అవయవ దానంతో పునర్జన్మ

అవయవ దానంతో పునర్జన్మ
  • అవయవ దానంలో అవగాహన పెంపొందించాలి
  • అందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి
  • పేటలో వనమా వెంకట్రామయ్య గుప్తా, గుండా వెంకటప్పయ్య గుప్తాల విగ్రహాల ఏర్పాటు
  • ప్రధాన కూడళ్లకు ఇరువురి పేర్లు
  • సేవాంకిత సభలో మంత్రి జగదీష్ రెడ్డి వెల్లడి

ముద్ర ప్రతినిధి, సూర్యాపేట: అవయవ దానంతో పునర్జన్మ పొందినట్లే నని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. తాను మరణిస్తూ మరొకరికి పునర్జన్మ ఇవ్వడం అంటే గొప్ప విషయమని ఆయన తెలిపారు. అటువంటి అవయవ దానంపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఆదివారం సూర్యపేట జిల్లా కేంద్రంలో స్పందన సేవా స్వచ్ఛంద సంస్థ అవయవ శరీర దాతల సంఘం ఆధ్వర్యంలో దివంగత వనమా వెంకట్రామయ్య గుప్తా,గుండా వెంకటప్పయ్య గుప్తా ల స్మారకార్థం ఏర్పాటు చేసిన సేవాంకిత సంస్మరణ సభకు మంత్రి జగదీష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గుండా రమేష్,కోటయ్య, పిచ్చిరెడ్డి ,ఇరిగి కొటేశ్వరి తదితరులు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో యం ఎల్ సి కోటిరెడ్డి,డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ సోమా భరత్ కుమార్,మాజీ మున్సిపల్ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ, రాష్ట్ర బి ఆర్ ఎస్ కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు,బి ఆర్ ఎస్ పట్టణ అధ్యక్షుడు సవరాల సత్యనారాయణ,ఉప్పల ఆనంద్, బండారు రాజా, రాచర్ల కమలాకర్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ అవయవ దానం కోసం స్పందన స్వచ్ఛంద సంస్థ చేస్తున్న కృషి అభినందనియమని ఆయన కొనియాడారు. ఈ తరహాలో మరిన్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకు రాగలిగితే ఎందరికో తోడ్పాటు అందించిన వరమౌతామన్నారు.సూర్యాపేటలో బాల భవన్ ఏర్పాటులో దివంగత వనమా వెంకట్రామయ్య పాత్ర విస్మరించలేనిదన్నారు.సూర్యపేట పట్టణంలో దివంగత వనమా వెంకట్రామయ్య గుప్తా,గుండా వెంకటప్పయ్య గుప్తాలు చేసిన సేవలకు గుర్తుగా వారి విగ్రహాల ఏర్పాటుతో పాటు ప్రధాన కూడళ్లకు వారి పేర్లను పెట్టనున్నట్లు మంత్రి జగదీష్ రెడ్డి వెల్లడించారు.