ఒడిశా కార్మికుల విముక్తి

ఒడిశా కార్మికుల విముక్తి
Liberation of Odisha workers
  •   అడిషనల్ డీజీ భగవత్ కు ట్విట్టర్లో ఫిర్యాదు
  • స్పందించిన సిఐడి  ఎఎస్పీ వెంకటేశ్వర్లు
  • చంటి బిడ్డ సహా ఆరుగురు ఒడిశా వలస కార్మికులకు విముక్తి
  • ఇటుక బట్టి యజమానిపై కేసు

ముద్ర ప్రతినిధి, మెదక్: అడిషనల్ డిజి మహేష్ భగవత్ ట్విట్టర్కు ఫిర్యాదు చేయగా స్పందించిన సిఐడి విభాగం వేధింపులకు గురైన చంటి బిడ్డ సహా ఆరుగురు ఒడిశా వలస కార్మికులకు విముక్తి కల్పించింది. వేధింపులకు పాల్పడిన సదరు ఇటుక బట్టి యజమానిపై కేసు నమోదు చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లా(సంగారెడ్డి)సిఐడి ఏఎస్పి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో మంగళవారం ఆరుగురు ఒడిషా వలస కార్మికులను స్వస్థలానికి పంపారు. మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మెదక్ మండలం మాచవరం సమీపంలో తుమ్మ లక్ష్మీనారాయణ అనే వ్యక్తి ఇటుక బట్టి నిర్వహించడం జరుగుతుంది. ఈ బట్టిలో పనిచేయడానికి ఒప్పందంపై ఒడిశాకు చెందిన ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులు రావడం జరిగింది.

గత కొన్నాళ్లుగా పనిచేస్తున్న కార్మికులకు సకాలంలో వేతనాలు చెల్లించకపోవడం, ఇంటికి పోనివ్వకపోవడం, ఫోన్లో మాట్లాడనివ్వకుండా వేధింపులకు గురి చేస్తున్నట్లు గమనించిన అడిషనల్ డీజీ మహేష్ భగవత్ ట్విట్టర్ కు ట్వీట్ చేశారు. స్పందించిన మహేష్ భగవత్ ఆదేశాల మేరకు ఉమ్మడి మెదక్ జిల్లా సిఐడి విభాగం ఏఎస్పి జి. వెంకటేశ్వర్లు, డి.ఎస్.పి ఎన్.వెంకటేశ్వర్లు  సహాయ కార్మిక అధికారులు సత్యేంద్ర ప్రసాద్, ప్రవీణ్ కుమార్, రెవిన్యూ ఇన్స్పెక్టర్ నాగరాజు, మెదక్ రూరల్ సిఐ విజయ్ కుమార్ సమక్షంలో మాచవరంలో ఉన్న ఇటుక బట్టిని సందర్శించారు.

కార్మికులు గత్వాల్ రానా, ముకుంద రానా, సూరం రానా, మహిళలు సురేంద్రి రానా, నీరు బాగాయితో పాటు ఏడావదిన్నర పసిబిడ్డ ప్రకాష్ రానాలను విచారించి వారు ఎదుర్కొన్న ఇబ్బందులను తెలుసుకున్నారు. వేధింపులకు గురిచేసిన ఇటుక బట్టి యజమాని లక్ష్మీనారాయణపై బాల కార్మికుల, అంతరాష్ట్ర వలస కార్మికుల చట్టం కేసులు నమోదు చేసి మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని ఏఎస్పీ వెంకటేశ్వర్లు వివరించారు. కార్మికులకు రావాల్సిన 37వేల రూపాయలు యజమాని నుండి ఇప్పించడం జరిగిందన్నారు. ప్రజ్వల్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో వలస కార్మికులను వారి స్వస్థలం ఒడిశా రాష్ట్రానికి పంపించడం జరిగిందని వివరించారు. ఈ రెస్క్యూలో సిఐలు జగదీష్, సురేష్, సతీష్ కుమార్, జయేష్ కుమార్, ఎస్ఐలు కృష్ణమూర్తి, అంజయ్య, మెదక్ రూరల్ ఎఎస్ఐ వెంకటయ్య పాల్గొన్నారు.