బెహరాన్ లో కోరుట్ల పేట యువకుని మృతి - దుఃఖ సముద్రంలో కుటుంబ సభ్యులు

బెహరాన్ లో  కోరుట్ల పేట యువకుని మృతి - దుఃఖ సముద్రంలో కుటుంబ సభ్యులు

ముద్ర, ఎల్లారెడ్డిపేట: బెహరాన్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో కోరుట్ల పేట యువకుడు శుక్రవారం రాత్రి మృతి చెందాడు. ఎల్లారెడ్డిపేట మండలం కోరుట్లపేట గ్రామానికి చెందిన మేకన్ పల్లి సుమన్ 26 గత ఐదు సంవత్సరాల నుంచి బెహరాన్ లో ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. సుమన్ పనిచేస్తున్న కంపెనీ కేరళ రాష్ట్రానికి చెందిన వ్యక్తులది అని తెలిసింది. కేరళలో ప్రతి సంవత్సరం జరిగే ఓనం పండుగను పురస్కరించుకొని ఆ కంపెనీ ఓ విందును ఏర్పాటు చేయగా సుమన్ తో పాటు కేరళ రాష్ట్రానికి చెందిన నలుగురు వెళ్లి తిరుగు ప్రయాణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. జరిగిన సంఘటనను కోరుట్ల పేటలో నివసిస్తున్న తల్లిదండ్రులు నరసయ్య నరసవ్వ లకు శనివారం సమాచారం అందించడంతో కుటుంబ సభ్యులు దుఃఖ సముద్రంలో మునిగిపోగా కోరుట్ల పేట గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

కోరుట్ల పేట ఎంపీటీసీ మధు బెహరాన్ లో నివసిస్తున్న సంబంధికులకు ఫోన్ చేసి మృతదేహాన్ని తీసుకు వచ్చుటకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నాడు. అదేవిధంగా మంత్రి కేటీఆర్ కు వాట్సాప్ ద్వారా సమాచారం అందించడం జరిగిందని మధు పేర్కొన్నాడు. కాగా మృతునికి వివాహం కాలేదు ఓ సోదరి ఉంది.