రామన్నపేట, మద్దుట్లలో బోనాల జాతర

రామన్నపేట, మద్దుట్లలో బోనాల జాతర

ఘనంగా పోచమ్మకు బోనాలు సమర్పించిన మహిళలు

ముద్ర, మల్యాల: మండలంలోని రామన్నపేట, మద్దుట్ల గ్రామాల్లో గ్రామస్తులు గురువారం పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల వేడుకలు జాతరను తలపించాయి. రామన్నపేటలోని వరదకాలువ వద్ద ఇటీవల నిర్మించిన ఇందూరు పోచమ్మ ఆలయంలో బోనాలు సమర్పించేందుకు పెద్ద ఎత్తున గ్రామస్తులు తరలిరావడంతో రహదారి కిక్కిరిసింది. 500 లకు పైగా మంది మహిళలు బోనాలతో డప్పు చప్పుల్లు, పోతురాజు విన్యాసాల మధ్య ఆలయానికి చేరుకొని పోచమ్మ తల్లికి మొక్కులు సమర్పించారు. అనంతరం ఆలయ ఆవరణలో ఘనంగా పట్నం వేశారు. ఆలయ ఆవరణలో మేకను గావు పట్టే కార్యక్రమం స్థానికులను అకర్శించింది. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షులు ఎండీ వలీ, సర్పంచ్ గడ్డం జలజమల్లారెడ్డి, పన్నాల మహేందర్ రెడ్డి, తిరుపతి రెడ్డి, పోచంపల్లి ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.

 మద్దుట్ల గ్రామంలో...
మద్దుట్ల గ్రామంలో గురువారం పోచమ్మ బోనాల వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామంలో ఆలయం నిర్మించి ఏడాది కావస్తుండడంతో ప్రతి ఇంటి నుంచి మారు బోనం తీసి, పోచమ్మ తల్లికి సమర్పించారు. గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించగా, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.