దేశద్రోహ చట్టాన్ని కొనసాగించాల్సిందే

దేశద్రోహ చట్టాన్ని కొనసాగించాల్సిందే

దేశద్రోహ చట్టాన్ని(ఐపీసీ సెక్షన్ 124ఏ) తొలగించాలనే డిమాండ్ చాలా కాలంగా వినిపిస్తోంది. బ్రిటిషర్ల హయాంలో తీసుకువచ్చిన ఈ చట్టాన్ని ఇప్పటి వరకు కొనసాగించాల్సిన అవసరం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఈ మధ్య దీనిపై చర్చ పెరిగింది. కొంత కాలం క్రితం.. దీనిపై రివ్యూ చేసి ఓ నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. ఈ నేపథ్యంలో లా కమిసన్ (శాసన పరిశీలన సంఘం) భిన్న రీతిలో స్పందించింది. దేశద్రోహాన్ని నేరంగా పరిగణించడం కొనసాగించాలని అన్న లా కమిషన్ శిక్షా కాలాన్ని మూడేళ్ల నుంచి ఏడేళ్లకు పెంచాలంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. అయితే భారత శిక్షా స్మృతి(ఐపీసీ)లోని సెక్షన్ 124ఏకు కొన్ని సవరణలు అవసరమని ప్రభుత్వానికి 22వ శాసన పరిశీలన సంఘం (ప్రస్తుత లా కమిషన్) సిఫారసు చేసింది.

విశ్రాంత కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రితు రాజ్ అవస్థి నేతృత్వంలోని లా కమిషన్ ఈ సిఫారసు చేసింది. ఈ చట్టం కింద నేరస్థులకు మూడేళ్ల జైలు శిక్ష లేదా జీవిత ఖైదు విధించాలని ప్రస్తుత నిబంధనలు చెప్తున్నాయని, అయితే వాటిని ఏడేళ్లకు పెంచాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు లా కమిషన్ చేసింది. ఐపీసీ సెక్షన్ 124ఏ అమలును నిలిపివేస్తూ 2022 మే 11న అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. ఐపీసీ సెక్షన్ 124ఏను కొనసాగించాలా? వద్దా? అనే అంశాన్ని పునఃపరిశీలిస్తామని కేంద్ర ప్రభుత్వం అంతకుముందు సుప్రీంకోర్టుకు చెప్పింది. అంతకు ముందు దేశద్రోహ చట్టాన్ని సమీక్షించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు కోరింది.