గ్రామ సేవకులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే

గ్రామ సేవకులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే

 రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
 ముద్ర ప్రతినిధి, వనపర్తి :  ఎల్.అర్.యు.పి ద్వారా సంవత్సరం పాటు తెలంగాణ రాష్ట్రంలోని భూరికార్డులను శుద్ధి చేసి రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేసిన తర్వాత గామ సేవకులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వివిధ శాఖలకు కేటాయించడం జరిగిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా వి.అర్. ఎ లను  ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ఆయా ప్రభుత్వ శాఖలను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసే ప్రక్రియ మొదలు కాగా వనపర్తి జిల్లాలో సమీకృత కార్యాలయాల సముదాయంలో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన నియామక ఉత్తర్వుల జారీ ప్రక్రియకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై వి.అర్. ఎ లకు  నియామక ఉత్తర్వులను అందజేశారు.

 ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఏమొస్తది, ఎందుకు అడుగుతున్నాము అని 2001 లో చాలా మందికి అర్థం కాలేదు అన్నారు.  ఎన్నో ఉద్యమాలు, ఎన్నో అవమానాలు, బాధలు అనుభవించి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని, అది ఇలాంటి చారిత్రక రోజు కోసమే అని అభివర్ణించారు. వి.అర్. ఎ లను, ఆర్టీసి ఉద్యోగులను  ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చారిత్రక నిర్ణయమని మంత్రి తెలిపారు. తెలంగాణలో ఉద్యోగాలు అత్యంత పారదర్శకంగా ఎలాంటి అవకతవకలు లేకుండా, రాజకీయ జోక్యం లేకుండా కేవలం ప్రతిభ ఆధారంగా మాత్రమే లభిస్తాయని తెలియజేశారు.  ఈ రోజు రాష్ట్రంలో 23 వేల మంది వి.అర్. ఎ లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి శాఖలను కేటాయించి నియామక పత్రాలు ఇవ్వడం జరుగుతుందన్నారు.

 ఎక్కడైనా జనాభా నిష్పత్తి ప్రకారముగ ఒకటి లేదా ఒకటిన్నర శాతం మాత్రమే ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారని, కానీ తెలంగాణలో 9.60 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారని తెలిపారు.  అంతేకాకుండా దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా ప్రభుత్వ ఉద్యోగులు అత్యధిక వేతనం పొందుతున్న రాష్ట్ర తెలంగాణ రాష్ట్రం అని చెప్పారు.  రాష్ట్రం ఏర్పడిన తర్వాత అత్యంత వేగంగా ఆర్థిక పురోగతి సాధిస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని తెలిపారు.  ఇప్పుడు వనపర్తి జిల్లాలో నియామక ఉత్తర్వులు పొందుతున్న వి అర్. ఎ లకు శుభాభివందనములు తెలియజేస్తూ  ఆగస్టు 19 న ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్   పవార్ మాట్లాడుతూ ఈ రోజు  61 సంవత్సరాల కన్నా తక్కువ  వయస్సు కలిగిన వి.అర్. ఎ లకు  శాఖలు కేటాయిస్తూ నియామక ఉత్తర్వులు జారీచేయడం జరిగిందన్నారు.

వనపర్తి జిల్లాకు ఇతర జిల్లాలు సంగారెడ్డి నుండి వచ్చిన 23 మంది, నాగర్ కర్నూల్ నుండి 14 మంది కలుపుకొని 456  ఉన్నారని అందులో ఈ రోజు 444 మందికి నియామక ఉత్తర్వులు జారీ అయ్యాయి అన్నారు. 12 మందికి వివిధ కారణాలతో తాత్కాలికంగా పక్కన పెట్టడం జరిగిందన్నారు. త్వరలో వారికి సైతం నియామక ఉత్తర్వులు ఇవ్వడం జరుగుతుంది అన్నారు.  డిగ్రీ కలిగిన 93 మంది  వి.అర్.ఎ లకు జూనియర్ అసిస్టెంట్ తత్సమాన హోదాలో నియామకం చేయగా 48 మందికి రికార్డు అసిస్టెంట్, మిగిలిన వారికి నాల్గవ తరగతి ఉద్యోగులుగ నియామక ఉత్తర్వులు జారీ  అయ్యాయని తెలిపారు. నియామక ఉత్తర్వులు అందుకున్న వారందరూ  ఈ రోజు వారకి  కేటాయించిన శాఖల్లో జాయింగ్ రిపోర్టు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.    అత్యధికంగా 115 మందికి రెవెన్యూ శాఖకు కేటాయింపు జరుగగా తర్వాతి స్థానాల్లో  ఇరిగేషన్, మున్సిపల్ శాఖలు ఉన్నాయని తెలిపారు.  నియామకం పొంది ప్రభుత్వ ఉద్యోగం పొందిన వారందరూ  తమకు వచ్చిన ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.  నిబద్ధతతో పని చేసి ఉన్న స్థాయి నుండి ఉన్నత స్థాయికి చేరుకునే విధంగా పని చేయాలని పిలుపునిచ్చారు.