అమ్మవారి దయతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి

అమ్మవారి దయతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి

రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ 

గోదావరిఖని ముద్ర:  బొగ్గు బాయిలు మూతపడితే గోదావరిఖనికి భవిష్యత్తు లేదనే నానుడిని దూరం చేసి, గోదావరిఖనికి అనంతమైన భవిష్యత్తును కల్పించాలని, రామగుండం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేలా ముఖ్యమంత్రి కేసీఆర్  రాష్ట్ర మంత్రివర్యులు కేటీఆర్  కొప్పుల ఈశ్వర్  సహకారంతో కృషి చేస్తున్నానని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు.శుక్రవారం ఎమ్మెల్యే విజయవాడలోని ఇంద్రకీలాద్రి పైనున్న దుర్గా మల్లేశ్వర స్వామిని దర్శించుకుని భవానీ దీక్ష స్వీకరించారు. ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా శరన్నవరాత్రులను పురస్కరించుకొని నవరాత్రి దీక్షలు, గత నాలుగు సంవత్సరాలుగా భవాని మండల దీక్షను స్వీకరిస్తున్నానన్నారు. రామగుండం నియోజకవర్గంలోని సకల జనులు, నియోజకవర్గాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న సీఎం కెసిఆర్, రాష్ట్ర మంత్రులు కేటీఆర్, కొప్పుల ఈశ్వర్, సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశానన్నారు.

వారి సహకారంతో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నియోజకవర్గంలో శాశ్వత ఉద్యోగ, ఉపాధి, సౌకర్యాలను కల్పించానన్నారు. రూ. 500 కోట్లతో మెడికల్ కళాశాల, రూ. 30 కోట్లతో ఐటి, ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు, రూ. 26 కోట్లతో సీనియర్ సివిల్ జడ్జ్ కోర్టు నిర్మాణం, రూ. 300 కోట్లతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంతోపాటు అనేక అభివృద్ధి పనులు చేపట్టానన్నారు. కెసిఆర్  హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలందరికీ మరింత సేవలందించే విధంగా దీవించాలని, కేసీఆర్  ప్రజల సంపూర్ణ మద్దతు ఉండాలని స్వామివారిని వేడుకున్నానన్నారు. కరోనా మూలంగా రెండు సంవత్సరాలపాటు పాలన కుంటుపడినా, దాదాపు మూడు సంవత్సరాల కాలంలో నా జీవితం ప్రజాసేవకే అంకితమని చెప్పినట్లుగా రోజుకు 16 గంటలు ప్రజాసేవలోనే గడిపానన్నారు. నియోజకవర్గంలో ఎటు చూసినా గణనీయమైన అభివృద్ధి కంటికి కనబడుతోందని, అదే తన పాలనకు నిదర్శనమన్నారు. అభివృద్ధి కొనసాగింపు కోసం రానున్న ఎన్నికల్లో ప్రజలంతా తనను ఆశీర్వదించాలని ఎమ్మెల్యే కోరారు.