గంజాయి మత్తు.. యువత చిత్తు

గంజాయి మత్తు.. యువత చిత్తు

భూదాన్ పోచంపల్లి,ముద్ర:- భూదాన్ పోచంపల్లి మండలంలో గంజాయి వాడకం విచ్చలవిడిగా మారింది. ఈ మత్తులో పడి యువత తమ భవిష్యత్తును, ఆరోగ్యాన్ని కోల్పోతున్నారు .పట్టణంలోని కొంతమంది యువకులు ఆ మత్తులోనే చిత్తవుతున్నారు.విద్యార్థులు, యువకులు యుక్త వయసులో విద్యను అభ్యసించి ఉన్నత ఉద్యోగాలు సాధించాల్సిన వారే గంజాయికి అలవాటు పడి తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. కుటుంబానికి మంచి పేరు తెస్తారని తల్లిదండ్రులు కలలు కంటుంటే వీరు మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు.  నాడు పట్టణాలకే పరిమితమైన గంజాయి భూతం నేడు గ్రామాలకు పాకింది.

యువత మత్తు పదార్థాలకు అలవాటు పడుతూ చోరీలకు పాల్పడుతూ ,ఇతరులపై దాడులు చేస్తూ ప్రమాదాలకు పాల్పడడం, ప్రేమ వ్యవహారాలు తదితర కారణాలతో విచిత్రంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. పోచంపల్లి పట్టణంలో కొంతమంది యువత గంజాయికి అలవాటు పడ్డారని పలువురు గుసగుసలాడుతున్నారు. గంజాయి మాఫియా పట్టణ శివారులలో  జోరుగా సాగుతుందని ఆరోపణంలో వినిపిస్తున్నాయి. కొందరు యువకులు మద్యం,గంజాయి మత్తుకు అలవాటు పడి తమ విలువైన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. సిగరెట్ లోని తంబాకును దులిపేసి దాని స్థానంలో గంజాయిని నింపుకొని దమ్ము లాగిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. యువత పక్కదారి పడుతున్న నేపథ్యంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా లేకపోతే అనేక ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. పోలీసులు దృష్టి పెట్టకపోతే మరిన్ని అల్లర్లు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికైనా పోలీసులు గంజాయి అమ్మకం వాడకదారులపై పూర్తిస్థాయిలో దృష్టి సాదించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పట్టణవాసులు కోరుతున్నారు.

కఠిన చర్యలు తీసుకుంటాం : ఎస్సై విక్రమ్ రెడ్డి

గంజాయికి బానిసలుగా మారుతున్న యువతపై  తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉంటూ ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని స్థానిక ఎస్ఐ విక్రమ్ రెడ్డి అన్నారు. యువత తన బంగారు భవిష్యత్తును ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దని కోరారు. గంజాయి రవాణా చేసిన అమ్మినా చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు .ఎవరైనా గంజాయి విక్రయించినట్లు తెలిస్తే తక్షణమే 8712662482 లేదా డయల్ 100 కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు.