రైతు ద్రోహి కేసీఆర్..! 

రైతు ద్రోహి కేసీఆర్..! 
  • తెలంగాణ రాష్ట్ర ప్రజల సొమ్ము కేసీఆర్ తాత జాగిరా..? 
  • ఫసల్  భీమా యోజనపై నిర్లక్ష్యం.. 
  • కేంద్రం  వల్ల రంగారెడ్డి జిల్లాకు 422 కోట్ల నిధులు 
  • బి జె పి  రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆగ్రహం

ముద్ర, షాద్‌నగర్ : తెలంగాణ రాష్ట్రంలో కౌలు రైతులకు నయా పైసా న్యాయం చేయని ముఖ్యమంత్రి కేసీఆర్ తన తాత జాగీరులా రాష్ట్ర ప్రజల సొమ్మును పంజాబ్, హర్యానా రైతులకు అప్పనంగా పంచుతున్నాడంటూ భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుబంధు పేరిట రైతులను దారుణంగా మోసం చేశారని ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో దోచుకుంటున్నాడని సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు. 

దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి మోడీ 1.25 లక్షల పీఎం కిసాన్ సమృద్ధి కేంద్రాలను జాతికి అంకితం చేయనున్న కార్యక్రమాన్ని పురస్కరించుకొని  గురువారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో గణేశ్ ఆగ్రో ఏజెన్సీ ఎరువుల దుకాణంలో ప్రధాని మోడీ డిజిటల్ కార్యక్రమాన్ని ఆన్లైన్ ద్వారా వీక్షించారు.

 అనంతరం  అయన మట్లాడుతూ 1.25 లక్షల పీఎం కిసాన్ సమృద్ధి కేంద్రాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతికి అంకితం చేయడం గొప్ప విషయమని కొనియాడారు.  దేశంలోని రిటైల్ ఎరువుల దుకాణాలను దశలవారీగా పీఎం కిసాన్ సమృద్ధి కేంద్రాలుగా    మారుస్తోందని మలిదశలో లక్ష 75 వేల పీఎం కిసాన్ సమృద్ధి కేంద్రాలను  అందుబాటులోకి తీసుకురానున్నారని పేర్కొన్నారు. ఇవి రైతుల అనేక రకాల అవసరాలు తీరుస్తాయని, వ్యవసాయానికి అవసరమైన ముడిపదార్ధాలు  , భూసార పరీక్షలు,, విత్తనాలు, ఎరువుల కోసం పరీక్షా సౌకర్యాలు అందిస్తాయని వివరించారు. వివిధ అంశాలపై  రైతులకు అవగాహన కల్పించడం, వివిధ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారాన్ని అందించడం, బ్లాక్, జిల్లా స్థాయి అవుట్‌లెట్‌లలో రిటైలర్‌ల  సామర్థ్యాన్ని పెంపొందించడానికి పీఎం కిసాన్ సమృద్ధి కేంద్రాల ద్వారా చర్యలు అమలు జరుగుతాయని ఈటల రాజేందర్ వివరించారు.

అమెరికా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో యూరియా, డిఎపిని రైతులు కొనలేని ధరలు ఉన్నాయని పేర్కొన్నారు. రైతులకు సంవత్సరానికి 10వేలు చేతులో పెట్టి అన్ని సబ్సిడీలని ఎత్తివేసారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఫసల్  భీమా యోజనపై నిర్లక్ష్యం.. 

కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ఫసల్ బీమా యోజన పథకాన్ని రూపొందిస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర వాటాను ఇవ్వకుండా పథకాన్ని నిర్వీర్యం చేశారని అన్నారు దీంతో నేడు రైతులు ప్రకృతి వైపరీత్యాల నేపథ్యంలో ఎన్నో నష్టాలు చవిచూస్తున్నారని, ఫసల్ బీమా యోజన ఉంటే వారికి నష్టపరిహారం పెద్ద ఎత్తున వచ్చేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో పంట నష్టం జరిగి రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వాటికి సీఎం కేసీఆర్ ప్రభుత్వం కారణమని ధ్వజమెత్తారు. ఫసల్ బీమా యోజన పథకం ఉంటే నేడు రైతులకు న్యాయం జరిగేదని అన్నారు. 

కోట్లమంది రైతులకు ప్రయోజనం చేకూరే కార్యక్రమాలు చేపడుతున్నామని18 వేల కోట్లు ఈ రోజు రైతుల అకౌంట్స్ లో జమ అయ్యిందని అన్నారు. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్ల తరువాత రైతుల బాధలు, దుఖాన్ని అర్థం చేసుకొనే ప్రభుత్వం వచ్చిందని, వారి మేలు కోసం ఈ ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. కిసాన్ సమృద్ది కేంద్రాలు "ఒన్ స్టాప్ సెంటర్". రైతులకు అవసరం అయిన అన్ని వస్తువులు ఇక్కడే దొరుకుతాయని, ఇంకా 1 లక్ష 75 వేల ప్రధాన మంత్రి కృషి సంవృద్ది కేంద్రాలు త్వరలో ఏర్పాటు చేస్తాం ఆన్నారు. కరోనా మహమ్మారి వల్ల,  ఉక్రెయిన్ యుద్ధం వల్ల  ఫెర్టిలైజర్ ధరలు పెరిగినా కూడా ఆ భారం రైతుల మీద పడనీయలేదనీ యూరియా  2503 రూపాయలు ఉంటే రైతులకు 267 రూపాయలకు అందిస్తుందని, కేంద్రం ఇస్తున్న సబ్సిడీ 2236 రూపాయలు.

దేశంలో మెడికల్ కాలేజీల సంఖ్యను గణనీయంగా పెంచాం అనీ, మాతృ భాషలో చదువుకొనే అవకాశం కలిపిస్తున్నామని, కలలు పెద్దగా కంటేనే ఫలితాలు పెద్దగా ఉంటాయని ప్రధానమంత్రి మోడీ మాటలను నెమరువేశారు. మోదీ 11 కోట్ల రైతులకు ప్రధాని సమ్మాన్ నిధి ఇచ్చి ఆదుకున్నారని ప్రపంచ మార్కెట్లో ఎరువుల ధర పెరిగినా మన దేశంలో పెరగకుండా రైతులకు సబ్సిడీ మీద ఎరువులు అందిస్తున్నారని తెలిపారు.
యూరియా, డీఏపి, 20-20  సంవత్సరానికి ఒక ఎకరానికి 20 వేల రూపాయల సబ్సిడీ అందిస్తున్నారు. 6 వేల రూపాయలు ప్రతి ఎకరానికి సమ్మాన నిధి కింద అందిస్తున్నారని వివరించారు.

పంటకి 5 వేల రూపాయలు ఇచ్చి అన్నీ నేనే ఇచ్చిన అని కెసిఆర్ చెప్పుకుంటున్నారనీ అది ఇచ్చి అనేక పనిముట్ల సబ్సిడీ తొలగించారని అన్నారు. పవర్ స్ప్రే,  రోటావేటర్లు, చిన్న ట్రాక్టర్, కల్టివెటర్ ఇవ్వడం లేదు. డ్రిప్, గ్రీన్ హౌస్ సబ్సిడీ ఎత్తివేశారనీ కెసిఆర్ వచ్చాక సబ్సిడీ విత్తనాలు లేవు, ఎరువులు లేవు...ఇదేనా అబ్ కీ సర్కార్ కిసాన్ సర్కార్ అంటే? ప్రశ్నించారు.

కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటే 5 పైసలు ఇవ్వని కెసిఆర్ మన డబ్బులు తీసుకెళ్ళి వేరే రాష్ట్రంలో ఇవ్వడం సిగ్గుచేటన్నారు. రైతులు బాగుంటే పల్లెలు, పల్లెలు బాగుంటేనే రాష్ట్రం, రాష్ట్రాలు బాగుంటేనే దేశం బాగుంటుంది అని గాంధీజీ చెప్పినట్టు గ్రామస్వరాజ్యమే మా లక్షం అని ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి ప్రకటించారని, మేము వస్తె నిజమైన రైతురాజ్యం తీసుకువస్తాం అన్నారు. కెసిఆర్ మోసపు మాటలు నమ్మవద్దు అని రైతాంగాన్ని కోరుతున్నానని ఈటల రాజేందర్ అన్నారు.

ఈ కార్యక్రమములో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొక్క నరసింహారెడ్డి, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి, అందే బాబయ్య రాష్ట్ర యువ నాయకులు ఏపీ మిథున్ రెడ్డి, బిజెపి సీనియర్ నేత పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి, షాద్నగర్ నియోజకవర్గ కన్వీనర్ విజయ్ కుమార్  తదితరులు పాల్గొన్నారు.