భేషుగ్గా సచివాలయం

భేషుగ్గా సచివాలయం
  • సీఎం ఛాంబర్​తో పాటు మంత్రుల ఛాంబర్ల పరిశీలన
  • అమరవీరుల స్థూపం పనులు త్వరగా పూర్తి చేయండి
  • సచివాలయం, అంబేద్కర్​ విగ్రహం, అమరవీరుల స్థూప నిర్మాణ పనుల పరిశీలనలో కేసీఆర్

ప్రధాన ద్వారం నిర్మాణంపై సంతృప్తి :

హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్​ శుక్రవారం ఉదయం తెలంగాణ నూతన సచివాలయం, అంబేద్కర్​ విగ్రహ నిర్మాణం, అమరవీరుల స్థూపం నిర్మాణ పనులను పరిశీలించారు.   తొలుత సచివాలయానికి చేరుకున్న కేసీఆర్ చివరి దశకు చేరుకున్న ఎలివేషన్ పనులను, ఫౌంటేన్, గ్రీన్ లాన్, టూంబ్ నిర్మాణం దానికి తుది దశలో అమరుస్తున్న స్టోన్ డిజైన్ వర్కు తదితర పనుల పురోగతిని పరిశీలించారు. సెక్రటేరియట్ ప్రధాన ద్వారం అత్యంత విశాలంగా నిర్మించిన తీరును, భోపాల్ నుంచి ప్రత్యేకంగా వుడ్ కార్వింగ్ చేసి తెప్పించి అమర్చిన ద్వారాన్ని పరిశీలించిన సీఎం  సంతృప్తి వ్యక్తం చేశారు. 

అనంతరం సీఎం చాంబర్ వుండే ఆరో అంతస్తులో  ఏర్పాటు చేసిన టేబుళ్లు, కుర్చీలు తదితర ఫర్నీచర్ ను సీఎం పరిశీలించి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని, అధికారులను, వర్క్ ఏజెన్సీ అధికారులను సీఎం అభినందించారు. సీఎం చాంబర్ లోని సమావేశ మందిరాన్ని పరిశీలించారు. సీఎంవో సిబ్బంది కోసం ఏర్పాటు చేసిన చాంబర్లను, అందులో అమరుస్తున్న  ఫర్నీచర్ ను తిలకించారు.  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చాంబర్ , వారి సిబ్బంది కోసం ఏర్పాటు చేసిన కార్యాలయాలు, కాన్ఫరెన్స్ హాల్ ,  సందర్శకులు వేచివుండే గదులు, అందులోని సౌకర్యాలను సీఎం పరిశీలించారు. జీఏడీ ప్రోటోకాల్ ప్రకారం సిబ్బందికోసం ఏర్పాటు చేసిన చాంబర్లను సీఎం పరిశీలించారు. కలెక్టర్ల కాన్పరెన్స్ హాల్, ప్రజాప్రతినిధుల కోసం ఏర్పాటు చేసిన వెయిటింగ్ లాంజ్, వీఐపీల వెయిటింగ్ లాంజ్ లను సీఎం పరిశీలించారు.

మంత్రులకు కేటాయించిన శాఖలన్నీ  ఒకే దగ్గర వుండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు, ఆ మంత్రికి చెందిన అన్ని శాఖల  సిబ్బంది  ఒకే చోట వుంటే బాగుంటుందన్నారు. ఆయా శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్యకు అనుకూలంగా కార్యాలయాలుండాలని కేసీఆర్ అధికారులకు సూచించారు.  సెక్రటేరియట్ లోపలకు వెళ్ళే ప్రధానమార్గాన్ని సీఎం కేసీఆర్ పరిశీలించారు. తాను అనుకున్నట్టుగానే సచివాలయ నిర్మాణం పనులు పూర్తికావచ్చాయని సంతోషం వ్యక్తం చేశారు. అక్కడినుంచి  నిర్మాణంలో వున్న డా. బిఆర్ అంబేద్కర్ విగ్రహ పనుల పురోగతిని కేసీఆర్ పరిశీలించారు. అక్కడ మొదటి అంతస్తుకు చేరుకున్న కేసీఆర్.. అంబేద్కర్ విగ్రహం బేస్ లో నిర్మిస్తున్న విశాలమైన హాళ్ళను ఆడియో విజువల్ ప్రదర్శనకోసం నిర్మిస్తున్న ఆడిటోరియం పనులు, బయట ఫౌంటేన్, లాండ్ స్కేపింగ్ తదితర పనులను పరిశీలించారు. పనుల నాణ్యతలో ఏమాత్రం లోటు రావద్దని స్పష్టం చేశారు. చారిత్రకంగా నిర్మితమవుతున్న డా. బిఆర్. అంబేద్కర్ విగ్రహం పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. అక్కడినుంచి తెలంగాణ అమర వీరుల స్మారకార్థం నిర్మిస్తున్న అమరవీరుల జ్యోతి నిర్మాణ పనుల పురోగతిని సీఎం కేసీఆర్ పరిశీలించారు. నిర్మాణ పురోగతిని ఇంజనీర్లు మ్యాపుల ద్వారా సీఎంకు వివరించారు. పనులపై సంతృప్తి వ్యక్తం చేసిన కేసీఆర్.. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి కొన్నిసూచనలు చేశారు. ముఖ్యమంత్రి వెంట మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్,  ఎమ్మెల్యేలు, విప్ బాల్క సుమన్, ఎ. జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ తాతా మధు,  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, రోడ్లు భవనాల శాఖ అధికారులు శ్రీనివాస్ రాజు, గణపతి రెడ్డి, ప్రభుత్వ నిర్మాణ సలహాదారు సుద్దాల సుధాకర్ తేజ, ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్  తదితరులున్నారు. కాగా కొత్త సెక్రటేరియట్ ను  ఏప్రిల్ 30న,  హుస్సేన్ సాగర్ పక్కనున్న స్మృతి వనాన్ని జూన్ 2న, డా. అంబేడ్కర్ విగ్రహాన్ని ఏప్రిల్ 14న ఆవిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది.