రాష్ట్రానికే ఆదర్శ పట్టణం సిరిసిల్ల: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

రాష్ట్రానికే ఆదర్శ పట్టణం సిరిసిల్ల: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

ప్రగతి బాటలో సిరిసిల్ల పట్టణం: మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ

ముద్ర సిరిసిల్ల టౌన్: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా సిరిసిల్ల మున్సిపల్ ఆధ్వర్యంలో  పట్టణ ప్రగతి దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. స్థానిక కౌన్సిలర్లు , మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, మున్సిపల్ అధికారులు,  సిబ్బంది, కార్మికులు, రిసోర్స్ పర్సన్ లు, మెప్మా సిబ్బంది మున్సిపల్ కార్యాలయం నుండి కొండా బాపూజీ సర్కిల్ వరకు ర్యాలీ గా బయలు దేరారు. అనంతరం సర్కిల్ వద్ద దశాబ్ది ఉత్సవాల ఆకృతిని మానవహారంగా మెప్మా, మున్సిపల్ సిబ్బంది తో ఏర్పరిచారు. పద్మనాయక కళ్యాణ భవనం లో మున్సిపల్ చైర్ పర్సన్ జాతీయ జెండా ఎగురవేసిన అనంతరం కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా నాఫ్స్కాబ్ చైర్మన్ కె.రవీందర్ రావు, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, అడిషనల్ కలెక్టర్ సత్యప్రసాద్, టీఎస్పిటిడిసి  చైర్మన్ గూడూరి ప్రవీణ్, గ్రంధాలయ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు గడ్డం నర్సయ్య, మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి, స్థానిక కౌన్సిలర్లు, పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ సిరిసిల్ల లో జరిగిన ప్రగతి నివేదిక కి ఒక పుస్తకం ముద్రించడం చాలా అభినందనీయం అన్నారు, పట్టణంలో జరిగిన అభివృద్ధికి మున్సిపల్ కమిషనర్, సిబ్బంది, చైర్ పర్సన్ మరియు పాలక వర్గం, సానిటరీ సిబ్బంది, ఆర్పీ లు, జవాన్ లు అందరు కలిసి ఒక టీం వర్క్ గా చేయడమే వల్లనే ఈ పరిపూర్ణమైన అభివృద్ధి జరిగింది అన్నారు. 

మంత్రి కేటీఆర్ సహకారంతో వరుసగా మూడు సార్లు స్వచ్ సర్వేక్షన్ అవార్డు పొంది రాష్ట్రంలో ఆదర్శ పట్టణంగా సిరిసిల్ల పట్టణం నిలవడం మనకి గర్వకారణం అన్నారు. మోడరన్ దోబీ ఘాట్, వెజ్ నాన్ వెజ్ మార్కెట్ రాష్ట్రంలో మొదటి సారి సిరిసిల్ల లోనే ఏర్పాటు చేయడం జరిగినది అన్నారు. అలాగే వేస్ట్ మేనేజ్మెంట్ లో భాగంగా రిసోర్స్ పార్క్, తడి పొడి చెత్త వేరుచేయడం, కంపోస్ట్ ఎరువు తయారు చేయడం చాలా శ్రమతో కూడిన పని అని, ఇవ్వన్ని పనులు సక్రమంగా చేయడం వలనే అవార్డులతో పాటు రాష్ట్రం లో నెంబర్ వన్ స్థానం సిరిసిల్ల పట్టణానికి దక్కింది అన్నారు. పట్టణ పారిశుద్యం క్రమం తప్పకుండ నిర్వహించడం వలన విషజ్వరాలు కూడా తగ్గుముఖం పడుతున్నాయి అన్నారు. మినీ స్టేడియం, పబ్లిక్ పార్క్ లు, ఫుట్ పాత్ ల నిర్మాణం, సెంట్రల్ లైబ్రరీ, డబల్ బెడ్ రూమ్ ల నిర్మాణం ఇవ్వన్ని పట్టణ ప్రగతి లో జరిగిన అభివృద్ధికి నిదర్శనం అన్నారు. నాఫ్స్కాబ్ చైర్మన్ కె.రవీందర్ రావు మాట్లాడుతూ సిరిసిల్ల మున్సిపల్ కి బడ్జెట్ కి మించి నిధులు వస్తున్నాయి అని, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ మున్సిపల్ మంత్రి గా ఉండడం సిరిసిల్ల మున్సిపల్ పాలకవర్గం మరియు అధికారుల యొక్క అదృష్టం అని అన్నారు.

 మురికి నీటి శుద్ధి కేంద్రం, బైపాస్ రోడ్ నిర్మాణం, ప్రతి ఇంటికి నల్ల కనెక్షన్, సీసీ రోడ్ ల నిర్మాణం ఇవన్నీ ప్రతక్షంగా కనపడుతున్న అభివృద్ధి కి చిహ్నాలు అన్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రం లో గత కౌన్సిలర్లు వార్డ్ లో ఒక బోర్ వేయాలన్న నెలల తరబడి అధికారులు, పాలకుల వెంబడి తిరిగే పరిస్థితి ఉండేది అని, ఇపుడు ఎక్కడ నీటి సమస్య ఉన్న, రోడ్ ల నిర్మాణం అయినా రోజుల వ్యవధిలో పూర్తి అవుతుంది అన్నారు. వైకుంఠ ధామాల నిర్మాణం, బస్తి దవాఖాన, రోజువారీ చెత్త సేకరణ, మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి నల్ల కనెక్షన్ పట్టణ ప్రగతి లో భాగమే అని అన్నారు. సానిటరీ సిబ్బంది, ఆర్పీ లు, జవాన్ లు, మున్సిపల్ సిబ్బంది పట్టణ పరిశుభ్రత లో కీలక పాత్ర పోషిస్తున్నారని వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. కార్యక్రమ అనంతరం ఉత్తమ మున్సిపల్ సిబ్బందికి, ఉత్తమ వార్డు, ఉత్తమ ఆర్పీ లకు, మెప్మా సిబ్బందికి అవార్డు లు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి, ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది , సానిటరీ సిబ్బంది, మెప్మా అధికారులు, సిబ్బంది, రిసోర్స్ పర్సన్ లు పాల్గొన్నారు.