కాంగ్రెస్​కు పట్టం కట్టండి

కాంగ్రెస్​కు పట్టం కట్టండి
  • బీజేపీ నల్ల చట్టాలకు బీఆర్ఎస్, ఎంఐఎం మద్దతిస్తున్నాయి 
  • మోడీని వ్యతిరేకించినందుకు నాపై 24 కేసులు
  • కేసీఆర్, ఒవైసీ పై ఒక్కటీ లేదు
  • జూబ్లీహిల్స్ ప్రచార సభలో రాహుల్​గాంధీ

ముద్ర, తెలంగాణ బ్యూరో : రాజకీయపరంగా తన పోరాటం ప్రధాని మోడీతో కాదని.. కొన్ని మతాలు, వర్గాల పట్ల ఆయన మనస్సులో ఉన్న విద్వేషంతోనేనని ఏఐసీసీ అగ్రనేత రాహుల్​ గాంధీ స్పష్టం చేశారు. తాను రాజకీయాల్లో వ్యక్తిగత దూషణలు, ఆరోపణలు చేసే వ్యక్తిని కాదన్నారు. మంగళవారం జూబ్లీహిల్స్ లో జరిగిన ప్రచార సభలో రాహుల్​ప్రసంగించారు. పదేళ్ల మోడీ పాలనలో దేశంలో ప్రేమానురాగాలు అంతరించిపోయానన్న ఆయన.. వాటిని మళ్లీ తెచ్చేందుకే కన్యాకుమారి నుంచి కశ్మీర్​ వరకు పాదయాత్ర చేశానన్నారు. మోడీ తన పాలనలో ప్రజల మధ్య దూరాన్ని పెంచారే తప్ప దేశసమైక్యత కోసం కృషి చేయలేదని ఆరోపించారు. 

కేసులు పెట్టారు.. ఇల్లు ఖాళీ చేయించారు..

విద్వేషాలతో నిండిన సమాజంలో ప్రేమానుగారాలు పంచుతూనే ఉంటానన్నారు. ఇందిరాగాంధీ నుండి సోనియాగాంధీ నేతృత్వంలో దేశంలో రాజకీయం ప్రేమకు కేరాఫ్​గా నిలిచిందన్నారు. నాడు దేశం కోసం పోరాడిన కాంగ్రెస్​ ఇప్పుడు దేశంలో శాంతి, సమైక్యత కోసం పోరాటం చేస్తుందన్నారు. ఇదే కాంగ్రెస్​ సిద్ధాంతమని చెప్పారు. దేశంలో మతతత్వాన్ని రూపుమాపాలంటే ముందుగా తెలంగాణలో కేసీఆర్​ను, కేంద్రంలో మోడీని ఓడించాల్సిన అవసరం ఉందన్నారు. బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా గళమెత్తిన తనపై అస్సాం, గుజరాత్, ఉత్తర్​ప్రదేశ్, బిహార్, మహారాష్ట్రలో ఎక్కడపడితే అక్కడ కేసులు నమోదయ్యాయని చెప్పిన రాహుల్..​ ఎప్పుడు ఏ రాష్ట్రం నుంచి పిలుపొచ్చినా అక్కడికి వెళ్తున్నానన్నారు. ఈ క్రమంలో ఇప్పటికే తనకు రెండేళ్ల జైలు శిక్ష పడిందని, లోక్​సభ సభ్యత్వాన్ని రద్దు చేసి, ఇల్లు ఖాళీ చేయించిన విషయాన్ని గుర్తు చేశారు. 

కేసీఆర్, అసద్​పై ఒక్కకేసు కూడా లేదు..

దేశంలోనే అత్యంత అవినీతి రాష్ట్రంగా తెలంగాణను ముందంజలో నిలిపిన కేసీఆర్ పై, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై ఒక్క కేసు కూడా లేదన్నారు. తన వెంటపడ్డ ఈడీ, ఐటీ, సీబీఐలు ఒవైసీ వైపు కన్నెత్తి చూడడం లేదని, కనీసం ఆయన లోక్ సభ సభ్యత్వం కూడా రద్దు కాలేదన్నారు. దీన్ని బట్టి చూస్తే.. బీజేపీతో బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల మధ్య ఉన్న సంబంధాన్ని తేటతెల్లం చేస్తోందన్నారు. అస్సాంలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్​ పోరాడితే అక్కడ కనీసం పార్టీ సభ్యత్వాలు కూడా లేని ఎంఐఎం అకస్మాత్తుగా రంగంలో దిగి పోటీ చేసిందన్నారు. దీంతోపాటు మహారాష్ట్ర, ఛత్తీస్​గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గోవాలో పోటీ చేసి సెక్యులర్​ ఓట్లు చీల్చి కాంగ్రెస్​ ఓటు బ్యాంకును దెబ్బకొట్టి.. బీజేపీ గెలుపునకు సహకరించిందన్నారు. ఎక్కడ ఎన్నికలు జరిగినా మోడీ చెప్పిన సెగ్మెంట్ల నుంచి ఎంఐఎం పోటీ చేస్తోందని విమర్శించారు. ఇదే మిత్రత్వంతో.. బీజేపీ తీసుకు వచ్చే నల్ల చట్టాలకు బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు మద్దతు తెలుపుతున్నాయని ఆరోపించారు. తనపై ఇంకెన్ని కేసులు పెట్టినా, కాంగ్రెస్​ ప్రధాన సిద్ధాంతమైన మత సామరస్యాన్ని కాపాడడంలో వెనకడుగు వేయనన్నారు. ఈనెల 30న తెలంగాణలో జరగనున్న ఎన్నికల్లో కేసీఆర్​ను గద్దె దింపి కాంగ్రెస్​కు పట్టం కట్టాలని కోరారు. కాంగ్రెస్​ ఇక్కడ గెలిస్తేనే.. ఇతర రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో విజయదుందుభి మోగించి కేంద్రంలో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.