ఎండాకాలం దృష్ట్యా తాగునీటి సమస్య రాకుండా అధికారులు చర్యలు చేపట్టాలి...

ఎండాకాలం దృష్ట్యా తాగునీటి సమస్య రాకుండా అధికారులు చర్యలు చేపట్టాలి...
  • మన ఊరు మనబడి  పెండింగ్ పనులను నెలాఖరులోగా పూర్తి చేయాలి...
  • కంటి వెలుగు ను  ప్రజలు  సద్వినియోగం చేసుకోవాలి....
  • జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్  న్యాలకొండ అరుణా రాఘవ రెడ్డి

b
ఎండాకాలం దృష్ట్యా జిల్లాలో తాగునీటి సమస్య రాకుండా మిషన్ భగీరథ అధికారులు ప్రత్యేక కార్యచరణ చేపట్టాలని, ప్రతివారం వారి మండలాల్లోని ప్రతి గ్రామాన్ని మిషన్ భగీరథ అధికారులు సందర్శించి , అప్పటికప్పుడు సమస్యలను పరిష్కరించి ,తాగునీటి ఎద్దడిని నివారించాలని  జడ్పీ చైర్పర్సన్ అరుణ రాఘవరెడ్డి అన్నారు. గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని జడ్పీ కార్యాలయంలో జడ్పీ చైర్పర్సన్ రాఘవరెడ్డి  అధ్యక్షతన జిల్లా స్థాయీ సంఘ సమావేశాలు నిర్వహించారు.


విద్య, వైద్యం, ప్రణాళిక, ఆర్థిక, గ్రామీణాభివృద్ధి, నిర్మాణ పనుల స్టాండింగ్ కమిటీలకు జడ్పీ చైర్ పర్సన్ అధ్యక్షత వహించగా, వ్యవసాయం పై వైస్ చైర్మన్ సిద్ధం వేణు, మహిళా సంక్షేమ పై తంగళ్ళపల్లి జడ్పీటిసి పూర్మాని మంజుల, సాంఘిక సంక్షేమం పై బోయినపల్లి జడ్పీటీసీ కత్తెర పాక ఉమ కొండయ్య  స్టాండింగ్ కమిటీలకు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్పర్సన్ అరుణ రాఘవ రెడ్డి గారు మాట్లాడుతూ జిల్లాలో మన ఊరు మనబడి  పెండింగ్  పనులను నెలాఖరులోగా పూర్తి చేయాలని  అధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామంలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకునేలా అధికార లు అవగాహన కల్పించాలని,ఎండ కాలం  దృష్ట్యా జిల్లాలో హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కల సంరక్షణకు అధిక ప్రాధాన్యత నివ్వాలని  అధికారులకుసూచించారు.


దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చేపడుతుందని , తెలంగాణలోనే అభివృద్ధి సంక్షేమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను  అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు భాగస్వామ్యంతో  ప్రతి గడపకు అందేలా చూడాలని , అదేవిధంగా జిల్లాలో చేపడుతున్న కార్యక్రమాల పురోగతిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ నిర్దేశిత సమయంలో పనులు పూర్తయ్యేలా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.


జిల్లాలో పాడి అభివృద్ధికి విశేష అవకాశాలు ఉన్న దృష్ట్యా పాడి గేదెల యూనిట్లను అర్హులందరికీ మంజూరు చేయాలని, యూనిట్లను అందజేసే ముందు వారికి ప్రత్యేక శిక్షణ ఇస్తే అధిక లాభాలు సొంతం చేసుకునే అవకాశం ఉందన్నారు. మినీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపనకు ప్రభుత్వం 35 శాతం రాయితీ ఇస్తుందని,వ్యక్తులు గానీ, సమూహాలు గా గానీ, పాక్స్ ద్వారా గాని యూనిట్ లను స్థాపన చేయవచ్చునని అన్నారు. రైతులు సాంప్రదాయ వ్యవసాయ పద్ధతుల నుండి బయటపడి పంట మార్పిడి పై దృష్టి సారించాలని, ప్రభుత్వం అందించే రైతులను వినియోగించుకొని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను స్థాపించి ఆర్థిక స్వలంబన సాధించాలన్నారు.


అప్పటి ప్రభుత్వాల హయాంలో లక్ష రూపాయల రుణం ఇవ్వాలంటే లబ్ధిదారులు ఎంతో కష్టపడాల్సి వచ్చేదని, తెలంగాణ  ప్రభుత్వం వచ్చిన తర్వాత సులభంగా  అన్ని వర్గాల ప్రజలకు యూనిట్ల స్థాపనకు ఆర్థిక సహకారం అందజేస్తుందన్నారు. దళిత బంధు పథకం ద్వారా దళితుల జీవితాల్లో అభివృద్ధి వెలుగులు నింపేలా భారీ ఆర్థిక సహాయం ప్రభుత్వం  అందజేస్తుందన్నారు. 
ఈ సమావేశంలో వైస్ చైర్మన్ సిద్దం వేణు , జడ్పీటిసి లు కత్తెరపాక ఉమ కొండయ్య, పూర్మాని మంజుల లింగారెడ్డి , గట్ల మీనయ్య గ, నాగం కుమార్, మ్యాకల రవి , చీటీ లక్ష్మణ రావు ,  విజయ లక్ష్మణ్ , ఏస వాణి , గుండం నర్సయ్య , గుగులోత్ కళావతి సురేష్ నాయక్ , కోఆప్షన్ సభ్యులు చాంద్ పాషా, అహ్మద్, జడ్పీ సీఈఓ గౌతమ్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు