మార్చి 15 కల్లా డబుల్ బెడ్ రూం ఇండ్లను పంపిణీకి సిద్ధం చేయాలి - కలెక్టర్ అనురాగ్ జయంతి 

మార్చి 15 కల్లా డబుల్ బెడ్ రూం ఇండ్లను పంపిణీకి సిద్ధం చేయాలి - కలెక్టర్ అనురాగ్ జయంతి 

ముద్ర ప్రతినిధి, రాజన్నసిరిసిల్ల: సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్ రూం ఇండ్ల కాలనీలలో పెండింగ్ పనులను పూర్తి చేసి వచ్చే మార్చి 15 కల్లా పంపిణీకి సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మున్సిపల్ , ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించారు. గురువారం సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని రగుడు, శాంతి నగర్, పెద్దూర్ లలో డబుల్ బెడ్ రూం ఇండ్లను జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, ఆర్ అండ్ ఈఈ శ్యామ్ సుందర్ , తహశీల్దార్ విజయ్ కుమార్, ఏఈ భాస్కర్ తదితరుల తో కలిసి జిల్లా కలెక్టర్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ, నిర్మాణాలు త్వరగా పూర్తి చేసి, లబ్ధిదారులకు అందజేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. రగుడు లో 72, శాంతి నగర్ లో 204, పెద్దూర్ లో 516 డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం చేపట్టిన చోట బ్లాకుల వారీగా నిర్మాణాలు, మౌలిక సదుపాయాల కల్పన పై  ప్రత్యేక దృష్టి సారించాలనీ మున్సిపల్ అధికారులకు జిల్లా కలెక్టర్ సూచించారు. నిర్మాణాలు పూర్తయిన చోట విద్యుద్దీకరణ, సానిటరీ, డ్రైన్స్ నిర్మాణం, విద్యుత్, సీవరేజ్, సెప్టిక్ ట్యాoకుల నిర్మాణాలు, అంతర్గత రోడ్ల లపై దృష్టి పెట్టి పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. ప్రతి డబుల్ బెడ్ రూం కాలనీ లో ఆరోగ్య ఉప కేంద్రం, అంగన్వాడి కేంద్రం లకు అనువైన బిల్డింగ్ లను గుర్తించాలన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కాలనీకి వెళ్లే మార్గాలు, అంతర్గత రోడ్లకు ఇరువైపులా మొక్కలను నాటాలన్నారు. వివిధ శాఖల సమన్వయంతో మార్చ్ 15 కల్లా పనుల పూర్తికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అనురాగ్ జయంతి పేర్కొన్నారు. ప్రతి వారం పురోగతిని క్షేత్ర స్థాయిలో సమీక్ష నిర్వహించాలన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కాలనీలో మౌలిక వసతుల పురోగతిని సమీక్షించేందుకు ప్రతివారం క్షేత్రస్థాయిలో పర్యటించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్ కు సూచించారు. క్షేత్రస్థాయిలోనే పురోగతిపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి నిర్దేశిత సమయంలోగా అన్ని వసతులతో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పంపిణీ సిద్ధంగా ఉండేలా చూడాలన్నారు.


అనంతరం జిల్లా కలెక్టర్ సిరిసిల్ల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో గ్రౌండ్ అభివృద్ధి పనులను మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య తో కలిసి పరిశీలించారు. రూ.2 కోట్లతో చేపడుతున్న ఈ అభివృద్ధి పనులలో వేగం పెంచి మార్చి నెలాఖరులోగా అభివృద్ధి పనులను పూర్తి చేయాలన్నారు.గ్రౌండ్ కు వచ్చే అన్ని గేట్ల ప్రవేశ మార్గాలను అందంగా తీర్చిదిద్దాలన్నారు. క్రికెట్ ,కబడ్డీ, వాలీబాల్ కోర్టులను అభివృద్ధి చేయాలన్నారు.రాత్రి వేళలో కూడా క్రీడలను సాధన చేసేందుకు వీలుగా నాలుగు వైపులా హైమాస్ లైట్లు ఏర్పాటు చేయాలన్నారు. వాకింగ్ ట్రాక్కును కూడా ఏర్పాటు చేస్తూ దానికి ఇరువైపులా అలంకరణ మొక్కలను నాటాలన్నారు. గ్రౌండ్లో మహిళలకు, పురుషులకు వేర్వేరుగా టాయిలెట్ బ్లాకులను నిర్మించాలనీ మున్సిపల్ అధికారులను ఆదేశించారు.