మరోసారి ప్రజలను మోసం చేసేందుకే ముఖ్యమంత్రి  కొత్త పథకాలు 

మరోసారి ప్రజలను మోసం చేసేందుకే ముఖ్యమంత్రి  కొత్త పథకాలు 

బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావు

ముద్ర ప్రతినిధి, సూర్యాపేట:ఎన్నికల సమీపిస్తున్నందున మరోసారి ప్రజలను మోసం చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త డ్రామాలాడుతూ నూతన పథకాలు ప్రకటించడం ఒక కుట్రపూరిత చర్య అని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావు విమర్శించారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బిజెపి కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. 
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కాంగ్రెస్ కంటే ఎక్కువ హామీలు ఇచ్చి  బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని... ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని ఆరోపించారు.
 టిఆర్ఎస్ ప్రభుత్వం వస్తే తమ బాధలు తీరుతాయని ఆశించిన అన్ని వర్గాల ప్రజలను ముఖ్యమంత్రి కేసీఆర్ మోసం చేశారన్నారు. అసెంబ్లీ సాక్షిగా ఇండ్లు లేని వారికి రూ.3లక్షలు ఇస్తామని, రైతు రుణమాఫీ, దళితులకు మూడు ఎకరాల భూమి,  నిరుద్యోగ  భృతి, యాదవులకు గొర్రెల పంపిణీ వంటి హామీలు ఇచ్చిన ప్రభుత్వం ఇప్పటివరకు పూర్తిస్థాయిలో అమలు చేయకపోవడం శోచనీయమన్నారు.
బిఆర్ఎస్ పార్టీ ఓడిపోతుందని కెసిఆర్ నిర్వహించిన అన్ని సర్వేలలో తేలిపోయిందనీ, ఎమ్మెల్యేలు మంత్రుల అవినీతి  అంతా బయటపడిందని, తమ పార్టీ తప్పకుండా మరోసారి దొడ్డి దారిన అధికారం  చేజిక్కించుకోవడానికి వేస్తూ తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి మరోసారి ఆచరణ సాధ్యం కానీ హామీలను ఇవ్వడం జరుగుతుందన్నారు. రైతులకు రుణమాఫీ చేయకపోవడం తో పాటు సకాలంలో మద్దతు ధరకు వడ్లు కొనే దిక్కు లేదని రైతులందరూ అకాల వర్షాలకు నానా కష్టాలు పడుతున్నారని ఇదేనా టిఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు ఇస్తున్న విలువని ప్రశ్నించారు. టిఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం అవినీతి ప్రభుత్వం గా మారిందని రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి తెలంగాణ లో ప్రతి పౌరునికి లక్షలాది రూపాయల అప్పులు మిగిల్చడం తప్ప 
బీ ఆర్ఎస్ ప్రజలకు ఒరగబెట్టింది ఏం లేదని ధ్వజమెత్తారు
1500మంది అమరుల త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ  తెలంగాణ రాష్ట్రంలో  నీళ్లు, నిధులు, నియామకాలను  కేసీఆర్ కుటుంబం దోచుకున్నదని ప్రాణహిత చేవెళ్ళ  ప్రాజెక్టు రీడిజైనింగ్ చేసి, వేల కోట్ల అవినీతి చేసి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు కేసీఆర్ ఫామ్ హౌస్ లోకి పోతున్నాయనీ ఎద్దేవా చేశారు.వర్షాలతో బ్రహ్మాండంగా నీళ్లు పారుతుంటే అవి కాళేశ్వరం నీళ్లు అని ఎమ్మెల్యేలు,  మంత్రులు పసుపు , కుంకుమ, పూలు చల్లి ప్రజల చెవిలో పూలు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రాకపోగా కేసీఆర్ కుటుంబంలో అందరికి ఉద్యోగాలు వచ్చాయనీ వివరించారు.
అభివృద్ధి పేరుతో సాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, మైనింగ్ మాఫియా చేసి దోచుకుంటున్నారనీ,మంత్రి అసమర్ధ పాలనతో ధాన్యం సరైన సమయంలో కొనుగోలు చేయకపోవడంతో రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారనీ వాపోయారు.కొనుగోళ్ల అలస్యంతో 1500 రూపాయలకే ధాన్యాన్ని మిల్లర్లు కొనుగోలు చేశారనీ, తరుగు తేమ పేరుతో రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు.2019 నుండి నేటి వరకు సీఎమ్మార్ ఇవ్వని మిల్లర్లపై కలెక్టర్ చర్యలు ఎందుకు తీసుకోవడం లేదో సమాధానం చెప్పాలనీ డిమాండ్ చేశారు. గ్రామాలు, జిల్లాల అభివృద్ధి చెందితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని నరేంద్రమోదీ కేంద్ర ప్రభుత్వ నిధులను ఇస్తుంటే రూ.6వేల కోట్లతో అభివృద్ధి చేశా అని మంత్రి చెప్పడం విడ్డ్డురంగా ఉందని,దీనిపై శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు.సూర్యాపేటలో ప్రభుత్వ భూములను, గుట్టలను, చెరువులను  బిఆర్ఎస్ నాయకులు కబ్జా చేస్తున్నారని ఆరోపించారు.రైతులకు భరోసా ఇచ్చి బిజెపి అండగా ఉండేందుకు ఈ నెల 22న రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహిస్తుందన్నారు.ఈ విలేకరుల సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షుడు చల్లమల్ల నరసింహ, పట్టణ ప్రధాన కార్యదర్శి  ఆరూరి శివ, సోషల్ మీడియా పార్లమెంట్ కో కన్వీనర్ కొప్పుల క్రాంతి రెడ్డి, మైనారిటీ మోర్చా పట్టణ అధ్యక్షుడు షేక్ సలీం పాషా, జిల్లా నాయకులు దాసరి వెంకన్న యాదవ్, పంతంగి సాలయ్య, రాపోలు ఉపేందర్, ధరావత్ లక్ష్మణ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు..