రాష్ట్రంలో ఈసీ పర్యటన

రాష్ట్రంలో ఈసీ పర్యటన
  • ప్రధాన రాజకీయ పార్టీలతో భేటీ
  • అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతపై  సమీక్ష

ముద్ర, తెలంగాణ బ్యూరో : కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు రాష్ట్ర పర్యటనకు వచ్చారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం హైదరాబాద్ కు చేరుకున్నారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతపై సంబంధిత అధికారులతో, అనంతరం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో సమావేశమయ్యారు. సమావేశంలో ఎలక్షన్‌ కమిషనర్లు అనూప్‌చంద్ర పాండే, అరుణ్‌ గోయల్‌, సీనియర్‌ డిప్యూటీ ఎలక్షన్‌ కమిషనర్లు ధర్మేంద్ర శర్మ, నితీశ్‌కుమార్‌ వ్యాస్‌, డిప్యూటీ ఎలక్షన్‌ కమిషనర్లు అజయ్‌ భాడూ, హిర్దేశ్‌కుమార్‌, ఆర్కే గుప్తా, మనోజ్‌కుమార్‌ సాహూ తదితరులు ఉన్నారు.

ఈసీ తదుపరి సమావేశాలు..

బుధవారం ఉదయం 6.30 గంటలకు హైదరాబాద్ దుర్గం చెరువు దగ్గర కేబుల్ బ్రిడ్జిపై నిర్వహించే ఓటరు చైతన్య కార్యక్రమంలో ఈసీ బృందం పాల్గొంటుంది. అనంతరం ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 7 వరకూ అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో సమావేశం జరపనుంది. ఈ సందర్భంగా అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై ఈసీ బృందం చర్చిస్తుంది. గురువారం ఉదయం 9.15 నుంచి 10.05 గంటల మధ్య టెక్‌ మహీంద్రా ఆడిటోరియంలో సిస్టమేటిక్‌ ఓటర్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ఎలక్టోరల్‌ పార్టిసిపేషన్‌ ప్రోగ్రామ్‌ ఎగ్జిబిషన్‌లో ఈసీ సభ్యులు పాల్గొంటారు. ఉదయం 11 నుంచి 12 గంటల వరకు సీఎస్‌, డీజీపీ, ఉన్నతాధికారులతో సమావేశమై ఎన్నికల నిర్వహణపై చర్చిస్తారు. అనంతరం ఈసీ బృందం మీడియా సమావేశం నిర్వహించి ఎన్నికల షెడ్యూల్ పై స్పష్టత ఇచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది.