వక్ఫ్ భూమిని కబ్జా చేసిన గంగుల

వక్ఫ్ భూమిని కబ్జా చేసిన గంగుల
  • ముస్లిం సమాజాన్ని మోసం చేస్తున్న ఎంఐఎం
  •  ముస్లిం ప్రజలు  మోసపోయే స్థితిలో లేరు
  •  బీజేపీ మైనార్టీ మోర్చా ప్రధాన కార్యదర్శి ఎండి. ముజీబ్ 

ముద్ర ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ అసెంబ్లీ టిఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ ముస్లింల ఆస్తి వక్ఫ్ బోర్డ్ భూములను కబ్జా చేసి ఫామ్ హౌస్ కట్టుకున్నాడని బిజెపి మైనారిటీ మోర్చా ప్రధాన కార్యదర్శి ఎం డి ముజీబ్ ఆరోపించారు. రాజ్యాంగబద్ధమైన మంత్రి పదవిలో ఉండి భూములను కబ్జా చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. మంగళవారం ప్రెస్ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముజీబ్ మాట్లాడుతూ హ్యాట్రిక్ ఎమ్మెల్యే, మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్ అభివృద్ధి కోసం చేసిన పనులపై చర్చలకు సిద్ధమని, కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన అభివృద్ధిపై చర్చలు జరపడానికి ముందుకు రావాలని అన్నారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ఎనిమిది వేల కోట్ల అభివృద్ధి పనులు చేశారని అవి ఏంటో చెప్పడానికి తామంతా సిద్ధంగా ఉన్నామనన్నారు. అలాగే మంత్రి గంగుల కమలాకర్ ఇన్నేళ్లుగా కరీంనగర్ అభివృద్ధికి పనులు ఏంటో ప్రజలందరికీ వివరించాలని సవాల్ విసిరారు. ముఖ్యంగా ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ఒవైసీ , బిఆర్ఎస్ పార్టీతో జతకట్టడానికి సిగ్గుండాలన్నారు.12శాతం ముస్లిం రిజర్వేషన్లు ఇస్తామని, ఇవ్వకుండా మోసం చేసిన బీఆర్ఎస్ పార్టీకి, ముస్లిం సమాజాన్ని మోసం చేసిన  కేసీఆర్  పార్టీ కి కు మద్దతు పలకడం సిగ్గు చేటనన్నారు. ఈ విషయంలో ముస్లిం సమాజానికి ఎంఐఎం ఏం చెప్తుందని ఆయన ప్రశ్నించారు. 

నేడు మంత్రి గంగుల కమలాకర్ కోసం  పనిచేస్తున్న  ఎంఐఎం పార్టీ  తమ స్వలాభాలు చూసుకొని మైనార్టీలను మోసం చేస్తుందన్నారు. ఒవైసీకి దమ్ముంటే కరీంనగర్ కు వచ్చి గంగుల కమలాకర్ కోసం  ప్రచారానికి రావాలని ఆయన సవాల్  చేశారు. ఎంఐఎం , బిఆర్ఎస్ బీజేపీ మీద దుష్ప్రచారం చేసి ఓట్లు దండుకోవాలని చూస్తున్నారనన్నారు. ఒక వర్గం ఓట్ల కోసం పాకులాడే  పార్టీ ఎంఐఎం అన్నారు. బిజెపి సెక్యూలర్ పార్టీ అన్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం అభివృద్ధి కోసం బీజేపీ ఆలోచన చేస్తూ ముందుకు పోతుందన్నారు. నగరం లో బిజెపి గ్రాఫ్ పెరిగిందని , ఎక్కడ కి వెళ్లిన ప్రజలు బండి సంజయ్ కు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. కరీంనగర్లో  త్వరలో ప్రజల ఆశీస్సులతో కమలం జెండా ఎగరవేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అసద్దీన్ ఒవైసీ మైనార్టీ ల పై చూపిస్తున్న కపట ప్రేమను  ముస్లింలందరూ గ్రహించారని , ఓటు బ్యాంకు గా తమను వాడుకుంటున్నారనే విషయం ప్రతి ఒక్కరికి అర్థమైందన్నారు. 

ఇందులో ముఖ్యంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా క్యాబినెట్లో మంత్రిగా ఉండి ఆయన ఈ విషయంపై ఎలా హైకోర్టులో కేసు వేస్తాడని ప్రశ్నించారు. 19వ డివిజన్ షేకాబీ కాలనీలోని రేకుర్తిలో పేద ముస్లింల ఇండ్లను కూల్చివేసి వక్ఫ్ బోర్డ్ భూమిని కబ్జా చేసి ఏ ముఖం పెట్టుకొని గంగుల ముస్లింలను ఓట్లు అడుగుతాననన్నారు. గంగుల లాంటి భూకబ్జాదారులకు   అవినీతిపరులకు, కరప్షన్ కింగ్ లకు  అసదుద్దీన్ ఓవైసీ సిగ్గు లేకుండా  మద్దతు పలుకుతారని విమర్శించారు. ముస్లిం సమాజాన్ని మోసం చేస్తున్న  బిఆర్ఎస్ ఎంఐఎం పార్టీల కుట్టలను తిప్పి కొట్టాలని ఆయన పిలుపునిచ్చారు . కాంగ్రెస్ వి ఓటు బ్యాంకు రాజకీయాలని, ఆ పార్టీ ఐదు దశాబ్దాల కాలం గా దేశాన్ని రాష్ట్రాలను ఏలిన మైనార్టీ సమస్యలను తీర్చలేకపోయిందన్నారు. బి ఆర్ ఎస్ ప్రభుత్వం  మైనార్టీల సంక్షేమాన్ని అభివృద్ధిని గాలికి వదిలేసిందని ఆయన విమర్శించారు. ఈ విలేకరుల సమావేశంలో మైనారిటీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి బల్బీర్ సింగ్, జిల్లా అధ్యక్షుడు సమీపర్ వేజ్, బషీరుద్దీన్, షహజాద్,సమీ, సాబీర్, జస్పాల్ సింగ్, సిద్దిక్, వచన్ సింగ్, కాలం, పసి, అల్తాఫ్, సైద్ తదితరులు పాల్గొన్నారు.