సూత్రధారులను వదిలేసి.. పాత్రధారులను చూపెట్టారు

సూత్రధారులను వదిలేసి.. పాత్రధారులను చూపెట్టారు
  • రామకృష్ణయ్య హత్య కేసును సిట్టింగ్‌ జడ్జితో విచారించాలి
  • ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ
  • బాధిత కుటుంబాన్ని పరామర్శించిన లీడర్లు

ముద్ర ప్రతినిధి, జనగామ (బచ్చన్నపేట) : పేదల పక్షాన పోరాడిన రిటైర్డ్‌ ఎంపీడీవో రామకృష్ణయ్యను దారుణంగా హత్య చేయడం బాధకరమని, అయితే ఈ హత్య కేసులో పాత్రధారులను అరెస్టు చూపెట్టిన పోలీసులు సూత్రధారులను ఎందుకు వదిలిపెట్టారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ప్రశ్నించారు. పోలీసులు అధికార పార్టీకి తలొగ్గి పనిచేస్తున్నారని ఆరోపించారు. శుక్రవారం ఆయన జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం పోచ్చన్నపేటకు చేరుకుని రామకృష్ణయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రామకృష్ణయ్య హత్యను సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీనికి అంగీకరించకపోతే ప్రభుత్వమే దోషిగా నిలబడాల్సివస్తుందన్నారు.

ఈ హత్యలో సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే వరకు సూత్రధారులుగా ఉన్నారని కుటుంబ సభ్యులు చెబుతున్నా.. పోలీసులు వారిపై ఎందుకు కేసు పెట్టడం లేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా సూత్రధారులను బయటపెట్టి వాళ్ల మీద కూడా మర్డర్, ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కేసు పెట్టాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాగల్ల ఉపేందర్ మాదిగ, ఎమ్మెస్పీ జిల్లా ఇన్‌చార్జి ఇనుముల నరసయ్య మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్ పైసా రాజశేఖర్ మాదిగ, ఎమ్మెస్పీ జిల్లా నాయకులు చుంచు రాజు మాదిగ, అల్వాల నర్సింగరావు మాదిగ, జేరిపోతుల సుధాకర్ మాదిగ, సందేన రవీందర్ మాదిగ, నాగరాజు మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా కోకన్వీనర్ ఇనుముల అనిల్ మాదిగ, అల్వాల అనిల్, కంతి చరణ్, నల్ల అంజయ్య, రాజు, ప్రశాంత్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.