పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి స్వాగతం పలికిన సూర్యాపేట పొంగులేటి అనుచరులు

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి స్వాగతం పలికిన సూర్యాపేట పొంగులేటి అనుచరులు

ముద్ర ప్రతినిధి, సూర్యాపేట: హైదరాబాద్ నుండి ఖమ్మం వెళ్తున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి గురువారం సూర్యాపేట జిల్లా టేకుమట్ల గ్రామంలో పొంగులేటి అనుచరులు పెద్దిరెడ్డి రాజా, శెనగాని రాంబాబు, మోదుగు నాగిరెడ్డి, నెరేళ్ల మధు, బాషాపంగు భాస్కర్ స్వాగతం పలికారు. అనంతరం విలేకరులతో పొంగులేటి శ్రీనివాస్ మాట్లాడారు.

అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు ప్రభుత్వ సొమ్ముతో దశాబ్ది ఉత్సవాలను నిర్వహిస్తున్నారని,ఏమి సాధించారని దశాబ్ది ఉత్సవాలను నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. దోచుకున్న సొమ్ము ఎక్కడ ఖర్చు చేస్తే తగ్గిపోతుందోనని ధనిక రాష్ట్రమైన తెలంగాణను రూ.5లక్షల కోట్ల అప్పులపాలు చేసి ఇంకా అప్పుల పాలు చేసేందుకు  ప్రభుత్వ సొమ్ముతో దశాబ్ది ఉత్సవాల నిర్వహిస్తున్నారని  దుయ్యబట్టారు.చెరువులలో నాలుగు గంపల మట్టి తీసి 26వేల చెరువుల పునరుద్ధరణ చేసిన అని గొప్పలు చెప్తున్న కేసీఆర్ ప్రభుత్వం ఆ చెరువులను నిర్మించిన పార్టీలను ఎంతో సన్మానించాలనీ అన్నారు.చౌక బారు ఎత్తుగడలతో మూడోసారి అధికారంలోకి రావలనుకుంటు నమ్మబలికె ప్రయత్నాలు చేస్తున్నారని,ఈ సారి యావత్ తెలంగాణ ప్రజానీకం మోసపోవడానికి సిద్ధంగా లేరని స్పష్టం చేశారు.

ఎన్నికలప్పుడే కేసీఆర్ కు  ప్రజలు, ఉద్యమకారులు  గుర్తొస్తారని, గడిచిన 9ఏండ్లలో గుర్తురాని శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ మరో మూడు నెలల్లో ఎన్నికలు వస్తున్నాయని ఇప్పుడు గుర్తొచ్చిందని ఎద్దేవా చేశారు. ఎన్నికలు వస్తున్నాయని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వకుండా రూ.5లక్షలను  రూ. 3లక్షలు చేశారని, తెలంగాణ వస్తే బతుకులు మారుతాయని కలలు కన్న తెలంగాణ బిడ్డలు కోర్కెలు  కలలుగానే మిగిలిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.

మాయమాటలతో మభ్యపెడుతూ తెలంగాణ ప్రజల కష్టసుఖాలను వదిలేసి కేవలం కేసీఆర్ కుటుంబం కోసమే తాపత్రయ పడుతున్నారనీ ఆరోపించారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో కేసీఆర్ తెలంగాణ ప్రజలను మోసం చేశాడని ,మభ్యమాటలతో మూడో సారి అధికారంలోకి రావలనుకుంటు కలలు కంటున్న  కల్వకుంట్ల కుటుంబానికి కలలు కలలుగానే మిగిల్చి కష్టపడి పని చేసి తెలంగాణ బిడ్డలకు, వారి ఆత్మ గౌరవం నిలిపేందుకు తమ టీం తరుపున కృషి చేస్తాం అని స్పష్టం చేశారు. కలలు కన్న తెలంగాణ సాదించుకోవలనీ, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ తిరిగి ప్రజలకు అండగా ఉండాలన్న సూచనలతో త్వరలో మంచి నిర్ణయం తీసుకోబోతున్నాము అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు.