జైలు నుండి బండి సందేశం

జైలు నుండి బండి సందేశం
  • నాపై కుట్ర చేసి కేసు పెట్టిన కేసీఆర్
  • మహోన్నత సమాజ నిర్మాణమే నా లక్ష్యం
  • ధైర్యంగా ఉండండి భవిష్యత్ మనదే
  • కరీంనగర్ జైలు నుండి బిజెపి స్టేట్ చీఫ్ బండి సంజయ్ కుమార్

ముద్ర ప్రతినిధి కరీంనగర్ : బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ జైలు నుండి బిజెపి కార్యకర్తలకు సందేశాన్ని పంపారు. బండి సంజయ్ తమ్ముడు బండి శ్రవణ్,  బిజెపి కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు ఈరోజు జైలులో బండి సంజయ్ ని కలిశారు. ఈ క్రమంలో తన మనోగతాన్ని  బిజెపి కార్యకర్తలకు తెలపాలని వారిని కోరినట్లు తెలిసింది. బండి సంజయ్ పంపిన సందేశం ఉన్నది ఉన్నట్లుగా "ముద్ర" పాఠకుల కోసం అందుబాటులో ఉంచుతున్నాం.

నా ప్రియమైన కార్యకర్తలారా.....భరతమాత ముద్దు బిడ్డల్లారా.....

మీ అందరికీ భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. బీజేపీ స్థాపించి నేటికి 43వ ఏళ్లయింది.  ఈ 4 నాలుగు దశాబ్దాల కాలంలో బీజేపీ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంది. పార్టీ కోసం ఎంతో మంది తమ జీవితాలనే త్యాగం చేశారు. మరెందరో  తమ ప్రాణాలను అర్పించారు. శ్యామాప్రసాద్ ముఖర్జీ, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ మొదలు వాజ్ పేయి వరకు ఎంతో మంది మహా నేతలు తమ సర్వస్వాన్ని పార్టీ కోసం ధారపోశారు.

మన రాష్ట్రంలో డీఎన్ రెడ్డి మొదలు చలపతి రావు, రామారావు, టైగర్ నరేంద్ర లాంటి ఎంతో మంది జీవిత కాలమంతా పార్టీ కోసం పనిచేశారు. జితేందర్ రెడ్డి వాళ్లు నక్సలైట్లకు ఎదురొడ్డి పార్టీ కోసం పనిచేస్తూ తూటాలకు బలయ్యారు.
ఎంతోమంది నేతలను ఏళ్ల తరబడి జైళ్లో పెట్టినా అదరలేదు. బెదరలేదు. సిద్దాంతం కోసం, ప్రజల కోసం పోరాడారు. మిగిలిన రాజకీయ పార్టీల మాదిరిగా బీజేపీకి అధికారం ఒక్కటే లక్ష్యం కాదు... మహోన్నతమైన భారతీయ సమాజం నిర్మాణమే అంతిమ లక్ష్యం. స్వర్గీయ అటల్ బిహారీ వాజ్ పేయి చెప్పినట్లుగా ఆ లక్ష్య సాధన కోసం జీవిత కాలం పట్టినా ఫరవాలేదు....చివరకు ప్రాణం పోయినా ఫరవాలేదు.. వచ్చే జన్మలోనూ ఆ లక్ష్య సాధన కోసమే పనిచేద్దాం.

ఈ క్రమంలో గిట్టని పార్టీలు, పాలకులు అధికారాన్ని అడ్డం పెట్టుకుని మనమీద ఎన్నో కుట్రలు, కుతంత్రాలకు ఒడిగడతాయి. నాపై మోపిన పేపర్ లీకేజీ కేసు ఆ కుట్రలో భాగమే. టీఎస్పీఎస్సీ లీకేజీలో వైఫల్యాలను, ప్రభుత్వ తప్పిదాలను, ఐటీశాఖ మంత్రిగా ఉన్న కేసీఆర్ కొడుకు పాత్రను ఎత్తి చూపుతూ  30 లక్షల మంది నిరుద్యోగుల కుటుంబాల పక్షాన గళమెత్తుతూ అలుపెరగకుండా బీజేపీ చేస్తున్న ఉద్యమాలను నిలువరించేందుకు, కార్యకర్తలను నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేందుకే కేసీఆర్ ప్రభుత్వం నాపై టెన్త్ పేపర్ లీకేజీ కుట్ర కేసు మోపి జైలుకు పంపింది. 

నాకు కేసులు, అరెస్టులు, జైళ్లు కొత్తకాదు. ప్రజల కోసం ఎన్నిసార్లు జైలుకు వెళ్లేందుకైనా సిద్ధంగా ఉన్నా. నా బాధంతా నిరుద్యోగుల భవిష్యత్ పైనే. 30 లక్షల నిరుద్యోగుల జీవితాలతో, వాళ్ల కుటుంబాలతో కేసీఆర్ ప్రభుత్వం చెలగాటమాడుతోంది. తమ కుటుంబ సభ్యులకు, పార్టీ నేతల అనుచరులకు, వందమాగధులకు ఉద్యోగాలు కల్పిస్తూ నిరుద్యోగులకు ఉద్యోగాలే రాకుండా చేస్తోంది. పోరాడి తెచ్చుకున్న తెలంగాణ ఇందుకోసమేనా? ఇక మాకు ఉద్యోగాలు రావా? అనే నిరాశ, నిస్ర్పహల్లో నిరుద్యోగ యువత ఉంది. నాడు తమ స్వార్థం కోసం 27 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులను బలి తీసుకుంది. ఈనాడు టెన్త్ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోంది. నాడు తెలంగాణ యువత బలిదానాలు చేసుకోవద్దని పార్లమెంట్ సాక్షిగా కొట్లాడింది బీజేపీయే... నేడు నిరుద్యోగులు, విద్యార్థుల పక్షాన ఉద్యమిస్తోంది బీజేపీయే. 

ఈ సమయంలో కేసీఆర్ కుట్రలకు భయపడి వెనుకంజ వేయొద్దు. ఈ విషయంలో ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్రమోదీగారే మనకు స్పూర్తి. గోద్రా అల్లర్ల ఘటనలో మోదీగారిని దోషిగా చూపితే బీజేపీని  దెబ్బతీసేందుకు కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలతో కలిసి కుహాన శక్తులు సాగించిన మారణ హోమాన్ని, మీడియా ద్వారా విష ప్రచారాన్ని సాగించిన విషయాన్ని మనం మర్చిపోలేం. అయినా మోదీగారు వెనుకంజ వేయలేదు. కార్యకర్తల మద్దతుతో ప్రజల్లోకి వెళ్లి మళ్లీ అధికారంలోకి వచ్చారు. కుహానా శక్తుల చెంప చెళ్లుమన్పించారు. అంతటి మహానేత ఈనెల 8న హైదరాబాద్ వస్తున్న నేపథ్యంలో ఆ సభకు హాజరయ్యే అవకాశం కన్పించకపోవడం బాధగా ఉంది. మీరంతా మోదీ సభకు హాజరు కావడంతోపాటు నిరుద్యోగ యువతను సభకు తరలించి దిగ్విజయవంతం చేయాలని కోరుతున్నారు.

ఇది అత్యంత క్లిష్ట సమయం. అయినప్పటికీ శ్యామాప్రసాద్, దీన్ దయాళ్ సిద్ధాంతాలు.... వాజ్ పేయి గారి త్యాగం, మోదీగారి స్పూర్తితో ముందుకు వెళదాం. ఈ తరుణంలో కేసీఆర్ కుట్రలకు భయపడితే 30 లక్షల మంది నిరుద్యోగుల, వాళ్ల కుటుంబాల జీవితాలు ప్రమాదంలో పడ్డట్లే. ఇప్పటికే కేసీఆర్ పాలనలో రైతులు, మహిళలు, విద్యార్థులు సహా సబ్బండ వర్గాలు అనేక కష్టాలను అనుభవిస్తున్నాయి. వాళ్లందరికీ బీజేపీ ఆశా దీపమైంది. వాళ్ల ఆశలను నెరవేర్చాలంటే పోరాటమే శరణ్యం. కేసీఆర్ సర్కార్ ను బొందపెట్టడమే మన లక్ష్యం.

భారత మాత ఐక్యత కోసం పోరాడే వీరులు బీజేపీ కార్యకర్తలు. దేశం కోసం దేహాలను సైతం తృణ ప్రాయంగా అర్పించే మహోన్నత త్యాగధనుల పార్టీ మనదే. జైళ్లు, నిర్భాధాలు మన పోరాటాలను ఆపలేవు.  భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను నిర్భంధించడమంటే బంతిని నేలకేసి కొట్టడమే. ఎంతగా విసిరి కొడితే అంతే వేగంగా పైకి లేస్తం.. దొంగ సారా, డ్రగ్స్, పేపర్ లీకేజీ, పత్తాల, భూ దందాల స్కాంలతో వేల కోట్లు కూడగట్టి విర్రవీగుతున్న కేసీఆర్ మెడలు వంచే సమయం ఆసన్నమైంది. బిడ్డ, కొడుకు చేసిన స్కాంలన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతుండటంతో  నిస్పృహ లో ఉన్న కల్యకుంట్ల ఫ్యామిలీ నన్ను అరెస్టు చేసి జైలుకు పంపడం ద్వారా ఉద్యమాలను అడ్డుకోవాలని చూస్తోంది. ప్రజల్లో బీజేపీ కి పెరుగుతున్న ప్రతిష్టను దెబ్బతీయాలనుకుంటోంది. ప్రతిపక్షాల కూటమికి ఛైర్మన్ ను చేస్తే ఎన్నికలకు అయ్యే ఖర్చునంతా తానే భరిస్తానంటూ ప్రతిపక్ష పార్టీలకు ఆఫర్ చేసిన విషయాన్ని ప్రముఖ జర్నలిస్ట్ రాజ్ దీప్ సర్దేశాయ్ బయటపెట్టడంతో నరేంద్రమోదీగారి ప్రభుత్వాన్ని ఓడించేందుకు అవినీతి సొమ్మునంతా పంచే కుట్ర బయటపడటంతో తెలంగాణా ప్రజల దృష్టి మళ్ళించే కుట్ర కు కెసీఆర్ ప్రయత్నిస్తున్నడు.

తెలంగాణ ప్రజలే నా కుటుంబం. మీరే నా బలం. గడీల్లో బందీ అయి విలపిస్తున్న నా తెలంగాణ తల్లిని బంధ విముక్తి చేయడమే మనందరి లక్ష్యం. అందుకోసం తెగించి కొట్లాడదాం.. రాబందుల రాజకీయ క్రీడ నుండి తెలంగాణ తల్లిని రక్షించుకుందాం. అందుకోసం మీరంతా కదిలిరండి. టీఎస్పీఎస్సీ లీకేజీకి బాధ్యుడైన కేసీఆర్ కొడుకును కేబినెట్ నుండి బర్తరఫ్ చేసే వరకు, నిరుద్యోగులకు రూ.లక్ష పరిహారం ఇచ్చేవరకు, లీకేజీ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించే వరకు ఐక్య పోరాటాలకు సిద్దం కండి. టెర్రరిస్టులకు మద్దతిచ్చే మజ్లిస్ పార్టీతో, తెలంగాణనే వ్యతిరేకించడమే కాకుండా  ఈ దేశాన్ని విచ్చినం చేసేందుకు కుట్ర చేస్తున్న కమ్యూనిస్టులతో కలిసి అంటగాకుతున్న కేసీఆర్ కుటుంబ- అవినీతి-నియంత  పాలనకు చరమ గీతం పాడేదాకా పోరాడదాం. తెలంగాణ ప్రజల ఆశయాలను నెరవేర్చేదిశగా క్రుషి చేద్దాం. ఈ పోరాటంలో కార్యకర్తలందరికీ జాతీయ నాయకత్వం పూర్తిగా అండదండలు, ఆశీస్సులు అందిస్తున్నందున ఎవరూ భయపడాల్సిన పనిలేదని తెలియజేస్తున్నా. ఇది అత్యంత క్లిష్ట సమయం.

 భారత్ మాతా కీ జై.... భారత్ మాతా కీ జై... భారత్ మాతాకీ జై....

మీ .....

బండి సంజయ్ కుమార్, ఎంపీ
బీజేపీ తెలంగాణ అధ్యక్షులు.