ చేశాడని పేర్కొన్నారు. మహిళలతో పరిచయం పెంచుకొని, వారిని నగ్నంగా వీడియోకాల్స్ మాట్లాడాలని ప్రవీణ్ ఒత్తిడి చేశాడని, వారికి ఆయా పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలను ఇస్తానని చెప్పాడని తేలింది. ప్రవీణ్​ఫోన్‌ను సిట్ అధికారులు పూర్తి డేటా సేకరించుకుని, సీజ్ చేశారు. పేపర్ లీక్ చేసిన ప్రవీణ్ 2017 నుంచి ఇలాంటి పరిస్థితులను అవకాశంగా తీసుకుంటున్నట్లుగా అనుమానిస్తున్నారు. టీఎస్ పీఎస్సీ వెరిఫికేషన్ విభాగంలో పనిచేసిన సమయంలో.. అప్లికేషన్లలో వచ్చిన పొరపాట్లను సరిదిద్దుకునేందుకు వచ్చిన మహిళలతోమాట కలిపేవాడని, సమస్య పరిష్కరించి వారి ఫోన్​ నంబర్ తీసుకునేవాడని, వారిలో కొందరితో సంబంధం కూడా పెట్టుకున్నట్టు తెలిసింది. 

గతంలో కూడా
గతంలో నిర్వహించిన గురుకుల ప్రశ్నాపత్రాలు సైతం లీకై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. దీని కోసం నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న పెన్​ డ్రైవ్​లను పరిశీలిస్తున్నారు. ప్రవీణ్ పోలీస్​ అధికారి కుటుంబం నుంచి రావడంతో, టీఎస్​పీఎస్సీలో కొంత గౌరవం ఇచ్చేవారని, విధి నిర్వహణలో వినయ, విధేయలతో మెలుగుతూ ఉన్నాతాధికారులకు దగ్గరయ్యాడని తెలుస్తున్నది. దీంతో పరీక్షలకు సంబంధించిన వివరాలు, దరఖాస్తులు, ప్రశ్నాపత్రాలను భద్రపర్చే కంప్యూటర్లు ఉన్న గదుల్లోకి చొరవగా వెళ్లే స్వేచ్ఛను సంపాదించాడు. ఏ పని కావాలన్నా క్షణాల్లో పూర్తి చేయించేగల స్థాయికి చేరాడు. దీంతో టీఎస్​పీఎస్సీ సెక్రెటరీ పీఏగా నియమించుకున్నట్లు గుర్తించారు. 

సహాయంగా రేణుకా రాథోడ్​
ఈ పేపర్  లీకేజీ ఘటనలో కీలక నిందితురాలు రాథోడ్‌ రేణుక గురించి ఆరా తీసే కొద్దీ ఆశ్చర్యకర విషయాలు బయటకు వస్తున్నాయి. మహబూబ్‌నగర్‌ జిల్లా గంఢీడ్‌ మండలానికి చెందిన రేణుక వనపర్తి ఎస్సీ గురుకుల విద్యాలయంలో హిందీ పండిట్‌గా పని చేస్తున్నది. ఆమె భర్త ఢాక్యానాయక్‌ వికారాబాద్‌ జిల్లా పరిగిలోని డీఆర్‌డీఏలో పనిచేస్తున్నారు.  రేణుక ఈ యేడాదిలో ఏకంగా 12 సెలవులు పెట్టింది. ఇందులో మార్చి నెలలోనే 6 సెలవులు పెట్టింది. మార్చి 4, 5 తేదీలలో తమ బంధువు మృతి చెందాడని సెలవు పెట్టింది. తాము పేపర్ అమ్మిన అభ్యర్థులకు ఆ తేదీలలో రేణుక దంపతులు ఇంటిలో  ప్రిపేర్ చేయించారు. అటు  రేణుక సర్టిఫికెట్ల విషయంలోనూ పలు అనుమానాలు నెలకొన్నాయి.  రేణుకపై శాఖా పరమైన చర్యల కోసం గురుకుల సెక్రెటరీ రోనాల్డ్ రోజ్కు గురుకుల ప్రిన్సిపాల్ లెటర్ రాశారు. 

వికృత చేష్టలను భరించారు
ఈ కేసులో ప్రవీణ్​ చీకటి కార్యకలాపాలు పోలీసులకు దొరికాయి. ప్రవీన్​ మొబైల్​ ఫోన్​లో చాలా న్యూడ్​ వీడియోలు గుర్తించారు. చాలా మంది మహిళల ఫోన్​ నంబర్లు కూడా ఉన్నాయి. ఇలా 48 మందికి చెందిన న్యూడ్​ వీడియోలున్నాయి. రాత్రివేళ మహిళలు నగ్నంగా చేసిన వీడియోకాల్స్​ను ప్రవీణ్​ రికార్డు చేసుకుని భద్రపర్చుకున్నాడు. అయితే, సదరు మహిళలను ప్రవీణ్​ బెదిరించాడా; లేకుంటే ప్రశ్నాపత్రాలకు ఆశపడి అతని వికృత చేష్టలను భరించారా? అనే విషయాన్ని తేల్చే పనిలో పడ్డారు. 

బీజేపీ ఆధ్వర్యంలో టాస్క్​ఫోర్స్​
టీఎస్‌పీఎస్‌సీ పరీక్ష పేపర్ లీకేజీ అంశానికి సంబంధించి బీజేపీ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసింది. కన్వీనర్‌గా టీఎస్‌పీఎస్‌సీ మాజీ సభ్యుడు విఠల్ వ్యవహరించనున్నారు. సభ్యులుగా బూర నర్సయ్య గౌడ్, మర్రి శశిధర్ రెడ్డి, రామచందర్ రావు, చంద్రవదన్, కృష్ణ ప్రసాద్, ఎ. ప్రసాద్ ఉంటారు. పేపర్ లీకేజీ వ్యవహారంలో వాస్తవాలు గుర్తించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వారిని ఆదేశించారు. టీఎస్‌పీఎస్‌సీఎదుట ఆందోళన చేసిన బీజేవైఎం కార్యకర్తలపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి అరెస్ట్ చేయడాన్ని సంజయ్ తీవ్రంగా ఖండించారు. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నవారిని వదిలేసి న్యాయం కోసం పోరాడుతున్న బీజేవైఎం కార్యకర్తలను అరెస్ట్ చేయడమేంటని ప్రశ్నించారు. లీకేజీ కేసును నీరుగార్చేందుకు  రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వంయత్నిస్తోందని, అందులో భాగంగానే సిట్‌కు అప్పగించారని ధ్వజమెత్తారు. సమగ్ర విచారణ జరిపి దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపిస్తేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పేర్కొన్నారు. 

టీఎస్​పీఎస్సీ కార్యాలయంలో సిట్​
సిట్ చీఫ్ ఏఆర్ శ్రీనివాస్ బుధవారం టీఎస్పీఎస్సీ ఉన్నతాధికారులతోభేటీ అయ్యారు. టీఎస్పీఎస్సీ కార్యాలయానికి వెళ్లిన ఆయన, పరీక్షల నిర్వాహణ సీక్రెసీతో పాటు, ప్రింటింగ్ వ్యవహారాలపై ఆరా తీశారు. కాన్ఫిడెన్షియల్ రూంను కూడా పరిశీలించారు. కాన్ఫిడెన్షియల్ రూం నుంచి పేపర్ బయటకు వెళ్లినట్లు గుర్తించారు. కాన్ఫిడెన్షియల్ రూమ్ ఇన్చార్జీ ప్రసన్నలక్ష్మిని ప్రశ్నిస్తున్నారు. ప్రసన్నలక్ష్మి దగ్గర ఉన్న పాస్‌వర్డ్, ఐడీలను ప్రవీణ్ చోరి చేసినట్లు పోలీసులు గుర్తించారు. పూర్తి నివేదికను బుధవారం రాత్రి లేదా గురువారం ఉదయం ఇస్తామని తెలిపారు. ఈ నెల ఐదున జరిగిన ఏఈ పరీక్ష పశ్న పత్రాలు లీకైనట్లు ఆధారాలు లభించాయని, మొత్తం 24 పేజీల ప్రశ్నపత్రాల నకళ్లు లభ్యమయ్యాయని తెలిపారు. ఈ నెల 12న నిర్వహించాలనుకున్న టౌన్‌ప్లానింగ్‌ బిల్డింగ్‌ ఓవర్‌సీర్‌పరీక్షకు సంబంధించి 25 పేజీల ప్రశ్నపత్రాలు కూడా లభించినట్లు వెల్లడించారు.

ఆమరణ నిరాహార దీక్ష చేస్తా
టీఎస్పీఎస్సీ గ్రూప్– 1 పరీక్ష 48 గంటలలో రద్దు చేయకపోతే హైదరాబాద్ నడిబొడ్డున ఆమరణ నిరాహారదీక్ష చేస్తానని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్న టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్ధన్ రెడ్డి వెంటనే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎంతో మంది పేద విద్యార్థుల తల్లిదండ్రులు  ఆస్థులు అమ్ముకొని వాళ్ల పిల్లల్ని చదివిస్తుంటే టీఎస్పీఎస్సీ వ్యవహరించిన తీరు చాలా బాధకరమని ఆవేదన వ్యక్తంచేశారు. గతంలో తాను కూడా టీచర్స్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ గా పని చేశానని, చైర్మన్ కు తప్ప మరెవరికి తెలియని పాస్వర్డ్ ఆఫీసులో పనిచేసే ఉద్యోగుల వద్దకు ఎలా వెళ్ళిందో తెలంగాణ సమాజానికి చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. కారుణ్య నియామాకాలలో అపాయింట్ అయిన ప్రవీణ్ తన ప్రియురాలి కోసం కాన్ఫిడెన్సియల్  మెటీరియల్ తీసుకున్నారంటే శోచనీయమని అన్నారు. ముఖ్యమంత్రికి నిరుద్యోగుల జీవితాలమీద శ్రద్ధ లేదని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. జనార్దన్ రెడ్డిని చైర్మన్ పదవి నుండి తొలగించి సీబీఐ ద్వారా విచారణ జరిపించాలని  డిమాండ్ చేశారు.