వివాదం భూముల్లో సంయుక్తంగా సర్వే చేయండి

వివాదం భూముల్లో సంయుక్తంగా సర్వే చేయండి

కలెక్టర్  రాజర్షి షా, ఎమ్మెల్యే పద్మ

ముద్ర ప్రతినిధి, మెదక్:మెదక్, హవేళిఘనాపూర్ మండలాలలో అటవీ, రెవెన్యూ శాఖల మధ్య  వివాదంలో ఉన్న భూములను సంయుక్తంగా సర్వే చేసి నివేదిక అందజేవలసినదిగా  జిల్లా కలెక్టర్  రాజర్షి షా అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ లో మెదక్ ఎమ్మెల్యే పద్మా  దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో అటవీ, రెవెన్యూ శాఖల మధ్య వివాదంలో ఉన్న భూముల పరిష్కారంపై  అదనపు కలెక్టర్ రమేష్, అటవీ,రెవెన్యూ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి సమీక్షించారు. మెదక్ మండలంలోని ఖాజిపల్లి, బాలానగర్, గుట్టకిందిపల్లి, హవేళిఘనాపూర్ మండలంలోని బూరుగుపల్లి, బొగడ భూపతి పూర్ లలోని వివిధ సర్వే నెంబర్లలో అటవీ, రెవెన్యూ శాఖల మధ్య వివాదంలో ఉన్న  భూములను సంయుక్తంగా సర్వే నిర్వహించి భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా పక్కాగా డిమార్కింగ్ చేయాలని సూచించారు.

 కాస్తులో ఉన్న లబ్దిదారులకు పట్టాలిచ్చిన భూమి అటవీ పరిధిలో  ఉన్నట్లయితే  వాటిపై ప్రభుత్వానికి ప్రత్యేక అనుమతికై   ప్రతిపాదనలు సిద్ధం చేయవలసినదిగా  జిల్లా అటవీ శాఖాధికారికి  సూచించారు. ఈ సమావేశంలో జిల్లా పరిషద్ వైస్ చైర్మన్ లావణ్య రెడ్డి,ఎంపిపి అధ్యక్షురాలు యమునా జయరాంరెడ్డి, జిల్లా అటవీ అధికారి రవి ప్రసాద్, ఆర్.డి.ఓ. సాయి రామ్,  ఫారెస్ట్ రేంజ్ అధికారి మనోజ్ కుమార్, తహసీల్ధార్లు  శ్రీనివాస్, నవీన్, ఆత్మ అధ్యక్షులు అంజాగౌడ్, రైతు బందు అధ్యక్షులు కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.