తాను చెప్పింది అబద్ధం అయితే ముక్కు భూమికి రాస్తా ..

తాను చెప్పింది అబద్ధం అయితే ముక్కు భూమికి రాస్తా ..
  • జీవన్ రెడ్డి సిద్ధమా అంటూ మంత్రి కొప్పుల ఈశ్వర్ సవాల్ 
  • రాజకీయంలో గెలుపు ఓటములు సహజం...
  • అవాస్తవాలను చెబుతున్న జీవన్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామంత్రి కొప్పుల 

 ముద్ర ప్రతినిధి, జగిత్యాల: రాజకీయంలో గెలుపు ఓటములు సహజమని, ప్రజలను మభ్యపెడుతూ అవాస్తవాలను చెబుతున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జిల్లా కేంద్రంలో మంత్రి  విలేకరులతో మాట్లాడుతూ గత నాలుగైదు రోజులుగా సాగునీటి రంగంపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలను తప్పుపట్టారు. సమాజంలో రాజకీయాల్లో ఉన్నప్పుడు గెలుపు ఓటములు సహజమని... కానీ అదే పనిగా ప్రజల్ని మభ్య పెట్టే రీతిలో అవాస్తవాలు చెబుతూ, తప్పుడు ప్రకటనలు చేస్తున్న తీరు ఆక్షేపణీయమని అన్నారు. షుగర్ ఫ్యాక్టరీ తెరిపించడంతో పాటుగా, ఇథనాల్ ప్రాజెక్ట్ నెలకొల్పే అంశంలో సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు అర్థరహితమన్నారు. 

ఆ ప్రాంత రైతులు చెరుకు పంట వైపు కాకుండా, వరి పంట వైపు మొగ్గు చూపుతున్నారని స్పష్టం చేశారు. అలాగే ఇథనాల్ ప్రాజెక్ట్ అంశంలో జీవన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు ఎంత మాత్రమూ నిజం లేదని మూడు కోట్ల లీటర్ల విషపు నీరు ఆ ప్రాంత జలాల్లో కలుస్తుందన్న మాటలు పూర్తి అబద్ధమని అన్నారు. ఒక్క చుక్క కూడా విషపు నీరు ఇథనాల్ ప్రాజెక్టుకు సంబంధించి ఆ ప్రాంత జలాల్లో కలవడం లేదని నిపుణులే స్పష్టం చేస్తున్నారని అన్నారు. ఈ విషయంలో నిపుణులు చెప్పింది అబద్ధమైతే.. తాను ఇదే జగిత్యాల పాత బస్టాండ్ చౌరస్తాలో ముక్కు భూమిపై రాయడంకు సిధ్దమనీ.. అందుకు జీవన్ రెడ్డి కూడా సిద్ధమేనా అని మంత్రి కొప్పుల ఈశ్వర్ సవాల్ విసిరారు.