పదవ తరగతి ఫలితాలను మెరుగుపర్చాలి...   మహబూబాబాద్ జిల్లాకలెక్టర్ శశాంక 

పదవ తరగతి ఫలితాలను మెరుగుపర్చాలి...    మహబూబాబాద్ జిల్లాకలెక్టర్ శశాంక 

ముద్రప్రతినిధి‌,మహబూబాబాద్: పాఠశాలల్లో  10వ తరగతి ఫలితాలను 100 శాతం సాధించేందుకు ప్రధానోపాధ్యాయులు కృషిచేయాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు.
మహబూబాబాద్ లో శుక్రవారం ఐడిఓసి.కార్యాలయంలోని సమావేశమందిరంలో ఏజెన్సీ ప్రాంతాల్లో జెడ్పి, కెజిబివి, ఆశ్రమ హైస్కూల్స్, మోడల్ స్కూల్స్ లలో 10వ తరగతి ఫలితాలను 100 శాతం సాధించేలా ముందస్తు కార్యాచరణ ప్రణాళికపై, వసతుల కల్పనపై భద్రాచలం, ఏటూరునాగారం ఐటిడిఎ పీఓలతో కలిసి పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో కలెక్టర్ శశాంక సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ శశాంక మాట్లాడుతూ...10వ తరగతి ఫలితాలు 100 శాతం సాధించేందుకు ప్రయత్నిస్తూ గత ఫలితాలకంటే ప్రస్తుత ఫలితాలను మరింత మెరుగు పరిచేందుకు ప్రణాళిక రూపొందించు కోవాలన్నారు.
గతంలో ఫెయిల్ అయిన సంఖ్యను దృష్టిలో పెట్టుకొని అందరూ పాస్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని, ఇకపై ఫెయిల్ అన్నది ఉండరాదన్నారు.
విద్యార్థులు ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలని, తద్వారా విద్యలో ముందుండే అవకాశం ఉందని కలెక్టర్ శశాంక సూచించారు.
భోజన విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, తాజావస్తువులు, కూరగాయలు సరఫరా జరిగేలా ప్రతిరోజు పర్యవేక్షించాలన్నారు. 
విద్యార్థులతో వసతి గృహ అధికారులు తప్పనిసరిగా రాత్రిళ్ళు బస చేయాలని, వారితో అనుబంధం పెంచుకోవాలన్నారు. 
పాఠశాలల వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటామన్నారు.
పరీక్ష వ్రాసే విద్యార్థులకు పాడ్స్ అందిస్తామన్నారు.
విద్యార్థులను ప్రతిరోజూ పలుకరిస్తూ వారితో మమేకమై ఇబ్బందులు, సమస్యలు తెలుసుకుంటూ పరిష్కరిస్తూ ఉత్తమ విద్యార్థుల భవిష్యత్ కు మార్గనిర్ధేశనం గా ఉపాధ్యాయులు నిలవాలని తెలిపారు.
ఈ సమావేశంలో గిరిజన సంక్షేమ అధికారి ఎర్రయ్య, విద్యాశాఖఅధికారి రామారావు, గురుకులాల ఆర్సీఓ రాజ్యలక్ష్మి, గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ అధికారి హేమలత, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.