మైనార్టీలు చదువు ప్రాధాన్యతను గుర్తించాలి - రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్

మైనార్టీలు చదువు ప్రాధాన్యతను గుర్తించాలి - రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్
  • మైనార్టీ లబ్ధిదారులకు ఒక కోటి 20 లక్షల రూపాయలు అందజేత 

సిరిసిల్ల టౌన్, ముద్ర: తెలంగాణ ప్రభుత్వం మైనార్టీల విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేస్తుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. ఆదివారం సిరిసిల్ల నియోజకవర్గంలోని మైనార్టీ లబ్ధిదారులకు ఆర్థిక సహాయ పథకం కింద 120 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున ఒక కోటి 20 లక్షల రూపాయలను అందజేశారు. అలాగే పేద మైనార్టీ మహిళలకు 425 మందికి ఒక్కొక్కరికి పదివేల రూపాయల విలువగల 425 కుట్టుమిషన్లను రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ వచ్చాక సిఎం కేసిఆర్ మైనార్టీల కోసం పెద్ద ఎత్తున గురుకులాలు స్థాపించారని చెప్పారు. నియోజకవర్గానికి ఒక్క మైనారిటీ గురుకులం పెట్టారన్నారు. మైనార్టీ బాలబాలికలకు ఐదు నుంచి డిగ్రీ  వరకు గురుకులాల ద్వారా ఉచితంగా నాణ్యమైన విద్యను అందిస్తున్నారన్నారు. ఇందు కోసం ఏటా ఒక్కో విద్యార్థి పై ప్రభుత్వం ఒక లక్షా 20 వేలను ఖర్చు చేస్తుందన్నారు. ఎస్సీ, ఎస్టీ ,బిసి గురుకులాలలో సీట్లకు విపరీతమైన డిమాండ్ ఉండగా మైనార్టీ గురుకులాలకు తమ పిల్లలను పంపించేందుకు ఆసక్తి చూపించడం లేదన్నారు. ఫలితంగా కొన్ని మైనారిటీ గురుకులాలలో సీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు. మైనార్టీలు చదువు ప్రాధాన్యతను గుర్తించి తమ పిల్లలను ముఖ్యంగా బాలికలను గురుకులాల్లో చేర్పించాలన్నారు.  ప్రజా ప్రతినిధులు కూడా ప్రత్యేక చొరవ తీసుకొని మైనార్టీ గురుకులాలు అన్ని సీట్లు భర్తీ అయ్యేలా చూడాలన్నారు. 

జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా  నాయక్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీల అభివృద్ధికి విశేష కృషి చేస్తుందన్నారు. ప్రభుత్వం అందించిన ఈ ఆర్థిక సహాయంను సద్వినియోగం చేసుకొని మైనార్టీలు ఆర్థికంగా బలోపేతం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పి చైర్ పర్సన్ న్యాలకొండ అరుణా రాఘవ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా చక్రపాణి, నాఫ్స్కాబ్ ఛైర్మన్ కొండూరి రవీందర్ రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు ఆకునూరి శంకరయ్య, రైతు బంధు సమితి అధ్యక్షులు గడ్డం నర్సయ్య , జెడ్పీటీసీ మంజుల, ఎంపీపీ మానస, మైనార్టీ శాఖ ఓఎస్డీ సర్వర్ మియా, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.