కర్ణాటకకు వచ్చి కళ్లారా చూడండి 

కర్ణాటకకు వచ్చి కళ్లారా చూడండి 
  • కర్ణాటక దివాళ తీస్తలేదు..
  • కేసీఆర్​ ఆరోపణలు ఎన్నికల స్టంట్లు 
  • గ్యారంటీలు, మెనిఫెస్టో అమలుకు నిధుల కొరత లేదు
  • బీఆర్ఎస్​ నేతల కర్ణాటకకు వస్తే కళ్లారా చూస్తారు
  • తెలంగాణలో ధర్నా చేసింది కర్ణాటక రైతులు కాదు
  • మీడియా మీట్​లో కర్ణాటక సీఎం సిద్ద రామయ్య 

ముద్ర, తెలంగాణ బ్యూరో :  కర్ణాటకకు వచ్చి అక్కడ కాంగ్రెస్​ ప్రభుత్వం అమలు చేస్తున్న గ్యారంటీలను కళ్లారా చూడాలని ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య బీఆర్ఎస్​ నేతలకు సూచించారు. ఎన్నికల ముందు తాము ప్రకటించిన ఐదు గ్యారంటీలలో ప్రస్తుతం నాలుగింటిని అమలు చేస్తున్నామన్న ఆయన మిగిలిన అన్న భాగ్య పథకాన్ని జనవరి ఒకటో తేది నుండి అమలు చేయబోతున్నామని స్పష్టం చేశారు. గ్యారంటీల అమలు కోసం ఇప్పటి వరకు రూ.38వేల కోట్లు ఖర్చు చేశామన్న ఆయన వచ్చే ఆర్ధిక సంవత్సరం గ్యారంటీ పథకాల కోసం ప్రత్యేకంగా రూ. 58 కోట్లు కేటాయించనున్నట్లు వివరించారు. కర్ణాటక దివాళ తీస్తుందంటోన్న మోడీ, కేసీఆర్​ ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. గ్యారంటీలు, మెనిఫెస్టో హామీల అమలుకు తమ వద్ద నిధుల కొరత లేదని స్పష్టం చేశారు. ఆదివారం హైదరాబాద్​లోని తాజ్​కృష్ణ హోటల్​లో మీడియాతో మాట్లాడారు. కర్ణాటకలో ఐదు గ్యారంటీలు అమలు కావడం లేదంటోన్న సీఎం కేసీఆర్​, కేటీఆర్​, ఇతర బీఆర్ఎస్​ ప్రజాప్రతినిధుల ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు. కర్ణాటక ప్రభుత్వంపై కేసీఆర్​ చేస్తోన్న ఆరోపణలను ఎన్నికల స్టంట్లుగా అభివర్ణించారు. తాము ప్రభుత్వంలో ఏర్పడిన తర్వాత ఈ ఏడాది మే 28న మొదటి క్యాబినెట్ లోనే ఐదు గ్యారంటీ పథకాల అమలుకు నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. కాని ఆ నిర్ణయాలు కార్యరూపం దాల్చడానికి కాస్త సమయం పట్టిందన్నారు. జూన్ 11 న మొదటి గ్యారంటీగా   శక్తి యోజనే పథకాన్ని అమలు చేశామన్నారు. ఇందులో మహిళలు కర్ణాటక ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ప్రారంభించారనీ, ఇప్పటి వరకు 100.42 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేశారన్నారు. 


రోజకు సగటున 62 లక్షల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్నారని చెప్పిన సీఎం తన భర్యతో సహా, మహిళా మంత్రులు సైతం బస్సుల్లో ప్రయాణించారన్నారు. రెండో గ్యారంటీ అయిన అన్నా భాగ్యా పథకం కింద ఒక్కొకరికి 5 కేజీ ల బియ్యం ఇవ్వాలని హామీ ఇచ్చామన్న సిద్ధరామయ్య అంత మంది లబ్దిదారులకు ఇచ్చేందుకు తమ వద్ద బియ్యం నిల్వలు తక్కువపడ్డాయన్నారు. ఇందుకోసం బియ్యం కొంటామని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను అభ్యర్ధించినా కేంద్ర ప్రభుత్వం కర్ణాటకకు బియ్యం ఇవ్వకుండా మొండిచెయ్యి చూపించిందన్నారు. దీంతో మరో కెబినెట్​ భేటీ నిర్వహించి.. జులై మొదటి వారం నుండి లబ్దిదారులకు కిలోకు రూ. 34 ల చొప్పున ఐదు కిలోలకు సంబంధించిన నగదు వారి వారి బ్యాంకు ఖాతాల్లో జమా చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4.37 కోట్ల మంది లబ్దిదారులు ఉన్నారన్నారు. అదే నెల నుంచి గృహజ్యోతి పథకం కింద..  రెండొందల యూనిట్లలోపు విద్యుత్​ను మూడో గ్యారంటీగా, జులై నుండి గృహజ్యోతి పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. ఇందులో 1.17 కోట్ల మంది మహిళలకు ప్రతినెల రూ.2వేల చొప్పున అమలు చేస్తున్నామని వెల్లడించారు. చివరి గ్యారంటీ యువనిధి అమలులో జాప్యం జరిగిందన్న ఆయన వచ్చే జనవరి నుండి డిగ్రీ ఆపై చదివిన నిరుద్యోగ అభ్యర్థులకు ప్రతి నెల రూ.3వేలు, ఆలోపు చదివిన వారికి రూ. 1500 భృతి ఇస్తామని, అలాగే వృత్తి నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. గ్యారంటీలతో పాటు మెనిఫెస్టోలో ఇచ్చిన 165 హామీల్లొ 158 హామీలను ఇప్పటికే అమలు చేస్తున్నామని తెలిపారు. అదే గతంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎన్నికల ముందు ఇచ్చిన ఆరొందల హామీల్లో కేవలం 60 హామీలనే నెరవేర్చిందని విమర్శించారు. 

ఇటీవల ఎన్నికల ప్రచారానికి కామారెడ్డికి వచ్చిన తాను కర్ణాటకు వచ్చి తాము అమలు చేస్తున్న పథకాల అమలును తెలుసుకోవాలని కేసీఆర్​ను కోరాననీ, ఇప్పుడూ మరోసారి ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. ఇటీవల తెలంగాణ లో ధర్నా చేసిన కర్ణాటక రైతులపైనా సిద్దరామయ్య వివరణ ఇచ్చారు. ఇక్కడికి వచ్చి ధర్నా చేసింది కర్ణాటక రైతులు కాదని స్పష్టత ఇచ్చారు. అసలు తమ రాష్ట్ర రైతులు ఇక్కడికి వచ్చి ధర్నా ఎందుకు చేస్తారని ప్రశ్నించారు. ఇదంతా కేసీఆర్​ ఆడిన నాటకమన్నారు. తెలంగాణలో కాంగ్రెస్​ అధికారంలోకి వస్తుందనే భయం కేసీఆర్​కు పట్టుకుందని సెటైర్లు వేశారు. డిసెంబర్ 3న తెలంగాణలో వెలువడే ఫలితాల్లో కాంగ్రెస్‌ గెలుపు ఖాయమన్న సిద్ధరామయ్య ప్రమాణస్వీకారానికి తాను కూడా వస్తానని చెప్పారు. కర్ణాటక మంత్రులు బోసురాజు, జునైద్​ జావిద్​, నాగేందర్​ ఇతర మంత్రులు పాల్గొన్నారు.