అన్నీతానై.. అండగా ఉండి

అన్నీతానై.. అండగా ఉండి
  • ఎన్నికల ప్రచారంలో కేటీఆర్​ జోష్
  • 60 రోజుల్లో 70 రోడ్ షోలు.. 30 పబ్లిక్ మీటింగ్స్
  • 30కి పైగా ఇంటర్వ్యూలు.. 150కి పైగా టెలీ కాన్ఫరెన్స్ లు
  • ప్రత్యర్థుల విమర్శలకు దీటుగా సమాధానం

ముద్ర, తెలంగాణ బ్యూరో : సుమారు 60 రోజులుగా సాగిన ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్​వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్​అన్నీ తానై పార్టీని ముందుకు నడిపించారు.  పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ తర్వాత అత్యధిక సభలు, రోడ్ షోలు, ర్యాలీల్లో ఆయన పాల్గొన్నారు. 60 రోజుల్లో 70 రోడ్ షోలతోపాటు 30 పబ్లిక్ మీటింగ్​లు నిర్వహించారు. అలాగే 30కి పైగా ఇంటర్వ్యూలు, 150కి పైగా టెలీ కాన్ఫరెన్స్ లు నిర్వహించి కార్యకర్తలతో మాట్లాడారు. మరోవైపు పార్టీ ప్రచార ప్రణాళికల నుంచి మొదలుకుని క్షేత్రస్థాయి సమన్వయం వరకు విస్తృతంగా పనిచేశారు. ఎన్నికల షెడ్యూల్ కి ముందే మంత్రి హోదాలో దాదాపు 30 నియోజకవర్గాలు విస్తృతంగా పర్యటించారు. ఒక్కొక్క నియోజకవర్గంలో కనీసం రెండు రోడ్ షోలతోపాటు ఎల్బీనగర్, శేర్లింగంపల్లి, మల్కాజ్ గిరి వంటి పెద్ద నియోజకవర్గాల్లో ఒకే రోజు నాలుగు నుంచి ఐదు రోడ్ షోలో పాల్గొన్నారు. 

మేధావులతో ఇంటర్వ్యూలు.. 

ఉదయం నుంచి సాయంత్రం వరకు జిల్లాల్లో వివిధ నియోజకవర్గాల్లో రోడ్ షోలు నిర్వహించి ఆ తర్వాత సాయంత్రం నుంచి రాత్రి 10 గంటల వరకు హైదరాబాదులో తన ప్రచార కార్యక్రమాలను కొనసాగించారు. ఒకవైపు జయప్రకాశ్​ నారాయణ (జేపీ), గోరేటి వెంకన్న, ప్రొఫెసర్ నాగేశ్వర్ వంటి వారితో ప్రత్యేక ఇంటర్వ్యూలు కొనసాగించిన కేటీఆర్.. ఆ తర్వాత ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న యువకులతో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఓలా ఊబర్, జొమాటో వంటి వాటి ద్వారా సేవలు అందిస్తున్న గిగ్ వర్క్ చేస్తున్న యువకుల దాకా అన్ని వర్గాల వారిని కలుపుకుంటూ వారితో సంభాషిస్తూ వారికి భరోసానిస్తూ ముందుకు సాగారు. దీంతోపాటు హైదరాబాదులో ఫస్ట్ టైం ఓటర్లు, ఐటీ ఉద్యోగులు, రియల్ ఎస్టేట్ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, దళిత గిరిజన పారిశ్రామికవేత్తలు వంటి వివిధ వర్గాల ప్రముఖులు, ఉద్యోగులు, ప్రజలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. అలాగే పథకాల ద్వారా లబ్ధి పొందిన ప్రజలతో, ఆయా నియోజకవర్గాల్లో ఉన్న ఒపీనియన్ మేకర్లు, ముఖ్యమైన వ్యక్తులతోనూ టెలికాన్ఫరెన్స్ ద్వారా సంభాషించి పార్టీ కోసం వారి మద్దతును కూడగట్టారు.