ధాన్యం కొనుగోలుపై బిజెపి ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి 

ధాన్యం కొనుగోలుపై బిజెపి ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి 

పాల్గొన్న వందలాది రైతులు

వారంలో కొనుగోలు చేయకపోతే 25 వేల మందితో అష్టదిగ్బంధం

హమాలీ లిఫ్టింగ్ చార్జీల పేరిట దోపిడీ

- మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, నిర్మల్: రైతులు పండించిన దాన్యం కొనుగోలు ప్రభుత్వం అనుసరిస్తున్న జాప్యాన్ని  నిరసిస్తూ బిజెపి నేత మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ ముట్టడించారు. దాదాపు 200 మంది రైతులు సహా బిజెపి నేతలు  ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారంలో కొనుగోళ్ళు పూర్తి చేస్తామని కలెక్టర్ ఇచ్చిన హామీ నెరవేరనందుకు నిరసనగా ఈ ముట్టడి చేపట్టారు. వారం రోజుల క్రితం జిల్లాలోని సారంగాపూర్ మండలం జామ్ వద్ద ప్రధాన రహదారి పై రాస్తారోకో నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాస్తారోకో కు నాయకత్వం వహించిన మహేశ్వర్ రెడ్డి కలెక్టర్ వరుణ్ రెడ్డి తో చర్చించారు. ఈ మేరకు వారం పూర్తయినా కొనుగోళ్లలో వేగం పెరగక పోవడంతో మహేశ్వర్ రెడ్డి సహా పలువురు బిజెపి నేతల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడించారు. తొలుత కలెక్టరేట్ ఎదుట నిరసన వెలిబుచ్చి అనంతరం కార్యాలయంలోకి దూసుకెళ్లారు.

ఈ సందర్భంగా మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఎక్కడికక్కడ గుట్టలుగా ధాన్యం రాశులు పేరుకుపోయాయన్నారు. కొనుగోళ్ల సమయంలో హమాలీ చార్జీల పేరిట రూ.40, లిఫ్టింగ్ చార్జీల పేరిట రూ.25, క్వింటాలుకు 2 నుండి 3 కిలోల ధాన్యం తరుగుతో రైతులను దోచుకుంటున్నారని అన్నారు. ఈ దోచుకున్న డబ్బులు ఎక్కడికి వెళుతున్నాయన్నారు.  కలెక్టర్ ఇచ్చిన హామీకి గతి లేదన్నారు. అనంతరం కలెక్టర్ తో మాట్లాడారు. అధికారులు మరో వారం గడువు కోరటంతో అంగీకరించి వెను దిరిగారు. మరో వారంలో కొనుగోళ్ళు పూర్తి కాకుంటే 25 వేల మందితో అష్ట దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నేతలు రావుల రాం నాథ్, అంజు కుమార్ రెడ్డి, మెడిసెమ్మె రాజు, రాజేశ్వర్ రెడ్డి, మల్లికార్జున రెడ్డి సరికెల గంగన్న, భూపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.