అట్టహాసంగా జిల్లా పోలీస్ స్పోర్ట్స్ మీట్

అట్టహాసంగా జిల్లా పోలీస్ స్పోర్ట్స్ మీట్

ముద్ర ప్రతినిధి, మెదక్: జిల్లా నూతన పోలీస్ గ్రౌండ్ లో  డిస్ట్రిక్ట్  పోలీస్ యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ గురువారం ప్రారంభమాయ్యాయి. ఈ మీట్ ను ముఖ్య అతిథిగా జిల్లా ఎస్.పి రోహిణి ప్రియదర్శిని ప్రారంభించిన అనతరం గౌరవ వందనం స్వీకరించారు. తూప్రాన్ సబ్ డివిజన్, మెదక్ సబ్ డివిజన్ ఏ.ఆర్.హెడ్ క్వాటర్  ప్లాటూన్స్ తో స్పోర్ట్స్ కమాండర్ ఆర్ఐ అచ్యుత రావ్  ఆధ్వర్యంలో స్పోర్ట్స్ పెరేడ్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్.పి.రోహిణి ప్రియదర్శిని  మాట్లాడుతూ.... ఖాకీ బట్టలతో నిత్యం పని ఒత్తిడిలో పరుగులు తీసే పోలీసులు ఆ పనులు పక్కన పెట్టి ఆటలు ఆడేందుకు మైదానంలో దిగారన్నారు.

డీఎస్పీ, సీఐ, ఎస్‌ఐ, ఏఎస్‌ఐ, హెడ్‌ కానిస్టేబుల్‌, కానిస్టేబుల్‌, హోంగార్డు హోదాలను పక్కన పెట్టి తమ జట్టును గెలిపించుకునేందుకు కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. పోలీసు సిబ్బంది శాంతిభద్రతల పరిరక్షణతో పాటు క్రీడల్లో ప్రతిభ కనబర్చాలని పోలీసు అధికారులకు, సిబ్బందికి సూచించారు. నిత్యం పని ఒత్తిడితో విధులకు హాజరయ్యే పోలీసులకు మానసిక ప్రశాంతత కోసం స్పొర్ట్స్ మీట్‌ నిర్వహిస్తున్నామన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం పరితపిస్తున్న పోలీసులకు ఆటల పోటీలు నూతన ఉత్సాహాన్ని ఇస్తాయన్నారు. వార్షిక క్రీడలు పోలీసులకు ఉపశమనాన్ని కలిగిస్తాయన్నారు. గెలుపు,  ఓటములు సమానంగా స్వీకరించి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఆరోగ్యం, ఉల్లాసం, ఉత్సాహానికి క్రీడలు దోహదపడతాయన్నారు. సమాజంలో పోలీసు పాత్ర అనేది అత్యంత కీలకమన్నారు. స్పోర్ట్స్ మీట్ ప్రారంభ సూచికగా శాంతికపోతాలను గాలిలోకి వదిలారు. పోలీసు అధికారులు, సిబ్బందికి మూడు రోజులపాటు జరగనున్న ఈ స్పోర్ట్స్ మీట్లో కబడ్డీ, వాలీబాల్, 100 మీటర్ల పరుగు పందెం, 200 మీటర్ల పరుగు పందెం, 4-100 రిలే,టగ్ ఆఫ్ వార్, డిస్కస్ త్రో, షాట్ ఫుట్, షటిల్ బ్యాడ్మింటన్ పోటీలను నిర్వహించారు. మొదటి రోజు ఆటల్లో భాగంగా ఏ.ఆర్.హెడ్ క్వాటర్ కబడ్డీ జట్టుపై తూప్రాన్ సబ్ డివిజన్ జట్టు 31-26 పాయింట్లతో గెలుపొందింది. 


ఈ కార్యక్రమంలో మెదక్ డి.ఎస్.పిలు సైదులు, యాదగిరి రెడ్డి, ఏ.ఆర్ డి.ఎస్.పి.శ్రీనివాస్,అచ్యుత రావ్, ఆర్.ఐ.నాగేశ్వర్ రావ్, జిల్లా సి.ఐ.లు, ఎస్.ఐ లు,ఏ,ఆర్ ఎస్.ఐ లు, పిడిలు మాధవరెడ్డి, శ్రీనివాసరావు, పీఈటిలు మధుసూదన్, దేవేందర్ రెడ్డి, వినోద్ కుమార్ పీఈటి, మధ, సిబ్బంది పాల్గొన్నారు.