జూనియర్ లెక్చరర్ కోర్భా లక్ష్మికి డాక్టరేట్

జూనియర్ లెక్చరర్ కోర్భా లక్ష్మికి డాక్టరేట్

నాగర్ కర్నూల్,ముద్ర ప్రతినిధి: నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రానికి చెందిన కోర్భా లక్ష్మి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అందుకున్నారు.జోగిని వ్యవస్థపై ప్రొఫెసర్ డాక్టర్ కె.రామకృష్ణ పర్యవేక్షణలో చేసిన పరిశోధనకు గాను డాక్టరేట్ పొందారు. లక్ష్మి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో జూనియర్ లెక్చరర్‌గా పని చేస్తున్నారు. దళిత నిరుపేద కుటుంబంలో జన్మించారు. చిన్నపుడు సొంతూళ్లో చూసిన జోగినిల జీవితం ఆమెను చలింపజేసింది.దీంతో తన పరిశోధన అంశంగా ఇప్పటి వరకు ఎవరూ ఎంచుకోని జోగిని ఎంచుకున్నారు.ఇలా  ది జోగిని సిస్టం ఇన్ తెలంగాణ ఏ సోషియో, ఎకనామిక్ అండ్ కల్చరల్ స్టడీ(1956-2010) పేరిట  పిహెచ్ డి   పూర్తి చేశారు. సమాజంలో దళిత, నిరుపేద మహిళలు జోగిని వ్యవస్థ ద్వారా ఎలా లైంగిక దోపిడీకి గురయ్యారు, అప్పటి నుంచి వారి జీవితంలో వచ్చిన మార్పులు, తదితర అంశాల్లో లక్ష్మి పరిశోధనలు  చేశారు.  

ఇటీవల ఉస్మానియా యూనివర్శిటీలో జరిగిన కార్యక్రమంలో సూపర్వైజర్ కె.రామకృష్ణ,  ప్రొఫెసర్లు అంజయ్య, ఇందిర,‌ అర్జున్ రావు, జరీనా పర్వీన్, తదితరులు లక్ష్మికి పిహెచ్ డి పట్టాను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... చిన్నప్పుడు సొంతూరిలో చూసిన దురాచారమైన జోగిని వ్యవస్థ ద్వారా దళిత, పేద మహిళలు లైంగిక దోపిడీకి ఎలా గురవుతున్నది, ఎలా అవమానాలు పడుతున్నదీ, తదితర అంశాలను ప్రపంచం ముందుంచాలనే ఉద్దేశంతో ఈ పరిశోధన చేశానని తెలిపారు. ప్రభుత్వ విధానాలు, చదువు, మారిన ప్రజల దృక్పథాలు జోగిని వ్యవస్థలో మార్పు తీసుకొచ్చాయన్నారు. తన పరిశోధనకు సహకరించిన ప్రాఫెసర్లు,‌ కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఇంటర్ విద్యా శాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా లక్ష్మిని కళాశాల ప్రిన్సిపాల్, లెక్చరర్లు, బంధువులు అభినందించారు.