ఆందోళనలతో అట్టుడికిన కలెక్టరేట్​

ఆందోళనలతో అట్టుడికిన కలెక్టరేట్​

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ కలెక్టరేట్​  ఆందోళనలతో అట్టుడికింది. సోమవారం అంగన్ వాడీ ఉద్యోగులు, పోడు రైతులు, సీపీఎస్ ఉద్యోగులు, కల్లు గీత కార్మికులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కలెక్టరేట్ మెయిన్ గెట్ ముందు పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. 

కోర్కెల సాధన కోసం అంగన్​వాడి ఉద్యోగులు
పెరుగుతున్న ధరలకు అనుగుణంగా అంగన్​ వాడీ టీచర్​లకు నెలకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని అంగన్​ వాడీ ఎంప్లాయిస్​ యూనియన్ జిల్లా కార్యదర్శి నర్సమ్మ డిమాండ్ చేశారు. అంగన్​ వాడీ ఉద్యోగులు కోర్కెల దినం సందర్భంగా సోమవారం మెదక్ మార్కెట్ యార్డ్ నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి, ధర్నా చేశారు. ఈ సందర్భంగా నర్సమ్మ మాట్లాడుతూ అంగన్ వాడీ టీచర్​లు సెంటర్​ల నిర్వహణతోపాటు, ప్రభుత్వం అప్పగించే ఆనేక బాధ్యతలు నిర్వర్తిస్తున్నా చాలీచాలనీ వేతనం ఇస్తుండటంతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. సీఐటీయూ జిల్లా అధ్యక్ష , కార్యదర్శులు మహేందర్ రెడ్డి, బస్వరాజు మాట్లాడుతూ అంగన్​ వాడీ ఉద్యోగుల మీద అధికారుల వేధింపులు ఆపాలని డిమాండ్​ చేశారు. అనంతరం అదనపు కలెక్టర్ రమేష్ కు వినతిపత్రం అందజేశారు. 

పోడు పట్టాల కోసం
అనేక ఏండ్లుగా భూములు సాగు చేస్తూ పంటలు పండించుకుంటున్నా తమకు పోడు పట్టాలు ఇవ్వకపోవడంపై చేగుంట మండలం నడిమితండా గ్రామ పంచాయతీ పరిధి రైతులు కలెక్టరేట్​ వద్ద నిరసన తెలిపారు. తమ గ్రామ పరిధి లోని సర్వే నెంబర్ 158, 248, 313 లో దాదాపు 200 మంది రైతులం దాదాపు 70 ఏండ్లుగా భూములు సాగు చేస్తున్నా పట్టా పాస్ బుక్కులులేక రైతు బందు, రైతు బీమా, క్రాప్ లోన్ వంటి లబ్ధి చేకూరడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని గ్రామాల పరిధిలో పోడు రైతులకు పట్టాలు ఇచ్చిన తమకు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. సర్వేచేసి పోడు భూములు సాగు చేస్తున్న రైతులందరికి పోడు పట్టాలివ్వాలని కోరారు. పెద్ద ఎత్తున రైతులు కలెక్టరేట్ కు తరలిరాగా పోలీసులు మెయిన్​ గేట్​ వద్దే వారిని అడ్డుకుని కొందరిని మాత్రమే లోనికి పంపించారు. ​ 

పాత పెన్షన్​ కోసం సీపీఎస్​ ఉద్యోగులు 
ప్రభుత్వం సీపీఎస్​ ను రద్దుచేసి పాత పెన్షన్ ను పునరుద్ధరించాలని తెలంగాణా సీపీఎస్​ ఎంప్లాయిస్​ అసోసియేషన్​ జిల్లా అధ్యక్షులు ఎల్లయ్య, ప్రధాన కార్యదర్శి చరణ్​ సింగ్​, రాష్ట్ర సహ అధ్యక్షులు కర్రోళ్ల దేవయ్య డిమాండ్​ చేశారు. పాత పెన్షన్ సాధన సంకల్ప రథయాత్ర, చలో హైదరాబాద్ పోస్టర్​ను కలెక్టరేట్​ వద్ద రిలీజ్​ చేశారు. ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్న రథయాత్ర ఈ నెల 27న మెదక్​ జిల్లాలో కొనసాగుతుందన్నారు. సీపీఎస్​ రద్దయ్యే వరకు పోరాడుతామన్నారు. 

కనీస వసతులు కల్పించాలి
మెదక్​ మున్సిపాలిటీ పరిధి పిల్లికొటాల్​ లోని డబుల్​ బెడ్​ రూమ్ కాలనీలో కనీస వసతులు లేక రోజు ఇబ్బందులు పడుతున్నామని కాలనీ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదని, బాత్​ రూమ్​లు సరిగా లేవని, తాగునీరు సక్రమంగా సరఫరా కావడం లేదని తెలిపారు. దీంతో కాలనీలో ఉండలేని పరిస్థితి ఉందన్నారు. కనీస సౌకర్యాలు కల్పించాలని ప్రజావాణిలో వినతి పత్రం ఇచ్చారు.  

కల్లుగీత కార్మికుల ధర్నా
సమస్యలు పరిస్కరించాలి, డిమాండ్​లు నెరవేర్చాలంటూ కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్​ వద్ద ధర్నాచేశారు. వృత్తిపై ఆధారపడిన గీత కార్మికులందరికి రూ.లక్ష ఆర్థిక సహాయం ఇవ్వాలని, సొసైటీ సభ్యులందరికి ప్రమాద బీమా, ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలని, నిరుద్యోగులకు ఓనర్​ కం డ్రైవర్​ స్కీం కింద కార్లు ఇవ్వాలని, గ్రామాల్లో బెల్ట్​ షాప్​లు తొలగించాలని డిమాండ్​ చేశారు. గౌడజన హక్కుల పోరాట సమితి ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి రాజాగౌడ్, గౌడసంఘ జిల్లా అధ్యక్షులు యాదాగౌడ్​, కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు మ​ల్లాగౌడ్​ తదితరులు పాల్గొన్నారు.