కరీంనగర్ అసెంబ్లీ కి  పోటీ చేస్తా

కరీంనగర్ అసెంబ్లీ కి  పోటీ చేస్తా
  • గంగులతో కుమ్కక్కు దుష్ప్రచారమే
  • జమిలీ ఎన్నికలొస్తే బీఆర్ఎస్ కు డిపాజిట్లు రావు
  • చంద్రబాబు అరెస్ట్ కక్షపూరితమే
  • బీజేపీ  జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ : రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ నియోజకవర్గం నుండే పోటీ చేస్తానని  బీజేపీ  జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రకటించారు. గురువారం ఆయన నివాసంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంత్రి గంగుల కమలాకర్ తో కుమ్మక్కైనట్లు జరుగుతున్న దుష్ప్రచారాన్ని కొట్టిపారేశారు. తాను నిరంతరం ప్రజా సమస్యలపై కొట్లాడే వ్యక్తినే తప్ప కుమ్కక్కు రాజకీయాలు తనకు తెలియవని స్పష్టం చేశారు. తాను పార్లమెంట్ సమావేశాలకు హాజరు కావడం, అమెరికా పర్యటనలో ఉండటంవల్లే కోర్టుకు హాజరుకాలేకపోయానని చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి దీక్షను భగ్నం చేసి కార్యకర్తలపై పోలీసులు చేసిన దాడిని తీవ్రంగా ఖండించారు. బీజేపీ చేస్తున్న దీక్షతో నిరుద్యోగులకు కేసీఆర్ సర్కార్ చేసిన మోసాల బండారం బయటపడుతుందనే భయంతోనే దీక్ష భగ్నం చేశారని వెల్లడించారు.

భూములమ్మి జీతాలిచ్చే దుస్థితిలో కేసీఆర్ ప్రభుత్వం ఉందని, రాష్రాన్ని 5.5 లక్షల కోట్ల అప్పుల పాల్జేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ ఇమేజ్ పెంచడమే కేసీఆర్ పనిగా పెట్టుకున్నాడని ఆగ్రహం వ్యక్తంచేశారు.
 జాతీయ సమైక్యతా ఉత్సవాలని కేసీఆర్ ప్రకటించడం హాస్యాస్పదం అన్నారు. జమిలి ఎన్నికలంటే బీఆర్ఎస్ నేతలకు భయమెందుకని ప్రశ్నించారు. చంద్రబాబు అరెస్టు కక్షపూరితమని ప్రజల్లో చర్చ నడుస్తుందన్నారు. జమిలీ ఎన్నికలొస్తే బీఆర్ఎస్ నేతలకు డిపాజిట్లు కూడా రావన్నారు. ఈ సమావేశంలో బిజెపి జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్, కార్పొరేటర్ పెద్దపల్లి జితేందర్,సొల్లు అజయ్ వర్మతో పాటు పలువురు పాల్గొన్నారు.