హస్తంలో నిస్తేజం!

హస్తంలో నిస్తేజం!
  • వాయిదా పడుతోన్న అగ్రనేతల పర్యటనలు
  • డీలా పడుతున్న కాంగ్రెస్ లీడర్లు
  • చేరికలపై సన్నగిల్లిన ఆశలు
  • పత్తాలేని ఘర్​వాపసీ!
  • పెండింగ్​లో మహిళ, బీసీ, ఎస్సీ డిక్లరేషన్లు
  • ఊపునివ్వని ‘తిరగబడదాం.. తరిమికొడదాం’
  • సమాలోచనల్లో హస్తం నేతలు

ముద్ర, తెలంగాణ బ్యూరో : టీ కాంగ్రెస్​డీలా పడింది. పార్టీలో చేరికలపై ఆశలు సన్నగిల్లుతుండడంతోపాటు.. ఒక్కొక్కరిగా అగ్రనేతల పర్యటనలు కూడా వాయిదా పడుతున్నాయి. మరోవైపు అధినేతలు కూడా మహిళ, బీసీ, ఎస్సీ ఇతర కీలక డిక్లరేషన్లు ప్రకటించడం లేదు. అలాగే సీనియర్ల మధ్య భగ్గుమంటోన్న విభేదాలతో ఇటీవల ప్రారంభమైన ‘తిరగబడదాం.. తరిమికొడదాం..’ కార్యక్రమం కూడా ఆశించినంత స్థాయిలో ముందుకెళ్లడం లేదు. ఈ పరిణామాలన్నీ హస్తం పార్టీని నిస్తేజంలో పడేశాయి. 

  • సీనియర్ల మధ్య కొరవడిన సమన్వయం..

రాష్ట్రంలో ఉత్సాహం నింపిన కన్నడ ఫలితాలు.. అగ్రనేత రాహుల్​గాంధీ ఖమ్మం బహిరంగ సభతో దూకుడు పెంచిన టీ కాంగ్రెస్ కొంతకాలంగా సవాళ్లను ఎదుర్కొంటోంది. సీనియర్ల మధ్య కొరవడిన సమన్వయం.. పొరపచ్చాల ఫలితంగా ఇప్పటికే పార్టీలో చేరికలకు ఫుల్​స్టాప్​పడింది. గతంలో వివిధ కారణాలతో పార్టీని వీడి, బీజేపీ, బీఆర్ఎస్​లో చేరిన సీనియర్లను తిరిగి పార్టీలో చేర్పించుకుంటామన్న టీపీసీసీ, ఏఐసీసీ నేతల ప్రకటన కార్యరూపం దాల్చలేదు. ఇటు బీజేపీ అసంతృప్త నేతలు ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి, డీకే అరుణ, వివేక్, విజయశాంతి వంటి సీనియర్లు కాంగ్రెస్​లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి అయితే తన తమ్ముడు తిరిగి మళ్లీ కాంగ్రెస్​లో చేరుతున్నాడని, ఇప్పటికే చర్చలు కూడా పూర్తయ్యాయని పలు సందర్భాల్లో ప్రకటించారు. దీంతో వెంటనే రంగంలో దిగిన బీజేపీ అధిష్టానం ఈటల రాజేందర్​ కు ఎన్నికల కమిటీ చైర్మన్​గా, రాజగోపాల్​ రెడ్డికి జాతీయ కార్యవర్గ సభ్యుడిగా బాధ్యతలు అప్పగించి వారిలో నెలకొన్న అసంతృప్తిని చల్లార్చింది. దీంతో ఇరువురు నేతలు పార్టీ వీడే ఆలోచనను విరమించుకున్నట్లు సమాచారం. 

  • అసంతృప్త నేతలతో జరపని మంతనాలు..

మరోవైపు కాంగ్రెస్​సీనియర్లు మిగతా కాషాయ అసంతృప్త నేతలతో మంతనాలు, చర్చలు జరపకపోవడంతో వారు హస్తం గూటిలో చేరే ఆలోచనను విరమించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇటీవల రాహుల్​గాంధీ సమక్షంలో పార్టీలో చేరిన ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటీ శ్రీనివాస్​రెడ్డి, ఢిల్లీలో ప్రియాంక సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్న మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు బీఆర్ఎస్​లో ఇమడలేకే బయటికి రావడం.. వీరు తప్ప మిగిలిన ముఖ్యనేతలెవరూ కాంగ్రెస్​ లో చేరకపోవడంతో టీ కాంగ్రెస్​ నేతల అంచనాలు ఒక్కసారిగా తారుమారయ్యాయి. మరోవైపు కాంగ్రెస్​ సీనియర్లతో పలుమార్లు సమావేశమైన ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్​రెడ్డి సైతం కాంగ్రెస్​ తీర్థం పుచ్చుకుంటారనే ప్రచారం నెల రోజుల క్రితం జోరుగా సాగింది. కానీ అనూహ్య పరిణామాల మధ్య దామోదర్​రెడ్డి తనయుడు రాజేశ్​రెడ్డి ఒక్కరే కాంగ్రెస్​ లో చేరడం సీనియర్లను షాక్​ గురి చేసింది. దామోదర్​రెడ్డి ప్రస్తుతం బీఆర్ఎస్​లోనే కొనసాగడం చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్​పార్టీకి చెందిన తాండూరు మాజీ ఎమ్మెల్యే పట్నం మహేందర్​రెడ్డి, కొడంగల్​ ఎమ్మెల్యే పట్నం నరేందర్​ రెడ్డి, హైదరాబాద్​నగర మాజీ మేయర్​తీగల కృష్ణారెడ్డి, వికారాబాద్​ జెడ్పీ చైర్​పర్సన్​పట్నం సునీతా మహేందర్​ రెడ్డి సైతం కాంగ్రెస్ లో చేరుతారనే ప్రచారం జరిగింది. ఈ ప్రచారాన్ని ఆయా నేతలు సైతం ఖండించలేదు. ఇప్పటికీ బీఆర్ఎస్​లోనే కొనసాగుతున్నారు. చివరకు నేరుగా పట్నం మహేందర్ రెడ్డి మాట్లాడిన సీఎం కేసీఆర్ పార్టీ వీడే ఆలోచనను విరమించుకోవాలని సూచించారు. అయితే అప్పట్లో వారితో సంప్రదింపులు జరపకపోవడంతోనే ఆయా నేతలు చేజారినట్లు కాంగ్రెస్​ శ్రేణుల్లో విస్తృత ప్రచారం జరుగుతోంది.

  • ముహూర్తం కుదరట్లే..!

అధికారమే లక్ష్యంగా తెలంగాణపై ప్రత్యేక దృష్టిసారించిన ఏఐసీసీ వ్యూహాత్మకంగా అడుగులేస్తోంది.ఇందులో భాగంగా ఇప్పటికే కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్, ప్రియాంక గాంధీకి తెలంగాణ బాద్యతలు అప్పగించాలని భావిస్తోన్న ఆ పార్టీ వచ్చే నెల 15వ తేదీలోగా రాష్ట్రంలో మహబూబ్​ నగర్, నల్లగొండ, జహీరాబాద్, చేవెళ్ల పార్లమెంట్​నియోజకవర్గాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియాగాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్​గాంధీ తో పాటు కర్ణాటక డెప్యూటీ సీఎం డి.కె.శివకుమార్​ఇలా ఒక్కో సభకు ఒక్కో అగ్రనేత హాజరయ్యేలా ఇది వరకే ప్లాన్​ చేసింది. ఆ సభా వేదికల నుంచే మహిళా, బీసీ, ఎస్సీ, మైనార్టీ వంటి కీలక డిక్లరేషన్లు ప్రకటించాలని నిర్ణయించింది. సభల్లో ఇతర పార్టీల నుంచి సీనియర్ల చేరికలు ఉండేలా చూడాలని టీపీసీసీ నేతలను అధిష్టానం ఆదేశించింది. కానీ ప్రస్తుతం ఆశించిన మేరకు చేరికలు లేకపోవడంతో బహిరంగ సభల నిర్వహణపై పునరాలోచనలో పడినట్లు సమాచారం. ఇదే కారణంతో ఈనెల 18న చెవ్వేళ్లలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముఖ్య​అతిథిగా హాజరయ్యే బహిరంగ సభను వాయిదా పడింది. సమయం తక్కువగా ఉన్నందున ఈనెల 24న సభ నిర్వహించాలని భావిస్తున్నట్లు టీపీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి మంగళవారం ప్రకటించారు. మరోవైపు.. గతంలో రెండు సార్లు ఖరారైన ప్రియాంకా గాంధీ నాగర్​కర్నూల్​జిల్లా కొల్లాపూర్​బహిరంగ సభ సైతం వాతావరణం అనుకూలించక వాయిదా పడింది. ఆ సభలో ప్రియాంక సమక్షంలో పార్టీలో చేరాల్సిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, తన అనుచరులతో  ఢిల్లీకి వెళ్లి అక్కడ అధినేతల సమక్షంలో కాంగ్రెస్​ కండువా కప్పుకున్నారు. తాజాగా బహిరంగ సభ నిర్వహణపై నీలినీడలు కమ్ముకోవడంతో టీపీసీసీ చేస్తామని చెప్పిన డిక్లరేషన్ల ప్రకటనకు మరింత జాప్యం జరిగే అవకాశాలున్నాయి. ఇదిలావుంటే.. బీఆర్ఎస్​గత ఎన్నికల మేనిఫెస్టోలోని అమలుకు నోచుకోని హామీల నిలదీత.. సర్కారు వైఫల్యాలపై టీపీసీసీ శ్రీకారం చుట్టిన తిరగబడదాం..తరిమికొడదాం కార్యక్రమం సైతం ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదనే అభిప్రాయం కాంగ్రెస్​ వర్గాల్లో వ్యక్తమవుతోంది. దీంతో రానున్న రోజుల్లో కార్యక్రమం విజయవంతం చేసేలా వ్యూహరచనలో టీపీసీసీ తలమునకలైంది.