కేసీఆర్ రైతు ద్రోహి

కేసీఆర్ రైతు ద్రోహి
  • వైఎస్సార్‌‌టీపీ అధ్యక్షురాలు షర్మిల
  • వడగళ్ల బాధితులను పరామర్శ
  • ఎకరాకు రూ.30 వేల పరిహారం ఇవ్వాలని డిమాండ్‌

ముద్ర ప్రతినిధి, జనగామ :  సీఎం కేసీఆర్‌ రైతు బంధువు కాదు.. ఆయన‌ రైతు వ్యతిరేకి.. రైతు ద్రోహి అని వైఎస్సార్‌‌టీపీ అధ్యక్షురాలు వై.ఎస్‌ షర్మిల మండిపడ్డారు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలో ఇటీవల కురిసిన వడగళ్ల వానకు దెబ్బతిన్న పంటలను శనివారం ఆమె పరిశీలించి రైతులను ఓదార్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జనగామ జిల్లా వ్యాప్తంగా 50 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు చెప్పారు. చేతికొచ్చిన పంట మొత్తం నేల పాలై రైతులు సర్వం కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క బచ్చన్నపేట మండలంలోనే 10 వేల ఎకరాలకు పైగా నష్టం జరిగినట్లు తెలుస్తోందన్నారు. ఇంత నష్టం జరిగినా ప్రభుత్వం ఒక్క ఎకరాకు కూడా పరిహారం ఇవ్వలేదన్నారు. - గత నెల 23న సీఎం కేసీఆర్‌‌ హెలికాప్టర్‌‌లో వచ్చి రూ.10 వేల సాయం అంటూ ప్రకటన చేశాడు తప్ప ఇప్పటి వరకు ఒక్కరికైనా ఒక్క రూపాయి ఇవ్వలేదన్నారు. ఎకరాకు రూ.10 వేలు కాదు వెంటనే రూ.30 వేల పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

అనంతరం జనగామ నుంచి మహబూబాబాద్‌ జిల్లా కురవి వెళ్తూ దారిలో లింగాలఘణపురం నెల్లుట్ల గుడిసె వాసులతో మాట్లాడారు. తన పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం రూ.15 లక్షలతో సోలార్ లైటింగ్ ఏర్పాటు చేసినందుకు వారు షర్మిలకు ధన్యవాదాలు తెలిపారు. ఆమె వెంట పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులు పిట్ట రాంరెడ్డి, నీలం రమేశ్‌,  జనగామ జిల్లా అధ్యక్షులు గౌరబోయిన సమ్మయ్య, జనగామ నియోజకవర్గ కోఆర్డినేటర్ ఇందుర్తి వెంకట్ రెడ్డి, జిల్లా మహిళా అధ్యక్షరాలు మనేగాల్ల మంజుల, మహిళా పొదుపు సంఘాల జిల్లా అధ్యక్షురాలు చెప్పాల వసంత, జిల్లా ప్రధాన కార్యదర్శి చింతకింది శ్రీహరి, జిల్లా యూత్ అధ్యక్షుడు ఊరాడి శ్రీనివాస్, జనగామ నియోజకవర్గం యూత్ అధ్యక్షుడు వంశీ, బచన్నపేట మండల అధ్యక్షుడు వగలబోయిన శ్రీకాంత్, జిల్లా నాయకులు గుగిల్ల శ్రీధర్, బొడ్డు ప్రవీణ్, కుషంగల శివ, వివిధ మండల అధ్యక్షులు ఉన్నారు.