రైతులు మనోధైర్యంతో ఉండాలి.. ప్రభుత్వం ఆదుకుంటుంది

రైతులు మనోధైర్యంతో ఉండాలి.. ప్రభుత్వం ఆదుకుంటుంది

రాజన్న సిరిసిల్ల  జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్ 

ముద్ర ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల:వడగండ్ల వానతో నష్టపోయిన రైతులు అధైర్యపడొద్దని, ప్రభుత్వం ఆదుకుంటుందని జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్ రైతులకు భరోసానిచ్చారు. రాత్రి కురిసిన అకాల వర్షాలకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పంటలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో ఎల్లారెడ్డి పేట, గంభీరావుపేట, వీర్ణపల్లి మండలాల్లోని  గొరింటాల, మల్లు పల్లె, గుంట చెరువుపల్లి తండా, కంచర్ల  గ్రామాల్లో జిల్లా అదనపు కలెక్టర్, రైతు బంధు సమితి అధ్యక్షులు గడ్డం నర్సయ్య, జిల్లా వ్యవసాయ, ఉద్యానవ అధికారులు,  స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పర్యటించారు. వడగండ్ల వర్షాలతో దెబ్బతిన్న పంటలను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. రైతులతో సమావేశం అయ్యారు. పంటనష్టం వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో జరిగిన పంట నష్ట తీవ్రతపై నివేదిక సిద్ధం చేయాల్సిందిగా రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఆదేశాలు జారీ చేయగా అధికారులు గ్రామాల్లో సర్వే నిర్వహించారు. మంత్రి కేటీఆర్ ఆదేశాలతో ఇప్పటికే రెవెన్యూ, వ్యవసాయ, ఉద్యానవన అధికారులు జిల్లాలో పంట క్షేత్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ నష్టపోయిన రైతుల వివరాలను సేకరిస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ తెలిపారు.  అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులు అధైర్యపడవద్దని ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని జిల్లా కలెక్టర్ వారికి భరోసా ఇచ్చారు.
నష్ట వివరాలు రాగానే ప్రభుత్వానికి నివేదించి నష్టపోయిన రైతులకు  నష్టపరిహారం అందేలా చూస్తామని చెప్పారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ ఖిమ్యా నాయక్  పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. రానున్న రెండు రోజులు జిల్లాలో అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్న దృష్ట్యా ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రైతులు కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యాన్ని టార్పాలిన్ లో తడవకుండా  కప్పి ఉంచాలన్నారు.కోనుగోలు చేసిన దాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి మిల్లులకు  తరలించాలని,  ఎక్కడా ఎటువంటి అలసత్వం వహించరాదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట మండలం ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.