అయోధ్య పాసుల పేరుతో సైబర్ నేరగాళ్ల దాడి

అయోధ్య పాసుల పేరుతో సైబర్ నేరగాళ్ల దాడి

ముద్ర ప్రతినిధి, బీబీనగర్: సైబర్ నేరగాళ్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని బీబీనగర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ యుగంధర్ గౌడ్ ప్రజలను హెచ్చరించారు. రామజన్మభూమి అయోధ్యలో ఈ నెల 22న జరగనున్న బాలరాముడి ప్రతిష్ఠాపన కార్యక్రమానికి వీఐపీ పాసుల పేరుతో సైబర్ నేరగాళ్లు వలవిసిరి మొబైల్ ఫోన్లలో డేటాను కొల్లగొడుతున్నారని ఆయన తెలిపారు. ఒక లింక్ ను క్లిక్ చేయడం ద్వారా రామమందిరం ప్రతిష్టాపన కార్యక్రమానికి వీఐపీ పాస్ మీకు లభిస్తుందంటూ ఒక ఏపీకే ఫార్మేట్ ఫైల్ ను మొబైళ్లకు పంపిస్తూ వంచిస్తున్నారని ఆయన వివరించారు.

ఈ విధంగా మీ మొబైళ్ల ఫోన్లకు వచ్చిన ఏపీకే ఫైల్ ను ఎట్టిపరిస్థితులలోనూ ఓపెన్ చేయవద్దని, ఇది ఒక మాల్ వేర్ అని ఆయన తెలిపారు. ఈ ఫైల్ ఓపెన్ చేసిన వెంటనే, మీ మొబైల్ లో వున్న అన్ని వివరాలు వారు దొంగిలించే అవకాశం వుందని, అందువల్ల ప్రజలు జాగ్రత్త వహించాలని ఎస్ఐ యుగంధర్ గౌడ్ సూచించారు. తద్వారా మీరు మొబైల్ లో వుంచుకున్న బ్యాంక్ ఖాతాల వివరాలు, ఇతర వివరాన్నీ వారి చేతుల్లోకి వెళ్లి మీరు మోసపోయే అవకాశం ఉందని హెచ్చరించారు.