మాది ప్రజా టీమ్!

మాది ప్రజా టీమ్!
  • బీజేపీ గెలిస్తే ప్రజాస్వామ్యం గెలిచినట్లే
  • మాకు వ్యతిరేకంగా కుట్రలు చేశారు
  • కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​రెడ్డి

ముద్ర, తెలంగాణ బ్యూరో : ‘మాది ప్రజా టీమ్, బడుగువర్గాలకు పెద్దపీట వేసే టీమ్.. ప్రజాస్వామ్యం కోసం పనిచేసే టీమ్. తెలంగాణ అభివృద్ధి చేసేది మేమే. అందుకే ప్రజలు ఆదరించారు. ప్రజాస్వామ్యాన్ని, ప్రజాభిప్రాయాన్ని డబ్బుతో, మద్యంతో కొనేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రయత్నం చేసింది. కానీ, వారిద్దరికీ సరైన బుద్ధి చెప్పాలని తెలంగాణ ప్రజలు సిద్ధంగాఉన్నారు’. అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​రెడ్డి అన్నారు. మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతిరోజు తమపై విష ప్రచారం చేశారని, బీజేపీ అంటే కాంగ్రెస్, బీఆర్ఎస్​కు అభద్రతాభావం పెరిగిందని, ఈ రెండు పార్టీల మధ్య  ఒప్పందంతో వ్యూహాత్మకంగా బీజేపీకి వ్యతిరేకంగా కుట్రలుచేసే  ప్రయత్నం చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో బీజేపీ గెలిస్తే ప్రజాస్వామ్యం గెలిచినట్టేనని కిషన్​ రెడ్డి అభిప్రాయపడ్డారు. మరోసారి బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల చేతుల్లో ప్రజలు  పడకూడదని, భావితరాల భవిష్యత్తుకోసం ఓటేయాలని కోరారు. ఓవైపు కేసీఆర్ కుటుంబం, మరోవైపు సోనియా గాంధీ కుటుంబం.. ఈ రెండు పార్టీల అవినీతిని ప్రజలు బహిష్కరించాల్సిందిగా కోరుతున్నానని కిషన్​ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లో పోస్టింగ్ లు కావాలనుకునేవారికి మజ్లిస్ పార్టీ అనుమతితోనే ఆర్డర్లు ఇస్తున్నారన్నారు. మిగులు  బడ్జెట్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చింది బీఆర్ఎస్ అని, ఈ రెండు పార్టీలు అధికారంలోకి వస్తే తెలంగాణ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో పడుతుందని కిషన్​ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.