ఈసారీ అధికారం మాదే

ఈసారీ అధికారం మాదే
  • ఇప్పటి కంటే ఐదు సీట్లు ఎక్కువే గెలుస్తాం 
  • కొందరు కొత్త బిచ్చగాళ్లలా వస్తున్నారు
  • ప్రజలు ఆగమాగం, గాయి గాయి కావద్దు 
  • 50 యేండ్లు అధికారమిస్తే కాంగ్రెస్ ఏం చేసింది?
  • బీజేపీ మోటార్లకు మీటర్లు పెడతామంటోంది
  • ధరణి వచ్చాకే రైతుల భూములకు భద్రత
  • సాగు పెరిగింది.. దిగుబడి భారీగా వస్తోంది
  • బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బాగా పని చేస్తున్నారు
  • సూర్యాపేట సభలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు


ముద్ర ప్రతినిధి, సూర్యాపేట:-గతంలో కంటే ఈసారి ఐదు అసెంబ్లీ సీట్లు ఎక్కువే గెలుస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. మూడోసారి బీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సూర్యాపేటలో సమీకృత నూతన కలెక్టరేట్, జిల్లా పోలీస్‌ కార్యాలయం, ఇంటిగ్రెటెడ్‌ వెజ్‌ అండ్‌ నాన్‌వెజ్‌ మార్కెట్‌, మెడికల్‌ కళాశాల భవనం, బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాన్ని ఆయన ఆదివారం ప్రారంభించారు. అనంతరం నూతన వ్యవసాయమార్కెట్‌ సమీపంలో జరిగిన బహిరంగసభలో ప్రసంగించారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు అద్భుతంగా పని చేస్తున్నారని కితాబిచ్చారు. రాష్ట్రంలో ఎన్నికలు రాగానే కాంగ్రెస్‌, బీజేపీవాళ్లు కొత్త బిచ్చగాళ్ల లెక్కన వస్తున్నారని, ప్రజలు ఆగం ఆగం, గాయి గాయి కావద్దని అన్నారు. 50 యేండ్లుగా ప్రజలకు ఏమీ చేయనోళ్లు మళ్లీ ‘తగుదునమ్మా’ అంటూ వస్తున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ కంటే పొడుగు, దొడ్డు ఉన్నవాళ్లు వచ్చి చేసిందేమిలేదన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఏనాడైనా రైతులకు కనీస మద్దతు ధర ఇచ్చే ఆలోచన చేసిందా అని ప్రశ్నించారు. ‘ఆపద్బంధు’ పేరుతో కాలయాపన చేసి 50 వేల రూపాయలు ముఖాన పడేశారని, వంద, రెండొందల పెన్షన్‌ ఇచ్చారని విమర్శించారు. అప్పుడు ఏమీ ఇవ్వలేనివారు ఇపుడు నాలుగు వేలు ఇస్తామని బీరాలు పలుకుతున్నారన్నారు. వారు అధికారంలో ఉన్న ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలన్నారు. బీజేపీ నేతలు మోటార్లకు మీటర్లు అంటారని, కాంగ్రెస్‌ వారు రోజుకు మూడు గంటలు కరెంటు చాలంటారని, బెంగళూరులోనే రోజుకు ఏడు గంటల కరెంట్‌ కట్‌ ఉందని, అలాంటి గతి మనకు రావాల్నా అని ప్రశ్నించారు. అరచేతిలో వైకుంఠం చూపే నాయకుల తీపిమాటలకు మోసపోతే గోసపడతామని హెచ్చరించారు. 

  • ధరణితోనే రైతుకు ప్రయోజనం

కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ధరణి తీసేస్తాం అంటున్నారని ధరణి ఉండాలా? వద్దా? ఉండాలన్నవారు చేతులెత్తాలని కేసీఆర్‌ కోరారు.  కాంగ్రెస్ పార్టీ వస్తే పైరవీకారుల రాజ్యం వస్తుందని చెప్పారు. రైతుబంధు, రైతుభీమా, సకాలంలో ఎరువులు, విత్తనాలు, కల్తీ విత్తనాలను అరికట్టడం ద్వారా రైతన్నల జీవితాల్లో వెలుగులు నిండాయన్నారు. వీఆర్‌ఓ వ్యవస్థను తీసేసామని, పాలివాళ్ళకు పగలు పెట్టి రాక్షసులుగా మారినందునే వారిని మార్చామన్నారు. గతంలో నల్లగొండ జిల్లాలో 15 రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు ఉండేవని, నేడు 87 రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలున్నాయని,  పదిహేను నిమిషాలలో రిజిస్ట్రేషన్‌, ఐదు నిమిషాలలో మ్యుటేషన్‌ అవుతుందని అన్నారు. నాలుగు కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని, బియ్యం మిల్లులు సరిపోవడం లేదన్నారు. రైస్‌మిల్లుల వారికి సరిపోను కోటి టన్నులు ధాన్యం అమ్ముతున్నామని, వేయి కోట్ల రూపాయల నష్టం వచ్చినా రైతులపేరున దిష్టి తీసి పారేస్తున్నామని, రైతుల అభివృద్ది, సంక్షేమం కోసం ఒక కమిట్‌మెంట్‌, సిద్దాంతంతో ముందుకుపోతున్నామని అన్నారు. 

  • వలస వెళ్లినవారు వాపస్‌

ఒకప్పుడు పాలమూరు ప్రజల గోసలు చూసి కంటనీరు పెట్టుకున్నామని, నేడు వలస వెళ్లిన తెలంగాణ ప్రాంతవాసులు తిరిగి వచ్చారని కేసీఆర్‌ చెప్పారు. పల్లెలన్నీ పచ్చపచ్చగా పంటచేలతో కళకళలాడుతున్నాయన్నారు. గ్రామసీమలు చల్లగున్నాయంటే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కారణమన్నారు. వెనుకబడిన కులాలవారికి  బీసీబంధు వేస్తూనే ఉంటామని, కులవృత్తుల ద్వారా వారు ఆర్థికంగా తమ కాళ్లపై తాము నిలబడతారన్నారు. ఇన్ని రకాలుగా ప్రజల కోసం పని చేస్తున్న బీఆర్‌ఎస్‌ సర్కార్‌ను మరోసారి బంపర్‌ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఇంకా ఈ బహిరంగసభలో మంత్రులు జగదీశ్ రెడ్డి, మహమూద్‌ అలీ, నిరంజన్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ గుజ్జ దీపికాయుగంధర్‌రావు, ఎమ్మెల్యేలు డాక్టర్‌ గాదరి కిశోర్‌కుమార్‌, నల్లమోతు బాస్కర్‌రావు, బొల్లంమల్లయ్యయాదవ్‌, కంచర్ల భూపాల్‌రెడ్డి, శానంపూడి సైదిరెడ్డి, రవీంద్రకుమార్‌, చిరుమర్తి, లింగయ్య, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పెరుమాళ్ల అన్నపూర్ణ, జడ్‌పి వైస్‌ చైర్మన్‌ గోపగాని వెంకటనారాయణగౌడ్‌, నాయకులు గండూరి ప్రవళ్లికాప్రకాశ్, ఉమామాధవరెడ్డి, కన్మంతరెడ్డి శశిధర్‌రెడ్డి, వేనేపల్లి చందర్‌రావు, నిమ్మల శ్రీనివాస్‌గౌడ్‌ ప్రజలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

  • సూర్యాపేటకు వరాల జల్లు
  • మున్సిపాలిటీకి రూ.25 కోట్లు, గ్రామానికి 10 లక్షలు
  • సూర్యాపేటకు 50 కోట్లు మంజూరు 

ముద్ర ప్రతినిధి, సూర్యాపేట: సూర్యాపేట జిల్లాకు సీఎం కేసీఆర్‌ వరాలు కురిపించారు. జిల్లాలోని 475 గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం రూ.10 లక్షల చొప్పున సీఎం నిధుల నుంచి మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆదివారం సూర్యాపేటలో నిర్వహించిన ప్రగతి నివేదన సభలో కేసీఆర్ మాట్లాడారు. జిల్లాలోని కోదాడ, హుజూర్‌నగర్‌, తిరుమలగిరి, నేరేడుచర్ల మున్సిపాలిటీలకు రూ.25 కోట్ల చొప్పున మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. సూర్యాపేట మున్సిపాలిటీకి ప్రత్యేకంగా రూ.50 కోట్లు మంజూరు చేస్తామని తెలిపారు. సూర్యాపేటకు కళాభారతి కావాలని మంత్రి జగదీశ్ రెడ్డి కోరారని.. రూ.25కోట్లతో కళాభారతిని మంజూరు చేస్తున్నానని సీఎం ప్రకటించారు. కలెక్టరేట్, ఎస్పీ ఆఫీసులకు దీటుగా కళాభారతిని నిర్మించాలని మంత్రి జగదీశ్ రెడ్డికి సూచించారు. ‘సూర్యాపేట కలెక్టరేట్‌ ప్రారంభోత్సవానికి వెళ్తుండగా చూస్తే వందలాది కొత్త బిల్డింగ్‌లు కనిపించినయ్. సూర్యాపేట అభివృద్ధిని కళ్లారా చూడాలని మొత్తం నాలుగు మూలలు తిరిగిన. అభివృద్ధిలో సూర్యాపేట దూసుకెళ్తున్నది.’ అని కేసీఆర్​అన్నారు. సూర్యాపేటకు కొత్త రోడ్లు కావాలని, మహిళా పాలిటెక్నిక్‌ కాలేజీ కావాలని మంత్రి అడిగారని.. దాన్ని కూడా మంజూరు చేస్తామని సీఎం తెలిపారు. స్టేడియం, స్పోర్ట్స్‌ స్కూల్‌ ఏర్పాటుకు కూడా వెంటనే జీఓ రిలీజ్‌ చేస్తామని చెప్పారు. మంత్రి జగదీశ్‌ రెడ్డి అడిగినట్లు ఆర్‌అండ్‌బీ గెస్ట్‌ హౌస్‌ కూడా మంజూరు చేయాలని ఆ శాఖ మంత్రి ప్రశాంత్‌ రెడ్డికి సూచించారు.