BRSకు ఓటు వేస్తే BJPకి వేసినట్లే: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

BRSకు ఓటు వేస్తే BJPకి వేసినట్లే: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
  • బిజెపి బీఆర్ఎస్ రహస్య ఒప్పందంలో భాగంగానే పరస్పర ఆరోపణలు
  • గొర్లు బర్లు చేపలంటూ బీసీలను మోసం
  • కాంగ్రెస్ అధికారంలోకి రాగానే బీసీ సబ్ ప్లాన్
  • ఉద్యోగ నియామకాలు లేకపోవడంతో నిరుద్యోగులకు కేంద్రాలుగా యూనివర్సిటీలు
  • కర్ణాటకలో వచ్చిన కాంగ్రెస్ గెలుపు సునామీ తెలంగాణలోనూ రాబోతుంది
  • సీఎల్పీ నేత భట్టి విక్రమార్క 

ముద్ర ప్రతినిధి సూర్యాపేట: తెలంగాణలో బిఆర్ఎస్ కి వేసే ప్రతి ఓటు బిజెపికి వేసినట్లేనని,ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలు ముఖ్యంగా మైనార్టీలు మదిలో పెట్టుకొని కాంగ్రెస్ ను గెలిపించాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్ర 104వ రోజు చివ్వెంల మండలం బండమీది చందుపట్ల కార్నర్ మీటింగ్ లో భట్టి ప్రసంగించారు. కర్ణాటకలో వచ్చిన ఫలితమే తెలంగాణలో సునామీలా రాబోతుందన్నారు. లౌకిక పార్టీ కాంగ్రెస్ ఓటు వేస్తేనే బిజెపికి వ్యతిరేకంగా వేసినట్టు అవుతుందన్నారు. మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ ఇస్తానని మోసం చేసిన సీఎం కేసీఆర్ కు వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు.

మంత్రి కేటీఆర్ ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులను కలవడంతోనే బిజెపి, బిఆర్ఎస్ వేర్వేరు కాదని మరోసారి స్పష్టమైనదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అవినీతిపై మాట్లాడుతున్న కేంద్ర ప్రభుత్వ పెద్దలు. కేసీఆర్ పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో చెప్పాలన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ లేకుండా చేయాలనే కుట్రలో భాగంగానే బిజెపి, బిఆర్ఎస్ పార్టీలు రహస్య ఒప్పందం ప్రకారం పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారన్నారు. తెలంగాణలో 50% ఉన్న బీసీలకు కేసీఆర్ ప్రభుత్వం ఐదు శాతం నిధులు కేటాయించి గోర్లు, బర్లు, చేపలంటూ దగా చేస్తున్నదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే బీసీలకు జనాభా దామాషా పద్ధతి ప్రకారం నిధులు కేటాయి స్తామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే బీసీ సబ్ ప్లాన్ తీసుకొస్తామన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. నియామకాలు లేకపోవడంతో యూనివర్సిటీలు నిరుద్యోగులకు కేంద్రాలుగా మారాయన్నారు.

రైతులు, నిరుద్యోగులు, చేతివృత్తులు, కుల వృత్తుల వాళ్లు అందరూ కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. రైతుబంధు మాత్రమే ఇచ్చి రైతుకు మిగిలిన అన్ని రకాల సబ్సిడీలను రాష్ట్ర ప్రభుత్వం తొలగించిందన్నారు.‌ బిఆర్ఎస్ రైతు వ్యతిరేక ప్రభుత్వమన్నారు. సూర్యాపేట ప్రజల స్పందన చూస్తుంటే వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని అనిపిస్తుందన్నారు. నిరుద్యోగులకు వార్షిక క్యాలెండర్ ప్రకటించి ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తామన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితి ఐదు లక్షల రూపాయలకు పెంచుతామన్నారు. ఇల్లు లేని బీదలకు డబుల్ బెడ్ రూమ్ నిర్మాణం కోసం ఐదు లక్షల రూపాయలు మంజూరు చేస్తామన్నారు. భూమిలేని నిరుపేదలకు సంవత్సరానికి 12 వేల రూపాయలు కూలి బంధు ఇస్తామన్నారు. రైతుల 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. ప్రతి కుటుంబానికి ఇన్సూరెన్స్ రాష్ట్ర ప్రభుత్వ ప్రీమియం చెల్లించే విధంగా నిర్ణయం తీసుకుంటామన్నారు.  ప్రజల సంపద ప్రజలకే చెందేలా ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకుందామన్నారు. రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ జెండా ఎగురుతుందన్నారు. అంత ముందు తిమ్మాపురం వరకు జరిగిన పీపుల్స్ మార్చ్ లో ప్రజా గాయకుడు గద్దర్ ఆడి పాడి తన సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ పాదయాత్రలో  మాజీమంత్రి, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి,డిసిసి అధ్యక్షుడు చెవిటి వెంకన్న సహా నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.