అనుమతి లేని ప్రచార సామాగ్రి, ఫ్లెక్సీ లు ప్రచురిస్తే చర్యలు

అనుమతి లేని ప్రచార సామాగ్రి, ఫ్లెక్సీ లు ప్రచురిస్తే చర్యలు

జిల్లా పౌర సంబంధాల అధికారి, ఎం.సి.ఎం. సి. కార్యదర్శి యన్. భీమ్ కుమార్

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: అనుమతి లేని ప్రచార సామాగ్రి, ఫ్లెక్సీ లు ప్రచురించిన యెడల ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా పౌర సంబంధాల అధికారి, ఎం.సి.ఎం. సి. కార్యదర్శి యన్. భీమ్ కుమార్ అన్నారు. బుధవారం ఐడిఓసి సమావేశ మందిరంలో జిల్లాలోని ప్రింటింగ్ ప్రెస్, ఫ్లెక్సీ దుకాణాల యజమానులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు ప్రింటింగ్ చేయించే ప్రచార సామాగ్రి, ఫ్లెక్సీ లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ నేతృత్వంలోని మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ ద్వారా ముందస్తు అనుమతి పొందాలని, ప్రచురించే ప్రచార సామాగ్రి ప్రింటింగ్ ప్రెస్ పేరు, చిరునామా, సెల్ నెంబర్, ప్రచురణల సంఖ్య, ప్రచురించే అభ్యర్థి పేరు, చిరునామా వివరాలు తప్పని సరిగా అట్టి ప్రచార సామాగ్రి పై ప్రచురించాలని తెలిపారు.

ప్రచురించవలసిన వివరాలకు సంబంధించిన మ్యాటర్ ను నిర్ణీత ప్రోఫార్మలలో సమర్పించాలని, అట్టి వాటిని ఎం.సి.ఎం.సి. కమిటీ పరిశీలించి 24 గంటలలోగా అనుమతించడం గాని, తిరస్కరించడం గాని జరుగుతుందని తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన వారిపై ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్ 127-A ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో కలెక్టరేట్, ఎన్నికల విభాగం తహశీల్దార్ షాదాబ్ హకీమ్, ఎన్నికల సిబ్బంది ప్రసాద్, కిరణ్, ఫారూఖ్, తదితరులు పాల్గొన్నారు.