ధర్మారంలో గుడిసెకు చేరని 'గృహలక్ష్మి' పథకం

ధర్మారంలో గుడిసెకు చేరని 'గృహలక్ష్మి' పథకం

శంకరపట్నం ముద్ర అక్టోబర్ 14: శంకరపట్నం మండల పరిధిలోని ధర్మారం గ్రామంలో గుడిసెలలో నివసిస్తున్న పేదలకు గృహలక్ష్మి పథకం రాలేదని బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. అదే గ్రామానికి చెందిన దేవునూరి దేవమ్మ లింగయ్య కుటుంబం తన ముగ్గురు పిల్లలతో గత 15 సంవత్సరాలుగా ఒక పూరి గుడిసెలో నివసిస్తున్నారు.    రెండుసార్లు గ్రామానికి వచ్చిన స్థానిక ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ గుడిసెను చూసి గృహలక్ష్మి మంజూరు చేస్తానని హామీ ఇచ్చి మోసం చేశారని బిఎస్పి నాయకులు విమర్శించారు. బిఆర్ఎస్ ప్రభుత్వంలో గృహ లక్ష్మీ పథకం కింద తనకు సొంత ఇల్లు కట్టుకునే  అవకాశం వస్తుంది అని ఎదురుచూసిన ఆ కుటుంబానికి నిరాశే ఎదురైంది. పథకం వచ్చిన ప్రారంభంలో తమ పేరు మొదటి అర్హులుగా గుర్తించి ప్రొసీడింగ్లు అందించే సమయానికి వారి పేరు అందులో లేకపోవడం పై గ్రామంలో చర్చనియాంశం అయ్యింది. గుడిసెలో నివసించే వారికి గృహలక్ష్మి పథకం  పొందేందుకు అర్హులు కారా అని బీఎస్పీ నాయకులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అర్హులను పక్కన పెట్టేసి బి ఆర్ఎస్ పార్టీ స్థానిక కార్యకర్తలు వారి స్వార్థ పూరిత ఆలోచనలతో వీరిని పక్కకు పెట్టారు అని విమర్శించారు.

ఇలాంటి పరిస్థితుల్లో జీవనం కొనసాగిస్తున్న మరికొన్ని కుటుంబాలని కూడా ఇలానే పక్కన పెట్టేసారని అన్నారు. ప్రభుత్వం ఇచ్చే నెలసరి జీతాలను స్వీకరిస్తున్న వారు అర్హులైనప్పుడు గుడిసెలో ఉండే వారు ఎందుకు అనర్హులయ్యారని వారు విమర్శించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇలాగే కొనసాగితే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో  బిఆర్ఎస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పాలని బి ఎస్ పి  పార్టీ  అధ్యక్షుడు దేవునూరి భాస్కర్ భాస్కర్ అన్నారు.ఈ కార్యక్రమంలో శంకరపట్నం మండల బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షుడు దేవునూరి భాస్కర్, ఉపాధ్యక్షుడు దాసారపు మహేందర్ ,ప్రధాన కార్యదర్శి ఎదురుగట్ల సంపత్ స్వేరో, కార్యదర్శి చల్లూరి హరీష్ ,మండల బీవీఎఫ్ కన్వినర్ దాసారపు అరుణ్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.